ఏ నేపథ్యమూ లేకున్నా జవసత్వంతో పైకొచ్చా
- నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
- ఎన్టీఆర్ కాళ్లు మొక్కిన వాళ్లే కాళ్లు పట్టుకు లాగేశారు
- స్వీయ ప్రసంగాలు, రచనల సంకలనం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ‘‘నాకెలాంటి నేపథ్యమూ లేకపోయినా కష్టాన్ని నమ్ముకుని ఈ స్థాయికి వచ్చా. అందరి సహకారం, ఆదరాభిమానా లతో అర్హతకు మించిన పదవులు నాకు దక్కాయి’’ అని ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కొత్త పదవికీ వన్నె తెచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. వెంకయ్య ఉపన్యాసాలు, రచనలు, పార్లమెంటు ప్రసంగాల సంకలనం ‘అలుపెరగని గళం–విరామమెరుగని పయనం’ గ్రంథాల ఆవిష్కరణ మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. తొలి సంపుటిని ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీరావు, మలి సంపుటిని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మూడో సంపుటిని రాష్ట్ర స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్య తన వ్యక్తిగత, కుటుంబ జీవనం, వర్తమాన రాజకీయాలపై స్వేచ్ఛగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే...
మంత్రిగా తప్పించేందుకేనన్నారు...
నన్ను ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా ప్రతిపాదించినప్పుడు, కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించేందుకే ఇలా చేశారన్నారు. నేనెప్పుడూ మంత్రి పదవిని కోరుకోలేదు. వాజ్‌పేయి హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి పదవిని వదులుకుని పార్టీ బాధ్యత లకు వెళ్లాను. కుమారమంగళం మరణానం తరం వాజ్‌పేయి తిరిగి కేంద్ర మంత్రివర్గంలోకి రమ్మంటే ‘నన్ను డిమోట్ చేస్తున్నారా?’ అని అడిగా! మోదీని 2019లో మళ్లీ ప్రధానిని చేశాక రాజకీయాలు వదిలేద్దామనుకున్నా.
‘ఆ విమర్శలు’ ఇప్పుడున్న వాళ్లపై చేస్తే
ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా నాపై ఆరో పణలు చేశారు. నా కుమారుడి కంపెనీకి నేనేదో ఇప్పించానన్నారు. అసలు వాళ్లు ఏం వ్యాపారం చేస్తారో కూడా నాకు తెలియదు. ఆ వార్తలు వచ్చినప్పుడు అదేదో చూడమని వాళ్లకు చెప్పా. ఏదో కంపెనీకి ఆర్డర్ ఇస్తే దాన్ని డీలర్‌కు ఇస్తాడని చెప్పారు. అయినా రాజకీయ జీవితంలో ఇలాంటివి సహజమే. తెల్ల చొక్కా, తెల్ల పంచె కట్టుకున్న వారిపై ఎక్కువ రాళ్లు వేస్తారు. పూలచొక్కాలపై సిరా రంగు చల్లినా పెద్దగా కనపడదు. కానీ, ఆ రోజు నేను ఎంత బాధ పడ్డానో నాకే తెలియదు. మా స్వర్ణభారతి ట్రస్ట్‌ను చూసి గర్విస్తున్నా. రాజకీయాల కోసం ఇంట్లోంచి రూపాయి తీసుకోలేదు.
రాజకీయాల ద్వారా వచ్చిన రూపాయి ఇంట్లో ఇవ్వలేదు. మర్రి చెన్నారెడ్డి సీఎంగా ఉండగా నేను, జైపాల్‌రెడ్డి ఆయనపై చేసిన తరహా విమర్శలు ఇప్పుడున్న వారిపై చేస్తే బహుశా అలా చేసేవారి శాల్తీలు కూడా బయటకు రావేమో అనిపిస్తోంది. ప్రస్తుత రాజకీయాల్లో శత్రువులు పెరిగారు. స్పీకర్లు కూడా సహనం కోల్పోవాల్సి వస్తోంది. సీట్లోంచి కదలకుండానే ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టవచ్చు.
నేనెవరికీ పాదాభివందనం చేయలేదు
జై ఆంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నా. అప్పుడే రెండు రాష్ట్రాలుగా విడిపోయి ఉంటే బాగుండేది. రెండు ప్రాంతాలూ ఇంకా బాగుపడేవి. ఎన్టీఆర్ నన్ను 1984లో రాష్ట్ర మంత్రివర్గంలోకి రమ్మన్నారు. కానీ పార్టీ మారే ప్రసక్తే లేదని చెప్పా. అప్పట్లో అందరూ ఎన్టీఆర్ కాళ్లకు దండం పెట్టేవారు. నాకు ఇబ్బందిగా అనిపించేది. కానీ ఆయన కాళ్లకు దండం పెట్టిన వారే ఆయన కాళ్లు పట్టుకు లాగేశారు. నాకు దేవుడి తర్వాత గొప్పవాళ్లనుకున్న వాజ్‌పేయి, ఆడ్వాణీల కాళ్లకు కూడా నేను దండం పెట్టలేదు.
నాకు అర్హతకు మించిన పదవులు వచ్చాయి. పార్టీ ప్రోత్సాహం, పరిశ్రమ, అధ్యయనంతో సంపాదించిన పరిజ్ఞానం, అందరి ప్రేమ, ఆదరణ, అభిమానాలే ఇందుకు కారణం. ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు. వారసత్వం లేకపోయినా జవసత్వంతో పైకొచ్చా. ప్రజలు తమ భవితవ్యాన్ని ప్రభుత్వాలపై వదిలేయకూడదు. అభివృద్ధి, పేదరికం, నిరక్షరాస్యత, ఆర్థిక, ప్రాంతీయ అసమానతలు, సాంఘిక వివక్ష, అవినీతి నిర్మూలనపైనే వారి ఆలోచన, మౌలిక దృష్టి ఉండాలి.