* పరిశ్రమల ఏర్పాటుకు దేశంలోని అనువైన స్థలం ‘అనంత’
* పారిశ్రామిక రంగ అభివృద్ధి ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
* పెనుకొండలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు
* త్వరలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటు
* రైతుకోసం చంద్రన్న ముగింపు కార్యక్రమంలో సీఎం
అనంతపురం ఎడ్యుకేషన్ : వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధితోనే కరువును శాశ్వతంగా నివారించి ‘అనంత’ను ప్రగతి పథంలో నడుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు.
‘రైతు కోసం చంద్రన్న’ ముగింపు కార్యక్రమం, బెల్ పరిశ్రమ శంకుస్థాపన కోసం బుధవారం జిల్లాకు విచ్చేసిన ఆయన రెండు సభల్లో ప్రసంగించారు. మొదట రైతు కోసం చంద్రన్న సభలో పాల్గొన్న ఆయన తర్వాత గోరంట్ల మండలం పాలసముద్రంలో రక్షణశాఖ కేంద్రమంత్రి మనోహర్ పారికర్‌తో కలిసి బెల్‌కంపెనీకి శంకుస్థాపన చేశారు. సోమందేపల్లిలోని బహిరంగసభలో మాట్లాడారు. ‘పట్టిసీమను 6నెలల 20 రోజుల్లో పూర్తి చేసి గోదావరి జలాలను కృష్ణా బ్యారేజ్‌లో కలిపాం. కృష్ణాబ్యారేజ్‌కు విడుదల చేయాల్సిన నీటిని శ్రీశైలంలో పొదుపుచేసి తర్వాత రాయలసీమకు మళ్లిస్తాం.
హంద్రీ-నీవా ద్వారా మడకశిర, మదనపల్లి, పుంగనూరుకు నీరు అందిస్తాం. ఇక్కడ హార్టికల్చర్ అభివృద్ధి చెందుతోంది. రైతులకు 90శాతం సబ్సిడీతో డ్రిప్, స్ప్రింక్లర్లు మంజూరు చేస్తాం. 2014కు సంబంధించి రూ.559.68కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీని జిల్లాకు మంజూరు చేశాం. వ్యవసాయంలో నష్టపోయి ఏ రైతూ ఆత్మహత్యకు తెగించకూడదు. వ్యవసాయాన్ని లాభసాటి చేస్తాం. ‘అనంత’ నుంచి అమరావతికి ఆరులైన్ల రహదారి నిర్మిస్తాం.
‘అనంత’లో సెంట్రల్ యూనివర్శిటీ:
‘అనంత’లో త్వరలోనే సెంట్రల్ యూనివర్శిటీని నిర్మిస్తాం. అలాగే పెనుకొండ పరిధిలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేస్తాం. పెనుకొండ కొండపైకి రోడ్డు నిర్మిస్తాం. కొండపై నరసింహస్వామి దేవాలయంలో మంచినీటికి రూ.70లక్షలు, విద్యుత్తుకు రూ.30లక్షలు మంజూరు చేస్తాం. బెంగళూరు ఏయిర్‌పోర్టు దగ్గరగా ఉండటంతో పారిశ్రామికరంగ అభివృద్ధికి అత్యంత అనువైన ప్రాంతం అనంతపురం. జిల్లాపై నాకు ప్రత్యేక అభిమానం ఉంది. జిల్లా అభివృద్ధికి అన్ని విధాల చర్యలు తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి అన్నారు.
వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ సమర్థంగా రుణమాఫీ చేశామన్నారు. దీనిపై ప్రతిపక్షాలు ఏ వేదికపైనైనా చర్చించేందుకు తాము సిద్ధమన్నారు. మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత మాట్లాడుతూ రైతులకు ఎలాంటి కష్టమొచ్చినా చంద్రబాబు ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎంపీ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి పరి తపిస్తున్నారన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.
అనంతరం ‘చంద్రన్న అనంత విజయాలు’ కరపత్రాలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ నిమ్మల కిష్టప్ప, ప్రభుత్వ చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ఈరన్న, జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పయ్యావుల కేశవ్, గుండుమల తిప్పేస్వామి, మెట్టు గోవిందరెడ్డి, శమంతకమణి, జెడ్పీ చైర్మన్ చమన్, వ్యవసాయశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరి టీ. విజయ్‌కుమార్, కమిషనర్ మధుసూదన్‌రావు, డెరైక్టర్ ధనుంజయరెడ్డి, కలెక్టర్ కోన శశిధర్, జేసీ లక్ష్మీకాంతం, మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, టీడీపీ ప్రచార కార్యదర్శి బీవీ వెంకట్రాముడు పాల్గొన్నారు.
అభివృద్ధితో కరువు నివారణ
Published Thu, Oct 1 2015 2:53 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM
Advertisement
Advertisement