- వరంగల్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్
- భూపాలపల్లిలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీ
- వరంగల్ పార్లమెంట్ సభ్యుడు కడియం శ్రీహరి ప్రణాళిక
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణలో అభివృద్ధి పరంగా జిల్లాను ప్రత్యేక స్థానంలో నిలపడమే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పని చేస్తోందని వరంగల్ లోక్‌సభ సభ్యుడు కడియం శ్రీహరి అన్నారు. మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావులతో కలిసి శ్రీహరి ఆదివారం టీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని పార్టీల నేతలను కలుపుని కృషి చేస్తామన్నారు. ఇందుకోసం సోమవారం టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పని చేసిన జేఏసీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ప్రజల పోరాటాలు, అమరుల త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని అన్నారు.
పదేళ్ల కాంగ్రెస్ పాలనలో జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని, అభివృద్ధి, సంక్షేమం ముసుగులో జిల్లాను దోపిడీ చేశారని విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన టీఆర్‌ఎస్‌కు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలి పారు. గతంలో రాష్ట్ర మంత్రిగా పని చేసిన అనుభవంతో వరంగల్ లోక్‌సభ సభ్యుడిగా తాను జిల్లా అభివృద్ధికి కృషి చేయనున్నట్లు వివరించారు. ఎన్నికల తర్వాత లోక్‌సభ సభ్యుడిగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు.
బిల్ట్‌ను కాపాడుతాం : ఎంపీ సీతారాంనాయక్
జిల్లాలో ఏకైక పెద్ద పరిశ్రమ బల్లాపూర్ ఇండస్ట్రియల్ లిమిటెడ్(బిల్ట్) పరిశ్రమను మూతపడకుండా చర్యలు తీసుకుం టామని మహబూబాబాద్ ఎంపీ ఆజ్మీరా సీతారాంనాయక్ చెప్పారు. 10వేల మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ పరిశ్రమ ఉత్పత్తి చేసే కాగితపు గుజ్జు(పల్ప్) విక్రయాలకు ఇబ్బందు లు రావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా బిల్ట్ నుంచి కాగితపు గుజ్జును ఈ రంగంలోని సంస్థలు కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. గుండాల-ఇల్లెందు రహదారి మంజూరుకు అడ్డంకిగా ఉన్న 14 ఎకరాల అటవీ భూముల సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించారని పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నేతలు నాగుర్ల వెంకటేశ్వర్లు, మర్రి యాదవరెడ్డి, మార్నేని రవీందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి.
దేవాదుల ఎత్తిపోతల పథకానికి ఇప్పటి వరకు రూ.ఏడు వేల కోట్లు ఖర్చు చేసినా ఏడు ఎకరాలకు సైతం నీళ్లివ్వలేదు. వచ్చే మూడేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. వర్ధన్నపేట, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో 3లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తాం.
రాంసాగర్ ప్రాజెక్టు, దేవాదుల పరిధిలోని ఆయకట్టు స్థిరీకరణకు ఉద్దేశించిన కంతనపల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం. భారీ నీటిపారుదల ప్రాజెక్టులనే కాకుండా చెరువుల అభివృద్ధికి, వాగులపై చెక్‌డ్యాంల నిర్మాణానికి నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నారు.
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌లో ప్రతిష్టాత్మక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్రాంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరాము. 40 ఎకరాల భూములు అవసరమని అడిగారు. భూములను గుర్తించే ప్రక్రియ మొదలుకానుంది. ఉన్నత ప్రమాణాలు ఉండే ఈ స్కూల్‌తో జిల్లాలోని ఉద్యోగులు, ఇతరుల పిల్లలకు మెరుగైన విద్య అందనుంది.
హైదరాబాద్-వరంగల్-భూపాలపల్లి ప్రాంతాన్ని పారి శ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉంది. బొగ్గ గనులు ఉండి పరిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న భూపాలపల్లిలో అనుబం ధ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని జవహర్‌లాల్‌నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని(జేఎన్‌టీయూ -హైదరాబాద్) కోరాము.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు ప్రకారం తెలంగాణ లో ఏర్పాటు చేయనున్న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ సంస్థను వరంగల్‌లో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. విద్యారంగానికి కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతం సంస్థ ఏర్పాటుకు అనువుగా ఉంటుంది.
ఆజంజాహి మిల్లు మూతపడిన తర్వాత జిల్లాలో పరిశ్రమ లు ఏర్పాటు కాలేదు. నిరుద్యోగ యువత ఉపాధి లేక అవస్థలు పడుతోంది. జిల్లాలో కొత్తగా కాంపోజిట్ టెక్స్‌టైల్ మిల్లు ఏర్పాటు చేయాలని కేంద్ర జౌళిశాఖ మంత్రిని కోరాము. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన మంత్రి మోడీకి లేఖ రాశారు. ఈ మిల్లు జిల్లాలోనే ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నాం.
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే జోన్, తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ అంశాలు ఉన్నాయి. కోచ్ ఫ్యాక్టరీని జిల్లాలోనే ఏర్పాటు చేయాలని, అలాగే కాజీపేటను రైల్వే డివిజన్‌గా చేయాలని రైల్వే మంత్రిని కోరాము.
రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్ ఏర్పాటుకు సాంకేతిక అంశాలే అడ్డంకిగా ఉన్నాయి. వర్క్‌షాప్ ప్రదిపాదిత భూములకు పాతచట్టం ప్రకారం పరిహారం ఇచ్చారు. కొత్త చట్టం ప్రకారం పరిహారం ప్రక్రియ పూర్తి చేస్తే ఈ అంశం ముగిసిపోతుంది.
కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న 100 స్మార్ట్ సిటీల్లో వరంగల్ నగరం ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. విస్తరిస్తున్న వరంగల్ నగర అవసరాలకు అనుగుణంగా అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రిని కోరాం. ఇది ప్రస్తుతం రోడ్లు, భవనాల శాఖ పరిధిలో ఉంది.
కరెంటు అవసరాలను తీర్చేందుకు భూపాలపల్లిలో త్వర లోనే 660 మెగావాట్ల సామర్థ్యంతో రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభించనున్నాం.