= క్షేత్రస్థాయి అధికారుల శిక్షణలో కలెక్టర్ కిషన్
= డూప్లికేట్ ఓటర్ల తొలగింపునకు ఇంటింటా తనిఖీకి ఆదేశం
సుబేదారి, న్యూస్‌లైన్ : ఎన్నికలకు సంబంధించి అన్ని అంశాల్లో క్షేత్రస్థాయి అధికారులు నైపుణ్యం, విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ జి.కిషన్ సూచించారు. ఎన్నికలు, ఓటర్ల జాబితా అంశాలపై క్షేత్ర స్థాయి అధికారులకు కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం శిక్షణ కార్యక్రమం ఏర్పాటుచేశారు. కార్యక్రమానికి అదనపు జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య అధ్యక్షత వహించగా, జిల్లా రెవెన్యూ అధికారి వీఎల్.సురేంద్ర కరణ్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులందరూ ఓటర్లుగా నమోదయ్యేలా అధికారులు కృషి చేయాలని సూచిం చారు. అలాగే, జిల్లాలో 3.91లక్షల మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు తేలిందని, ఈ మేరకు ఓటరు జాబితాతో ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేయాలన్నారు. అలాగే, రెండు చోట్ల ఓటర్లుగా నమోదైన వారికి నోటీసులు ఇచ్చి ఎక్కడో ఒక చోటే ఉండేలా చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లను ఆదేశించారు.
రాబోయే ఎన్నికల్లో తిరస్కరణ ఓటు ఉండే అవకాశమున్నందున సిబ్బంది దీన్ని గుర్తించాలన్నారు. అలాగే, ఇంటింటా ఓటర్ల తనిఖీలో భాగంగా బూత్ లెవల్ అధికారితో పాటు రాజకీయ పార్టీల ఏజెంట్ ఉండేలా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు వ్యవహరించాలని సూచించారు. కాగా, నవంబర్ 4న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని కలెక్టర్ కిషన్ వివరించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా...
మాస్టర్ ట్రైనర్స్ అయిన ములుగు ఆర్‌డీఓ మోతీలాల్, కరీంనగర్ జిల్లా సిరిసిల్ల ఆర్‌డీఓ కె.శ్రీనివాస్‌లు ఎన్నికల అధికారులకు పలు అంశాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్-1960కు అనుగుణంగా ఓటర్ల నమోదుకు వయస్సు, నివాసం, రెండు నియోజకవర్గాల్లో ఓటు ఉంటే తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. రెండు చోట్ల ఓటు ఉన్నట్లయితే లిఖితపూర్వకంగా నోటీసు ఇచ్చి ఏ ఓటు తీసివేయదల్చుకున్నారో తెలుసుకోవాలన్నారు.
అలాగే, ఓటర్ల జాబితాలో ఐదు రకాల సవరణలు ఉంటాయని చెబుతూ ఇంటెన్సివ్ రివిజన్, సమ్మరీ రివిజన్, పార్టీల సమ్మరీ రివిజన్,ప్రత్యేక సమ్మరీ, నిరంతర అప్‌డేట్స్ తీరుతెన్నులు, నామినేషన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సిస్టమేటిక్ ఓటర్ల ఎడ్యుకే షన్, ఎలక్టోరల్ పార్టిసిపేషన్, పద్ధతి ప్రకారం ఓటర్ల అవగాహన, ఓటర్ల భాగస్వామ్యాన్ని వివరించారు.
ఇంకా 18ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు ఓటు వేసేలా అవగాహన పెంచాలని సూచించారు. అలాగే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, పోస్టల్ బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల్లో పోలీసు అధికారుల పాత్రను కూడా వివరించారు. కాగా, ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించేందుకు కరీంనగర్ జిల్లాలోని ప్రతీ నియోజకవర్గం ఓ శకటం తిరుగుతోందని సిరిసిల్ల ఆర్‌డీఓ శ్రీనివాస్ తెలిపారు. కార్యక్రమంలో వరంగల్, జనగామ, మహబూబాబాద్, నర్సంపేట ఆర్‌డీఓలు ఓ.జే.మధు, వెంకట్‌రెడ్డి, మధుసూదన్‌నాయక్, అరుణకుమారితో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఆదాయ పన్ను, పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఎన్నికల విధుల్లో నైపుణ్యం పెంపొందించుకోవాలి
Published Sat, Oct 12 2013 3:31 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM
Advertisement
Advertisement