అధికారపార్టీ ఎత్తులకు అంతూదరీ లేదు..
- నిషేధం ఉన్నా ఎగ్జిట్ పోల్ సర్వే ఎలా చేశారు?
- సర్వేల పేరుతో దొంగ లెక్కల ప్రచారం
- శ్రేణులను ఉత్సాహపరిచేందుకే గెలుపుపై లీకులు
- కాకినాడ ఎన్నికలకు బాగా పనిచేస్తారనే..
- అయినా ఇన్ని పొంతనలేని లెక్కలు అవసరమా?
- నంద్యాల సర్వేలపై విస్తుపోతున్న విశ్లేషకులు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: నంద్యాల ఎన్నికలలో విజయం ఎవరిదో బ్యాలెట్ బాక్సులలో నిక్షిప్తమై ఉంది. ఓటరు ఏ నిర్ణయం తీసుకున్నాడో 28న గానీ వెల్లడి కాదు. కానీ ఎగ్జిట్ పోల్స్ పేరిట, సర్వేల పేరిట రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని చానళ్లలోనూ, పత్రికలలోనూ, సోషల్‌మీడియాలోనూ ఒక పార్టీకి అనుకూలంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒకదానికొకటి పొంతన లేకుండా అనేక కాకిలెక్కలు ప్రచారంలో ఉన్నాయి. అసలు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉన్నా వాటిని ఎవరు నిర్వహించారు? అది ఎలా సాధ్యం? ఇక సర్వేల లెక్కలు ఒకదానితో ఒకటి పొంతన కుదరకపోవడాన్ని ఎలా చూడాలి? ఎందుకు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు? వీటన్నిటికీ ఒకటే సమాధానం.. నంద్యాల లెక్కలను చూసి శ్రేణులు కాకినాడ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేయాలి.. అన్న లక్ష్యంతోనే అధికారపార్టీ ఈ కాకిలెక్కలను ప్రచారం చేస్తోందని విశ్లేషకులంటున్నారు.
పొంతనలేని లెక్కలు..
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల కోసమే అధికారపార్టీ నంద్యాల ఉప ఎన్నికల ఫలితంపై కాకిలెక్కల సర్వేల కట్టుకథలు అల్లుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నెల 23వ తేదీన ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం నుంచి టీడీపీ నేతల్లో, శ్రేణుల్లో విశ్వాసం సన్నగిల్లకుండా ఉండటానికి, కాకినాడలో ప్రచారం కొనసాగించుకోవడానికి, ఓటర్లను నానా అడ్డదారుల్లో ప్రభావితం చేయడానికి వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడానికి పడరాని పాట్లు పడుతోందని అంటున్నారు.. అందులో భాగంగానే ఉప ఎన్నికల ఫలితంపై పూటకో మాట, రోజుకో లెక్క చొప్పున సర్వేల పేరిట ఊదరకొడుతూ విభిన్న రకాల లీకులు ఇప్పిస్తూ, అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటోందని విమర్శకులు అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలలో ఏ ఒక్క దానికి సరైన పొంతన, వాస్తవ విశ్లేషణ లేకపోవడమే ఇందుకు నిదర్శనమని వారు పేర్కొంటున్నారు.. చివరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలీసు నిఘా యంత్రాంగం పేరిట లీకుల రూపంలో వస్తున్న సర్వేలు కూడా విభిన్నంగా ఉంటుండటం పరిశీలనాంశమని అంటున్నారు.
కాకినాడ కోసమే ఈ కాకిలెక్కలు..
నంద్యాల ఉప ఎన్నికలో ఓటర్ల మద్దతును అంచనా వేసుకున్న చంద్రబాబు, ఆయన కోటరీ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశంపై సుదీర్ఘంగా చర్చించుకుందని తెలిసింది. నంద్యాల ఎన్నికల్లో మనదే గెలుపు అన్నరీతిలో భారీ ప్రచారం చేయాలని, లేదంటే కాకినాడలో కనీసం ప్రచారానికి కూడా నాయకులు, శ్రేణులను వెతుక్కోవాల్సి వస్తుందనే భావన పార్టీ ముఖ్యుల్లో వ్యక్తమైందనేది వినికిడి. పైగా ఆ జిల్లాలో ప్రభుత్వానికి, పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా అంచనా వేసింది. ఆదివారం సాయంత్రానికి కాకినాడ ప్రచారం ముగుస్తుందని, అప్పటి వరకు సర్వేల పేరిట లీకులిస్తూ పార్టీ క్యాడర్‌లో ఉత్సాహాన్ని కొనసాగింపజేయాలనే నిర్ణయానికి వచ్చిందని, అందులో భాగంగానే విభిన్న సర్వేలంటూ ఒక వర్గం మీడియాలో, వాట్సాప్ గ్రూప్‌ల్లో హల్‌చల్ చేయిస్తోంది.
చంద్రబాబుకు వత్తాసుగా ఉంటున్న ఓ పత్రిక, ఛానెల్, మరో ఛానెల్ సర్వేలు చేయించిందనేది బహిరంగ రహస్యం. ఆ మీడియా ఏంచెప్పినా, ఎంత చెప్పినా ప్రజలు విశ్వసించరని ప్రభుత్వాధినేతకు తెలుసు. దీన్ని నమ్మకమైన వ్యక్తి ద్వారా చెప్పించాలని చంద్రబాబు వ్యూహం పన్నారని ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఎన్నికల సర్వేలు తనకు హాబీ అని, వాటిని చేయిస్తుంటానని లగడపాటి స్వయంగా వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. నంద్యాల ఉప ఎన్నిక సర్వే ఫలితాలు కూడా ఆయన ద్వారా వెల్లడింపజేస్తే ప్రజలు విశ్వసిస్తారని చంద్రబాబు అంచనా వేసినట్లు తెలుస్తోంది. ‘నంద్యాల ఉప ఎన్నికలపై నేను సర్వే చేయించలేదు. కానీ సర్వేచేసిన టీం నాకు తెలుసు. వారు చెప్పిన విషయాలనే నేను మీడియాకు చెపుతున్నాను. టీడీపీకి అనుకూలంగా ఫలితం ఉంటుంది’ అని లగడపాటి మీడియా ఎదుట స్పష్టంగా చెప్పారు.
ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు..
ఓటుకు దాదాపు రూ.5,000 తో పాటు చీరలు, ముక్కుపుడకలను పంపిణీ చేయించినా జనామోదం లభించలేదని ముఖ్యమంత్రి సభలకు హాజరైన జనాన్ని చూసి అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. మరోవైపు తన వద్ద డబ్బు లేదని, అధికారం లేదని, ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించే చానళ్లు పత్రికలు లేవని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వాడవాడలా ఎలుగెత్తి చెప్పారని, అయినా ఆయన సభలకు జనం ఇసుకేస్తే రాలనంతగా హాజరయ్యారని, దీనిని బట్టే జనం ఎటువైపు ఉన్నారో అర్ధమౌతోందని వారు వాఖ్యానిస్తున్నారు. అయినా ఎగ్జిట్ పోల్స్, సర్వేల పేరుతో తప్పుడు లెక్కలు ఎందుకు ప్రచారం చేస్తున్నారో తేలికగానే అర్ధం చేసుకోవచ్చని వారు పేర్కొంటున్నారు.
‘నంద్యాల ఫలితం వ్యతిరేకంగా రాబోతోందని తేలితే శ్రేణులు డీలా పడిపోతాయి. దానివల్ల కాకినాడ కూడా కోల్పోవాల్సి వస్తుంది. అందుకే నంద్యాలలో మనం జయకేతనం ఎగురవేయబోతున్నామని ప్రచారం చేస్తే కాకినాడ కోసం ఉత్సాహంగా పనిచేస్తారు అందుకే ఇలా సర్వేలను జనంలోకి వదిలాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని తెలుగుదేశం నాయకుడొకరు వ్యాఖ్యానించారు. సాధారణంగా ఏ ఉప ఎన్నిక జరిగినా అధికార పార్టీయే గెలుస్తుండడం సహజమే కాబట్టి తమ ప్రచారాన్ని ఎవరూ తప్పుబట్టలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే మరీ ఇన్ని కాకిలెక్కలు అవసరమా, రేపు ఫలితం కాస్త అటూ ఇటు అయితే ఏం చెబుతారని అడిగితే జనానికి అన్నీ గుర్తుండవని, ముందు కాకినాడలో గట్టెక్కేయడమే తమ నాయకుడి లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు.