‘వర్ల’ వస్తే జన్మభూమిని అడ్డుకుంటాం
రిమ్మనపూడి(పామర్రు) : ప్రజాప్రతినిధి, అధికారులను కాదని టీడీపీ నాయకుడు వర్ల రామయ్యను వేదికపైకి ఆహ్వానిస్తే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాలను అడ్డుకుంటామని స్థానిక ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన హెచ్చరించారు. మండలంలోని రిమ్మనపూడి గ్రామంలో సోమవారం జన్మభూమి కార్య క్రమం జరిగింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేయకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంల్రు కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణ, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వెళ్లిపోయారు. దీంతో లబ్ధిదారులు ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని గుర్తించిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వెంటనే స్పందించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జన్మభూమిలో ప్రొటోకాల్ పాటించాలని, సంబంధం లేని వారిని వేదికపైకి ఆహ్వానించవద్దని అధికారులకు సూచించారు. ఎటువంటి సంబంధం లేకపోయినా జన్మభూమి కార్యక్రమంలో వర్ల రామయ్య పాల్గొంటున్నారని విమర్శించారు. ఆయన పాల్గొనడాన్ని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు వ్యతిరేకిస్తే వారిని బయటకు పంపాలని వర్ల రామయ్య పోలీసులను ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. కొన్నిచోట్ల వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దాడులకు దిగడం దారుణమన్నారు. సీఎం చద్రబాబు మాటలను కూడా ధిక్కరిస్తున్న వర్ల రామయ్య వల్ల జన్మభూమి కార్యక్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. ఇప్పటికైనా మంత్రులు, టీడీపీ నాయకులు స్పందించి వర్ల రామయ్యను జన్మభూమిలో పాల్గొనకుండా చూడాలని హితవుపలికారు. ఎంపీడీవో రామనాథం టీడీపీ నాయకులతో కలిసి సభాస్థలి నుంచి వెళ్లిపోవడంపై కల్పన ఆగ్రహం వ్యక్తంచేశారు.
వృద్ధురాలికి గాయం.. పరామర్శించిన ఎమ్మెల్యే
జన్మభూమి సందర్భంగా జరిగిన తోపులాటలో తులశమ్మ అనే వృద్ధురాలిపై పలువురు పడిపోయారు. ఆమె కాలికి గాయమైంది. స్థానిక వైద్యులు చికిత్స చేశారు. తులశమ్మను ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పరామర్శించి పింఛను సొమ్ము రూ.1,000ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బీవీ రాఘవులు, కొలుసు ఆదిలక్ష్మి పాల్గొన్నారు.