అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: జిల్లా అభివృద్ధిలో దివంగత కాంగ్రెస్ నాయకుడు అనంత వెంకటరెడ్డి కృషి ఎంతో ఉందని రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రితోపాటు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అహమ్మదుల్లా, ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్‌యార్డు చైర్మన్ నారాయణ రెడ్డి తదితరులు ప్రభుత్వ ఆసుపత్రి కూడలిలోని అనంతవెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. జిల్లా అభివృద్ధిలో అనంత వెంకటరెడ్డి పాత్రను ప్రశంసించారు. హంద్రీ-నీవా ద్వారా జిల్లాకు నీరు తీసుకురావాలన్న ఆయన కల నేడు సాకారమైందన్నారు. ప్రస్తుతం జిల్లాకు పెద్ద ఎత్తున విడుదలవుతున్న నిధులు ఆయన కృషి ఫలితమేనన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అహ్మదుల్లా మాట్లాడుతూ జిల్లాలో ముస్లింల అభివృద్ధికి అనంతవెంకటరెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. తమకు ఆయన కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి మాసూలు శ్రీనివాసులు, ఐఎన్‌టీయూసీ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎంవీరమణ, నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధీ పాల్గొన్నారు.
కాంగ్రెస్‌ను దోషిని చేస్తున్నారు
అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించిన తర్వాతే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, ఇప్పుడా పార్టీలన్నీ మాట మారుస్తున్నాయని మంత్రి రఘువీరా రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీని దోషిగా చూపుతున్న ఆ పార్టీల కుట్రను కాంగ్రెస్ కార్యకర్తలందరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కొట్రికె మధుసూదన్ గుప్త అధ్యక్షతన నిర్వహించిన మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో రాజకీయ ప్రత్యర్థులు ప్రజలను అయోమయానికి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీపై నిందలు వేస్తున్నారన్నారు.
అప్పట్లో తెలంగాణ ఏర్పాటుకు అంగీకారం తెలపడమే కాకుండా, ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ మెడపై కత్తి పెట్టాయన్నారు. ఈ పరిస్థితుల్లో ఇష్టం లేకున్నా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రకటించాల్సి వచ్చిందన్నారు. ఈ అంశంపై చర్చ జరిగిన ప్రతిసారీ కాంగ్రెస్ పార్టీ మినహా అన్ని పార్టీలూ విభజనకు అనుకూలంగానే మాట్లాడాయన్నారు. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ ఇవ్వగా, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, తెలంగాణ ప్రజలను తాము గౌరవిస్తున్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందన్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కాంగ్రెస్‌ను తప్పు పడుతున్నాయన్నారు.