'వాపుని బలుపుగా చూపించుకుంటున్నారు'
పామర్రు : ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత మంది ఒత్తిడి తెచ్చినా తాను మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టేది లేదని ఆ పార్టీ నాయకురాలు, కృష్ణాజిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన స్పష్టం చేశారు. మంగళవారం కృష్ణాజిల్లా పామర్రులోని పార్టీ కార్యాలయంలో ఉప్పులేటి కల్పన విలేకరులతో మాట్లాడారు. కొందరు ఎమ్మెల్యేలు స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర పార్టీలోకి వెళ్లినందు వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా దుకాణం సర్దేసిందని ఎద్దేవా చేశారు. అలాంటి పార్టీ ఆంధ్రలో బలంగా ఉన్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టాలని గత ఎన్నికల తర్వాత నుంచి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
తమ పార్టీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి... బ్లాక్‌మెయిల్ చేసి... బెదిరించి టీడీపీలోకి తీసుకెళ్లి వాపుని బలుపుగా చూపించుకుంటున్నారని విమర్శించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ప్రాధాన్యమిచ్చి శాసనసభా ప్రజాపద్దుల సమితి (పీఏసీ) చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించినా తన గౌరవాన్ని కాపాడుకోలేకపోయారని అన్నారు. కడప జిల్లా టీడీపీలో ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయాయన్నారు. దీంతో టీడీపీ పతనం అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.
తమ పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలే వెళ్లారు కాని... పార్టీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదని తెలిపారు. భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి అప్పట్లో పార్టీ అధ్యక్షుడు జైల్లో ఉండగా విజయమ్మతోపాటు స్థానిక మహిళానాయకులతో కలిసి కాంగ్రెస్, టీడీపీలపై పోరు చేశారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. భూమా పార్టీ మారడంతో శోభానాగిరెడ్డి ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఇప్పటికైనా భూమా నాగిరెడ్డి సిగ్గుతెచ్చుకోవాలన్నారు.
తమ సొంత లాభాల కోసం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పార్టీని విడిచిపెట్టి వెళ్లారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని చంద్రబాబు పార్టీ మారినవారికి ఇచ్చిన హామీలను ఏవిధంగా నెరవేరుస్తారని ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలకు రెండేళ్ల నుంచి నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరు చేయని చంద్రబాబు ఓడిపోయినవారికి మాత్రం నామినేటెడ్ పదవులిచ్చి అందలం ఎక్కిస్తున్నారని విమర్శించారు. భవిష్యత్తు లేని పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీలోకి వెళ్లి సదరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ భవిష్యత్తు లేకుండా చేసుకున్నారన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడలేనివారే పార్టీ మారతారని అన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు అబ్దుల్ మొబీన్, పామర్రు ఉప సర్పంచ్ ఆరేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.