
నిర్ణయాత్మక ప్రతిపక్ష ‘శక్తి’ జగన్
వేమవరం (గుడ్లవల్లేరు), న్యూస్‌లైన్ : రాబోయే టీడీపీ ప్రభుత్వాన్ని అభివృద్ధి విషయంలో గాడిలో పెట్టేందుకు రాష్ట్రంలోనే నిర్ణయాత్మక ప్రతిపక్ష శక్తిగా వైఎస్సార్ సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటారని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఎమ్మెల్యేగా వైఎస్సార్ సీపీ తరఫున కల్పన గెలుపొందితే వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకుంటామని మొక్కుకున్న పెదపారుపూడి మండలం యలమర్రు సర్పంచి సుంకర సత్యనారాయణ ఆదివారం రాత్రి అమ్మవారి సన్నిధిలో మొక్కుబడులు తీర్చుకున్నారు.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కల్పన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కైన రాజకీయాలు ప్రజలు అర్ధం చేసుకున్నారని తెలిపారు. వైఎస్సార్ సీపీని ఎదుర్కొనేందుకు కుట్ర, కుతంత్రాలతో ఆ పార్టీలు చేసిన జిమ్మిక్కులు ఇన్నీఅన్నీ కావన్నారు. పార్టీ శ్రేణుల సహకారంతో మున్ముందు తమ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేస్తుందని తెలిపారు.
వారు ఎన్ని గారడీలు చేసినా వాటిని ఛేదించుకుని తన నియోజకవర్గ ప్రజలు తనకు విజయాన్ని అందించారని కృతజ్ఞతలు తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలంతా తనను తోబుట్టువులా భావించి, గెలిపించారని చెప్పారు. తన విజయాన్ని తన నియోజకవర్గ ప్రజలకే అంకితం చేస్తున్నానని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆశీస్సులతో జగన్ నాయకత్వంలో తన నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తానని చెప్పారు. ఎన్నికల హామీలను నెరవేరుస్తానని అన్నారు.
వైఎస్సార్ సీపీ శ్రేణులు కలత చెందవద్దు...
వైఎస్సార్ సీపీకి విజయం దక్కిందని పామర్రు నియోజకవర్గంలో తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించేందుకు కాంగ్రెస్, టీడీపీకి చెందిన దుష్టశక్తులు తయారయ్యాయని ఎమ్మెల్యే కల్పన అన్నారు. తమ కార్యకర్తల్ని భయబ్రాంతులకు గురి చేయవచ్చుననే వారి పన్నాగాన్ని సాగనివ్వమని తెలిపారు. అన్యాయంగా కేసులు బనాయిస్తే, కార్యకర్తలకు తాము అండగా ఉన్నామన్నారు. వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఆమె వైఎస్సార్ సీపీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనరు చిత్తర్వు నాగేశ్వరరావుతో తన నియోజకవర్గంలో కార్యకర్తలపై వేధింపుల గూర్చి వివరించారు. పార్టీ లీగల్ సెల్ పరంగా పార్టీ కార్యకర్తలకు న్యాయపరంగా తమ అండదండలు ఉంటాయని చిత్తర్వు చెప్పినట్లు ఆమె తెలిపారు. యలమర్రు సర్పంచి సుంకర సత్యనారాయణ మాట్లాడుతూ తమ సొంత సోదరిని గెలుపించుకుందామన్నట్లుగా ఎమ్మెల్యే కల్పన వెంట ఉన్నామన్నారు. యలమర్రు ఎంపీటీసీ సభ్యురాలు నాగభవాని, పార్టీ నేత డేవిడ్ తదితరులు సమావేశంలో ఉన్నారు.