బాహుబలి సినిమాలో ఉపయోగించిన ప్రిన్స్ గీసిన దేవసేన చిత్రం
మీరు బాహుబలి సినిమా చూశారా? అందులో భల్లాలదేవ పాత్రధారి రాణా.. తల్లి పాత్రధారి రమ్యకృష్ణకు కుంతలదేశ యువరాణి పాత్రధారి అనుష్క చిత్రాన్ని చూపించే సన్నివేశం గుర్తుందా? ఆ చిత్రాన్ని గీసింది ఎవరో కాదు. మన తణుకు చిన్నారే.. పేరు ప్రిన్స్ విజయన్.
తణుకు టౌన్ : తిరిగిపల్లి ప్రిన్స్ విజయన్ ప్రస్తుతం తణుకులోని శశి ఇంగ్లిష్ మీడియం స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి రాజేంద్రకుమార్ గతంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో ప్రిన్స్ కుటుంబం హైదరాబాద్‌లో నివసించేది. అప్పట్లో హైదరాబాద్ ఎన్‌ఎంఆర్ పాఠశాలలో ప్రిన్స్ చదివేవాడు. కార్టూన్ చానల్స్ ఎక్కువగా చూడడం వల్ల అతనికి చిత్రలేఖనంపై ఆసక్తి కలిగింది. 2013 ఆగస్టులో అతను ఐదో తరగతి చదువుతుండగా, బాహుబలి చిత్ర బృందం ‘బాహుబలి లాస్ట్ లెసన్స్’ అనే పేరుతో చిత్రంలో కుంతల దేశ యువరాణి దేవసేనకు ఎటువంటి ఆభరణాలు ఉండాలి అనే అంశంపై విద్యార్థులకు చిత్ర లేఖనం పోటీలను నిర్వహించారు.
ఈ పోటీలలో మొత్తం 65 మంది పాల్గొనగా 12 మంది ఎంపికయ్యారు. వీరిలో నుంచి నలుగురిని చిత్రబృందం ఎంపిక చేసింది. వీరిలో ముగ్గురు ఉత్తరాది వారు కాగా.. నాలుగో వ్యక్తి ప్రిన్స్. ఈ నలుగురికీ మరోమారు రామోజీఫిలిం సిటీలో పోటీ పెట్టడానికి 2013 సెప్టెంబరు 14న విజయన్‌కు సెలవు ఇవ్వాలని కోరుతూ స్వయంగా బాహుబలి చిత్రబృందం ఎన్‌ఎంఆర్ స్కూల్‌కు లేఖను కూడా రాసింది. అప్పట్లో మంచి చిత్రాలు గీసిన విజయన్ ఆ తర్వాత తణుకు వచ్చేయడంతో వాటి గురించి మరిచిపోయాడు.
విజయన్ చిత్రం
బాహుబలిలో విజయన్ చిత్రం ఉండడంతో.. ఆ బొమ్మ గీసింది ఎవరని ఓ తమిళ టీవీ విచారణ చేసింది. అది విజయన్ అని తెలియడంతో ఆ టీవీ బృందం తణుకు వచ్చి విజయన్‌ను ఇంటర్వూ్య చేసింది. బాహుబలిలో చూపించిన చిత్రం కింద విజయన్ పేరుపై పెయింట్ వేశారు. దీంతో అది విజయన్ చిత్రమని తెలియకుండా పోయింది. తమిళ టీవీ ప్రతినిధులు ఫోన్ చేసే వరకూ చిత్రంలో వాడింది తను వేసిన బొమ్మేనని తెలియలేదని ప్రిన్స్ పేర్కొన్నారు. ఆ తర్వాత చిత్ర యూనిట్‌కు ఫోన్ చేస్తే చిత్ర పబ్లిసిటీ డిజైనర్ సెంథిల్‌కుమార్ క్యూబా వెళ్లారని, మీ బొమ్మ గురించి తెలియదని వివరించారు.
కుటుంబ నేపథ్యం ఇదీ..
విజయన్ తండ్రి రాజేంద్రకుమార్‌ది తాళ్లపూడి మండలం పెద్దేవం . తల్లి సునీతది కృష్ణా జిల్లా మచిలీపట్నం. సునీత తండ్రి కాటూరి జశ్వంత్‌బాబు తణుకు ఆంధ్రా సుగర్స్‌లో ల్యాబ్ సూపరింటెండెంట్‌గా పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. రాజేంద్ర కుమార్ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం మానేసి విదేశాలకు వెళ్లిపోయారు. ప్రస్తుతం కుటుంబంతో సంబంధం లేకుండా ఉన్నారు. దీంతో విజయన్ తల్లి సునీత తన తల్లిదండ్రుల వద్ద ఉంటూ తన ఇద్దరి పిల్లలను తణుకులో చదివిస్తున్నారు. ప్రస్తుతం ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.
బహుభాషా ప్రావీణ్యం
విజయన్ ఎక్కువ కాలం హైదరాబాద్‌లోని కార్పొరేట్ స్కూల్లో చదవడంతో వివిధ రాష్ట్రాల విద్యార్థులతో ఏర్పడిన పరిచయం వల్ల ఎక్కువ భాషల్లో ప్రావీణ్యం సాధించాడు. అతను ప్రస్తుతం హిందీ, ఇంగ్లిష్‌తో పాటు తమిళం, కన్నడ, మళయాళం, కొంకణి, స్పానిష్ భాషలు మాట్లాడగలడు. తమిళ చానల్ తన గురించి ప్రసారం చేయడంతో రాజుగారి గది–2 చిత్రం యూనిట్‌లోని పలువురు తనతో మాట్లాడారని విజయన్ తెలిపారు.
తమిళ చానల్ వచ్చేవరకూ తెలీదు : తల్లి సునీత
తణుకులోని మా అపార్ట్‌మెంట్‌ను వెతుక్కుని తమిళ చానల్ ప్రతినిధులు వచ్చే వరకూ బాహుబలి చిత్రానికి ఫొటోలు వేసింది మా బిడ్డేనని తెలియదని విజయన్ తల్లి సునీత చెప్పారు. ఎప్పుడూ వివిధ భాషలలో ఎవరెవరితోనో మాట్లాడుతుంటే హైదరాబాద్‌లో ఉండే తన మిత్రులతోనేమో అనుకునేవాళ్లమని, తరగతి పుస్తకాల్లో పెన్సిల్‌తో వేసే బొమ్మలు పిచ్చి బొమ్మల్లాగే కన్పించేవని, తీరా చేస్తే బాహుబలి చిత్రంలో అనుష్క ఫొటోలు వివిధ ఆకృతులలో కన్పించాయని ఆమె వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment