సాక్షి, విజయవాడ: బస్సులో ప్రయాణిస్తున్న యువకుడి పట్ల ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అనుచిత ప్రవర్తన, అభ్యంతరకర వ్యాఖ్యలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఎంపీ వరప్రసాద్ శుక్రవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వర్ల తీరును ఆక్షేపించారు.
(చదవండి: నువ్వు మాదిగా? ఇంకేం చదువుతావ్)
‘‘మచిలీపట్నం బస్టాండ్‌లో ఆకస్మిక తనిఖీకి వెళ్లిన వర్ల రామయ్య.. తన స్థాయిని మర్చిపోయి ఓ యువకుడిని ఉద్దేశించి వాడు, వీడు అని దుర్భాషలాడారు. పక్కనున్న టీడీపీ నాయకులు ఆయన్ని ఇంకాస్త రెచ్చగొట్టారు. ఇంగితజ్ఞానం కూడా మర్చిపోయి.. నీ కులమేంటని ప్రశ్నించారు. ఫోన్ వాడితే పనికిరాకుండాపోతావని తిట్టిపోశారు. ఏం? వర్ల రామయ్యగారి పిల్లలు ఫోన్లు వాడరా? పేదలకు ఒక న్యాయం, రామయ్య బిడ్డలకు ఒక న్యాయమా? అసలు కులం అడగటం ఏం సంస్కృతి? ఆయన అనాల్సిన మాటలేనా అవి!’’ అని ఎంపీ వరప్రసాద్ వాపోయారు.
యథా బాబు.. తథా రామయ్య: గతంలో దళితులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా దారుణంగా మాట్లాడారు. కనీసం క్షమాపణలు చెప్పినట్లు కూడా చెప్పలేదు. ఇక ఆయన కింద పనిచేసే నాయకులు అంతకంటే గొప్పగా మాట్లాడతారని అనుకోలేం’ అని వరప్రసాద్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment