కావలి, న్యూస్‌లైన్ : సోమశిల ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ కావలి కాలువ ఆయకట్టు రైతులు సాగునీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువకు నీరు విడుదల చేసినా చినక్రాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు కూడా చేరని పరిస్థితి నెలకొంది. దీని కారణంగా ఇటీవలే రూ. 74 లక్షలతో చేపట్టిన పూడికతీత పనులు నాసిరకంగా చేపట్టడమేనని రైతులు ఆరోపిస్తున్నారు. తీరు పైర్లు ఎండు దశకు చేరుకుంటున్నాయి.
ఈ పరిస్థితితో తమకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఐఏబీ నిర్ణయం మేరకు కావలి కాలువ ఆయకట్టు కింద సుమారు 70 వేల ఎకరాలకు పైగా చేపట్టి వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. సంగం బ్యారేజీ నుంచి కావలి కాలువ చివరి వరకు సుమారు 57 కిలో మీటర్ల ఉంది. ఈ కాలువ ద్వారా 55 చెరువుల వరకు సాగు నీరు అందుతుంది. ఐఏబీ సమావేశంలో 74 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అధికారులు తీర్మానించారు. అందుకు గత నెలలో రూ.74 లక్షలతో కాలువలో పూడిక తీత పనులు చేపట్టారు. అయితే పూడికతీత పనులను హడావుడిగా నాసిరకంగా చేశారు. దీంతో అప్పట్లో రైతులు పనులపై ఆందోళన వ్యక్తం చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోలేదు.
ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం సంగం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేస్తే కాలువలో నీరు ముందుకు సాగలేదు. సకాలంలో నీటి విడుదల జరుగుతుందని భావించిన రైతులు ఎంతో ఆశతో కావలి రూరల్, జలదంకి, బోగోలు, దగదర్తి మండలాల్లో కావలి కాలువ ఆయకట్టు రైతులు వరి సాగు చేపట్టారు. అయితే ఈ రోజు నాటికి నీరు కాలువలో పారకపోవడతో పైర్లు ఎండుతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో సాగునీరు ఆయకట్టు పొలాలకు అందకుంటే వరి పైర్లు ఎండిపోతాయని వ్యవసాయశాఖ అధికారులే చెబుతున్నారు. అయితే ఐఏబీ నిర్ణయం మేరకు ఈ సీజన్‌లో సాగునీరు అందివ్వడం సాధ్యం కాదని సోమశిల ప్రాజెక్టు అధికారులు చావు కబురు చల్లగా చెబుతున్నారు. కావలి కాలువ కింద హనుమకొండపాళెం మేజర్, గౌరవరం మేజర్‌కు ఈసారి సాగునీరు అందివ్వడం ఎంతో కష్ట సాధ్యమని చెపుతున్నారు.
పుష్కలంగా నీళ్లున్నా..
చేతులెత్తేస్తున్నారు
సోమశిల జలాశయంలో పుష్కలంగా నీళ్లున్నా.. కావలి కాలువకు నిర్ణయించిన మేరకు కూడా నీళ్లివ్వలేమని అధికారులు చెబుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
ఐఏబీ సమావేశం జరిగిన అక్టోబరు 21వ తేదీ నాటికి సోమశిల జలాశయంలో 48 టీఎంసీలు నీటి నిల్వ ఉంది. అప్పటి నీటి నిల్వననుసరించి కావలి కాలువ కింద 74 వేల ఎకరాలకు మాత్రమే నీటిని అందించగలమని అధికారులు, పాలకులు ప్రకటించారు. ఆ తర్వాత ఎగువ ప్రాంతాల నుంచి జలాశయానికి సుమారు 68 టీఎంసీలకు పైగా నీరొచ్చింది. ఈ తరుణంలో ముందు నిర్ణయించిన దాని కంటే అదనంగా నీటిని విడుదల చేస్తామని అధికారులు, పాల కులు చెప్పారు. అయితే ప్రస్తుతం ఐఏబీ నిర్ణయం మేరకు కూడా నీటిని విడుదల చేయలేమని చెబుతున్నారు. జలాశయం లో నీటి నిల్వ పూర్తి స్థాయిలో ఉండి కూడా నీటిని విడుదల చేయలేకపోవడం వెనక రాజకీయ దురుద్దేశంతో పాటు కావలి కాలువలో చేపట్టిన తాత్కాలిక పూడిక తీత పనుల్లో జరిగిన అక్రమాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
సాగు సంక్షోభం
Published Fri, Dec 13 2013 3:42 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement