
వర్ల రామయ్యకు మతి భ్రమించింది: కల్పన
నామినేటెడ్ పదవి రాలేదనే నిరాశతో టీడీపీ నేత వర్ల రామయ్యకు మతి భ్రమించిందని పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మండిపడ్డారు. ప్రచారంలో తన భర్త పాల్గొనలేదని, తన కుటుంబంపై అనవసర విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. ప్రజలు ఛీత్కరించినా వేదికలు ఎక్కి మాట్లాడటం వర్ల రామయ్యకు సరికాదని ఆమె విమర్శించారు. పోలీసు ఉద్యోగం నుంచి ఆయన ఎందుకు వీఆర్ఎస్ తీసుకున్నారో సమాధానం చెప్పాలని కల్పన డిమాండ్ చేశారు.
తన అవినీతిని కప్పిపుచ్చుకోడానికే ఆయనిలా చేయలేదా అని ప్రశ్నించారు. అసైన్డ్ భూములను కబ్జా చేసి లక్షల రూపాయలు దండుకున్న ఘనత రామయ్యదని ఆమె అన్నారు. దళిత ఎమ్మెల్యేనైన తనను ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి వేధిస్తున్నారని వాపోయారు. వర్ల రామయ్యపై తాను మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని, ఆయన అవినీతి బాగోతంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని హెచ్చరించారు.