అందని ఆధారం | Despite the evidence of the govt Plans | Sakshi
Sakshi News home page

అందని ఆధారం

Published Sat, May 31 2014 2:04 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

Despite the evidence of the govt Plans

కనీస కూలి దక్కక చేనేత షెడ్డుకార్మికుల ఇక్కట్లు
 విద్యకు దూరంగా..మగ్గాలపైనే మగ్గిపోతున్న బాల్యం
 అందని ప్రభుత్వ సాయం

 
 అందమైన వస్త్రాలను నేసేవారు కట్టు బానిసత్వంలో మగ్గిపోతున్నారు. మాస్టర్‌వీవర్ల దయాదాక్షిణ్యాలపై రోజులు వెళ్లదీయాల్సిన దుస్థితిలో దుర్భర జీవితాలు గడుపుతున్నారు. చేసిన శ్రమకు తగిన కూలి అందక..కుటుంబాలు గడవక అప్పులపాలై షెడ్డు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
 
 వస్త్ర వ్యాపారానికి చిన ముంబాయిగా పేరుపొందిన చీరాలలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన ఘనకీర్తి ఉన్న వారు నేడు తినేందుకు తిండిలేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. వేలాది మంది చేనేత కార్మికుల బతుకులు తరాల నుంచి మగ్గాల మధ్య ఛిద్రమవుతున్నాయి. ప్రభుత్వం నుంచి కనీస సాయం కూడా వీరికి అందడం లేదు.

మాస్టర్ వీవర్ వద్ద పనిచేసే షెడ్డు కార్మికులకు విద్య, వైద్య సౌకర్యాలు అందని ద్రాక్షగానే ఉన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది కార్మికులు మాస్టర్ వీవర్ల వద్ద పనిచేస్తున్నారు. మాస్టర్ వీవర్ చిన్నచిన్న షెడ్లు నిర్మించి అక్కడ వారిని ఉంచి..చీరలు, ఇతర దుస్తులు నేసేందుకు కొంత మొత్తం పెట్టుబడిగా అందజేస్తాడు. ఆ మొత్తం తీసుకున్న క్షణం నుంచి కార్మికుడిది బానిస బతుకే అవుతోంది. ఆ రోజు నుంచి కుటుంబమంతా కలిసి పనిచేస్తే రోజుకు వంద రూపాయల కూలి వస్తుంది. దీంతోనే షెడ్డుకు అద్దె, తిండి ఖర్చులు చూసుకోవాలి. అక్కడ నుంచి వెళ్లాలంటే మాస్టర్ వీవర్ అందజేసిన పెట్టుబడి డబ్బులు తిరిగివ్వాలి. మాస్టర్ వీవర్ ఇచ్చే వందరూపాయల కూలీ తినడానికే సరిపోకుంటే..పెట్టుబడి డబ్బులివ్వలేక..కొందరు అర్ధరాత్రి ఎవరికీ చెప్పకుండా పారిపోతుంటారు. లేదా ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు.  

చీరాల పరిసర ప్రాంతాలైన చీరాల, ఈపురుపాలెం, రామకృష్ణాపురం, జాండ్రపేట, ఆమోదగిరిపట్నంతో పాటు మరికొన్ని గ్రామాల్లో ఈ షెడ్లు ఉన్నాయి. గతంలో 224 షెడ్లు ఉండగా..1451 మగ్గాలపై పనిచేసేవారు. ఇప్పుడు అవి కూడా తగ్గిపోతున్నాయి. కంప్యూటర్ ద్వారా డిజైన్లు తయారుచేసి..యంత్రాలపై చీరలు తయారు చేస్తున్నారు. దీంతో మగ్గం పనితప్ప మరొకటి తెలియని షెడ్డు కార్మికులు ఉపాధి తగ్గిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కెట్‌లో చేనేత వస్త్రాలకు పూర్తి స్థాయిలో డిమాండ్ లేకపోవడం..ప్రభుత్వం సహకరించకపోవడంతో చేనేత రంగం నానాటికీ సంక్షోభంలోకి వెళ్తోంది.  

 చదువు లేక మగ్గాలపైనే చితికిపోతున్న బాల్యం...

 చేనేత కార్మికుల పిల్లలు పేదరికం కారణంగా విద్యకు దూరమై మగ్గం పనికే పరిమితమవుతున్నారు. పిల్లలపై కూడా కుటుంబ పోషణభారం పడుతోంది. ఆడపిల్లల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది. కొందరు కార్మికులు అప్పులు చేసి మగపిల్లల్ని చదివిస్తున్నా..ఆడపిల్లల్ని మాత్రం మగ్గాలకే పరిమితం చేస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో సుమారు 5 వేల మందికిపైగా పిల్లలు బడిమాని మగ్గం పనిలో ఉన్నట్లు సమాచారం. పోషకాహార లోపం కూడా పిల్లల్ని వేధిస్తోంది.  

 టెక్స్‌ైటె ల్ పార్కు ఎక్కడ..

గత యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన టెక్స్‌టైల్ పార్కును ఈ ప్రాంతంలో నిర్మిస్తే..కొంత వరకు వీరి జీవితాలు బాగుపడే అవకాశం ఉంది. 40 ఏళ్లుగా వేటపాలెంలో ఈ వృత్తినే నమ్ముకున్న కొయ్యా వెంకట్రావు మాట్లాడుతూ ‘నేను 12 ఏళ్ల వయసులో ఈ పనిలోకొచ్చాను. మా తండ్రి కూడా ఇదే పనిచేసేవాడు. 25 ఏళ్లు వచ్చేసరికి నాకు పెళ్లయింది. నా కొడుకును స్కూలుకు పంపే స్థోమత లేక..ఇదే పనిలో పెట్టుకున్నాను. కుటుంబమంతా కలిసి పనిచేస్తేనే మూడు పూటలా తినగలుగుతాం. మూడేళ్ల క్రితం మంత్రిగారొచ్చారు. ఆమె టెక్స్‌టైల్ పార్కు పెడతాం..మీ బతుకులు మారిపోతాయన్నారు. తరువాత ఆమె రాలేదు. టెక్స్‌టైల్ పార్కూ రాలేదు. మా జీవితాలు మాత్రం ఇలానే ఉన్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement