ఒకే చోట అభివృద్ధి వల్లే సమస్య: వెంకయ్య
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి వికేంద్రీకరణ వల్లనే సమాజంలో తలెత్తే సంఘర్షణలను నివారించగలమని బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు అన్నారు. కేవలం హైదరాబాద్‌లోనే అభివృద్ధి జరగడం వల్ల రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలన్నీ రాజధానిపైనే ఆధారపడాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకనుంచైనా అన్ని ప్రాంతాలూ సమంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. శనివారం బంజారాహిల్స్‌లోని ఒమేగా ఆసుపత్రిలో న్యూరో అంకాలజీ విభాగం, రోబోటిక్స్ సైబర్ నైఫ్ విఎస్‌ఐ సిస్టమ్‌ను వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీమాంధ్రలోనూ కార్పొరేట్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందజేయాలని కోరారు. ఇంకా ఏమన్నారంటే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యంకోసం తక్కువ నిధులు ఖర్చు చేస్తున్నాయి. విలువైన ప్రజారోగ్యాన్ని విస్మరించి జనాకర్షక పథకాల కోసం కోట్లాది రూపాయలు వృథా చేస్తున్నాయి.
మేం అధికారంలోకి రాగానే విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాం.
శారీరక శ్రమ లేనందునే పలు జీవనశైలి వ్యాధులొస్తున్నాయి. ప్రజలు తమ జీవన విధానాన్ని మార్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నించాలి.
హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆరోగ్య రాజధానిగా ఎదిగింది. అనేక దేశాలనుంచి జనం వైద్యంకోసం వస్తుండడం దీనికి నిదర్శనం.
కార్యక్రమంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, ఒమేగా ఆసుపత్రి చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ మోహన్‌వంశీ, డాక్టర్ అమరేందర్‌రెడ్డి, సీఈవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.