సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులపై సీఎం జగన్‌కు అపార గౌరవం ఉందని.. ఆయనలోనూ ఓ జర్నలిస్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో నకిలీ వార్తలు ప్రమాదకరంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీనాథ్‌రెడ్డి... జర్నలిస్టులు తమ ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకోవలసిన అవసరం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంత విలేకరుల సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆయనను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ... పాత్రికేయ రంగంలో శ్రీనాథ్‌రెడ్డి సేవలను గుర్తించి సీఎం జగన్.. ఆయనను ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించారని పేర్కొన్నారు. శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ మరింతగా అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ కూడా శ్రీనాథ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ‘గతంలో ఏ ప్రభుత్వాలు జర్నలిస్టులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు.
అయితే సీఎం జగన్ మాత్రం ఆరుగురు సీనియర్ జర్నలిస్టులకు తన ప్రభుత్వంలో పలు పదవులు ఇచ్చారు’ అని హర్షం వ్యక్తం చేశారు. ‘1996 లో ప్రెస్ అకాడమీ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ శిక్షణ ఇచ్చేది. గత కొంత కాలంగా ప్రెస్ అకాడమీలు నామమాత్రంగా మారాయి. ప్రెస్ అకాడమీకి స్థలం, నిధులు ఇచ్చి జర్నలిస్టులను ప్రోత్సహించాలి’ అని విఙ్ఞప్తి చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్, సీనియర్ పాత్రికేయులు ఆర్. దిలీప్‌రెడ్డి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
కాగా శ్రీనాథ్‌రెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామం. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment