బార్‌అసోసియేషన్‌ కాదు.. బ్యారేజ్‌ దగ్గరికి రా.. | YSRCP spokesperson Sudhakar Babu challenge to TDP | Sakshi
Sakshi News home page

బార్‌అసోసియేషన్‌ కాదు.. బ్యారేజ్‌ దగ్గరికి రా..

Published Fri, Dec 22 2017 6:10 PM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM

YSRCP spokesperson Sudhakar Babu challenge to TDP - Sakshi

చంద్రబాబు ఫొటోతో బిట్‌కాయిన్‌ రామచంద్రారెడ్డి ప్రచార చిత్రాన్ని చూపుతోన్న వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు

సాక్షి, విజయవాడ : ‘‘మీరు నిజంగా టీడీపీకి చెందినవారైతే.. మాట మీద నిలబడే దమ్ముంటే.. జనవరి 1న ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీ దగ్గరికి రండి! ‘బిట్‌ కాయిన్‌’తోపాటు 100 అంశాలపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరిని తెచ్చుకుంటారో మీ ఇష్టం. కానీ చర్చకు రావాల్సిందే. శాంతిభద్రతల పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చెయ్యొద్దు. మాది తప్పని తేలితే బేషరతుగా క్షమాపణలు చెబుతాం. మీరు తప్పని తేలితే, వైఎస్‌ జగన్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసింనందుకు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి టీజేఆర్‌ సుధాకర్‌ బాబు..  అధికార పార్టీ నేతలకు సవాలు విసిరారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఏమిటి వివాదం? : సైతం రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి బిట్‌ కాయిన్‌ ఇండియా సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌ అనే సంస్థను నెలకొల్పి, సుమారు రూ.200 కోట్ల డిపాజిట్లు సేకరించి మోసానికి పాల్పడ్డారు. ఆయనకు వైఎస్సార్‌సీపీతో సంబంధాలున్నాయని టీడీపీ నేత వర్ల రామయ్య విమర్శిస్తూ.. ఈ విషయంలో ఎలాంటి చర్చకైనా సిద్ధమేనని ప్రకటించారు. కాగా, అక్రమాలకు పాల్పడిన రామకృష్ణారెడ్డి నిజానికి చంద్రబాబు మనిషేనని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు జవాబిచ్చారు. అన్ని అంశాలపై వర్ల రామయ్య చెప్పినట్లు బార్‌ అసోసియేషన్‌ ఆఫీసులో కాకుండా ప్రకాశం బ్యారేజీ దగ్గరే పబ్లిక్‌గా చర్చిద్దామని అన్నారు.

మిస్టర్‌ వర్ల రామయ్యా.. రా : సైతం రామకృష్ణారెడ్డి గతంలో సేవాదళ్‌లో పనిచేసిన మాట వాస్తవమైనా, అక్రమార్కుడన్న సంగతి తెలిసి పార్టీ నుంచి గెంటేశామని, మాటవినకుంటే వైఎస్సార్‌ ఫౌండేషన్‌ తరఫున లీగల్‌ నోటీసులు కూడా పంపామని సుధాకర్‌బాబు తెలిపారు. వైఎస్సార్‌సీపీతో తనకు సంబంధంలేదని రామకృష్ణారెడ్డి పత్రికాముఖంగా పేర్కొన్న విషయాన్ని సైతం గుర్తుచేశారు. వాస్తవం ఇలా ఉంటే, వర్ల రామయ్య మాత్రం ప్రతిపక్షనేతపై నిరాధారమైన ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని సుధాకర్‌బాబు ప్రశ్నించారు. ‘‘మిస్టర్‌ వర్ల రామయ్యా.. దమ్ముంటే జనవరి 1న, ఉదయం 10 గంటలకు ప్రకాశం బ్యారేజీ దగ్గరికి రా.. చర్చకు భయపడి పారిపోకు. ‘బిట్‌ కాయిన్‌’ రామకృష్ణారెడ్డి.. చంద్రబాబు ఫొటోలతో సంస్థకు పబ్లిసిటీ ఇచ్చుకున్న విషయం, ఆయన కుంభకోణంలో బాబుకు, ఆయన కుమారుడు లోకేశ్‌కు వాటాలున్న విషయం అన్నింటిపైనా మాట్లాడుదాం. ఇదొక్కటేకాదు.. గతంలో ముఖ్యమంత్రి సైతం ప్రతిపక్షనేతను ఉద్దేశించి అడ్డగోలుగా మాట్లాడారు. తీరా ఆధారాలు చూపమంటే తోకముడిచి పారిపోయారు. వాటన్నింటికీ సమాధానాలు చెప్పాలి’’ అని సవాలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement