సాక్షి, అమరావతి బ్యూరో : కంచికచర్ల మండల కేంద్రంలోని కేడీసీసీ బ్యాంకులో జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు గద్దె వీరభద్రరావు శుక్రవారం తప్పతాగి వీరంగం సృష్టించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ‘నాకు తెలియకుండా రుణాలు మంజూరు ఎలా చేస్తావు..’ అంటూ బ్యాంకు మేనేజర్‌పై చిందులు తొక్కాడు. ఇక్కడ అంతా మా రాజ్యమని, మా పర్మిషన్ తీసుకోకుండా రుణాలు ఇవ్వకూడదని బ్యాంకులో నానా హంగామా సృష్టించాడు. మంత్రి సోదరుడి హల్‌చల్‌తో బ్యాంకు సిబ్బందితోపాటు ఖాతాదారులు హడలిపోయారు.
కాపు రుణాలు మంజూరు చేశారని..
స్థానిక కేడీసీసీ బ్యాంకుకు 32 కాపు రుణాలు మంజూరయ్యాయి. ఆ రుణాల కోసం స్థానిక ప్రజా ప్రతినిధి, టీడీపీ జిల్లాస్థాయి నాయకుడు కలిసి లబ్ధిదారులను బ్యాంకుకు ప్రపోజల్స్ పంపారు. మండలంలోని సొసైటీ కార్యదర్శిగా పని చేస్తున్న మంత్రి సోదరుడు వీరభద్రరావు విషయం తెలిసి రెచ్చిపోయాడు.. ఫూట్‌గా మద్యం సేవించిన భద్రయ్య కేడీసీసీ బ్యాంకుకు వెళ్లి మేనేజర్ సోమయ్యతో వాగ్వాదానికి దిగాడు. నాకు తెలియకుండా రుణాలు మంజూరు చేస్తావా.. అంటూ మేనేజర్‌ను నానా దుర్భాషలాడాడు. ఒకటిన్నర దశాబ్ధాల కాలంగా నా అనుమతి లేకుండా రుణాలు మంజూరు చేయలేదని, అలాంటిది నీవెలా మంజూరు చేస్తావంటూ రెచ్చిపోయాడు.
తాను సూచించిన లబ్ధిదారులకే బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, లేకపోతే నీ ఉద్యోగం పీకేయిస్తానంటూ.. పెద్దగా కేకలు వేస్తూ హంగామా చేశాడు. దీంతో భయాందోళనకు గురైన మేనేజర్ సెలవు పెట్టి ఇంటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోక్యం చేసుకుని సోదరుడికి వత్తాసు పుచ్చుకొని కేడీసీసీ బ్యాంకు ఉన్నతస్థాయి అధికారిని ఇంటికి పిలిపించి వెంటనే సర్దుబాటు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన ఉన్నతస్థాయి అధికారి.. మేనేజర్‌ను బ్యాంకుకు రమ్మని విధుల్లో చేరాలని ఆదేశించినట్లు సమాచారం.
తనకు మంత్రి సోదరుడు క్షమాపణ చెప్పే వరకు బ్యాంకుకు రానని మేనేజర్ సోమయ్య తెగేసి చెప్పినట్లు తెలిసింది. మంత్రి సోదరుడితో క్షమాపణ చెప్పిస్తానంటూ ఉన్నతాధికారి మేనేజర్‌ను తృప్తిపరిచేందుకు మంతనాలు జరిపినా ఫలించలేదు. తన మనస్సు గాయపడిందని, కొన్ని రోజుల పాటు సెలవుపై వెళ్తానంటూ మేనేజర్ చెప్పడంతో సదరు అధికారి ఎలాగోలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.
హేయమైన చర్య..
సాక్షాత్తు మంత్రి సోదరుడు బ్యాంకు మేనేజర్‌పై అమానుషంగా ప్రవర్తించి దుర్భాషలాడటం హేయమైన చర్య. మేనేజర్ నిజాయితీగా పని చేస్తున్నాడు. అందరి ఖాతాదారులకు అందుబాటులో ఉంటున్నాడు. అటువంటి మేనేజర్‌ను ఇష్టమొచ్చినట్లు తప్పతాగి దుర్భాషలాడటం సిగ్గు చేటు.
– బండి జానకీరామయ్య, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్, మోగులూరు
Comments
Please login to add a commentAdd a comment