ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత వేగవంతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తామని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి చెప్పారు
వేగవంతంగా అభివృద్ధి పనులు
గుంటూరు రూరల్, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత వేగవంతంగా అభివృద్ధి పనులు నిర్వహిస్తామని ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రెడ్డిపాలెంలో వీజీటీఎం ఉడా ఆధ్వర్యంలో ఫెస్-4లో భాగంగా నూతన రోడ్డు నిర్మాణానికి ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. 2 కిలోమీటర్ల రోడ్డుకు రూ.6.50 కోట్లతో పనులు చేపట్టినట్టు తెలిపారు. 3 నెలలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ రోడ్డు నిర్మాణం వల్ల సత్తెనపల్లి నుంచి గుంటూరు, చిలకలూరిపేట నుంచి గుంటూరు మీదుగా విజయవాడకు తక్కువ సమయంలో ప్రయాణం చేయవచ్చన్నారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యతో వాహనదారులు అనేక ఇబ్బందులకు గురౌతున్నారని, మిని బైపాస్ రోడ్డు పనులను వీలైన్నంత త్వరగా పూర్తి చేస్తామని చెప్పారు. స్థలం అందజేసిన రెడ్డిపాలెం రైతులకు టిడిఆర్ బాండ్‌లను కూడా 85 శాతం వరకు అందజేశామని తెలిపారు. మిగిలిన వారు సంబంధిత దస్తావే జులు అందజేస్తే వారికి కూడా టిడిఆర్ బాండ్‌లు అందజేస్తామని తెలిపారు.
అభివృద్ధికి పనుల్లో నాసిరకం మెటీరియల్‌వాడితే చర్యలు తీసుకోవడంతో పాటు కాంట్రాక్ట్ రద్దు చేస్తామని హెచ్చరించారు. రైతుల నుంచి సేకరించిన పొలాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఉడా సిబ్బంది, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.