Andhra Pradesh Press Academy
-
ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి పేరు మార్పు
సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి పేరును సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమిగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుత తరుణంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు అకాడమి పేరులో ప్రాతినిధ్యం ఉండే విధంగా సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి పేరును సి.రాఘవాచారి ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమిగా మార్పు చేయాల్సిందిగా తాము కోరిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వెలువరించిందని సి.రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ మీడియా అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు. పేరును మార్చి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు సముచిత ప్రాధాన్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన రెడ్డికి, సమాచారశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ కి, సమాచార పౌరసంబంధాల శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డికి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు కృతజ్ఞతలు తెలిపారు. -
ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి స్వర్గస్తులయ్యారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు సంస్థలు, బీబీసీ, సాక్షి దినపత్రికల్లో ఉన్నత హోదాలో పని చేశారు. శ్రీనాథ్‌రెడ్డి చెన్నై ట్రిప్లికేన్ లోని హిందూ హైస్కూలులో పదవ తరగతి వరకు చదివారు. అనంతరం తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బీకామ్ అభ్యసించారు. అనంతరం పాత్రికేయ రంగంలో అడుగు పెట్టారు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాథ్ రెడ్డి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు. ప్రారంభంలో తెలుగు దినపత్రికల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. అనంతరం కొన్ని ఆంగ్ల పత్రికల్లో చాలాకాలం పాటు కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేసిన శ్రీనాథ్ రెడ్డి.. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. జాప్ నివాళి.. అమరావతి, మార్చి 22: శ్రీనాథ్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నివాళులు అర్పించింది. జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం డీ వీ ఎస్ ఆర్ పున్నం రాజు, ప్రధాన కార్యదర్శి ఎం. యుగంధర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా కడప, హైదరాబాద్‌లలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, సాక్షి మీడియాలో జర్నలిస్ట్ గా వుండి సేవలందించారని వారు కొనియాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక శ్రీనాథ్ రెడ్డి.. సి.వి. రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీకి చైర్మన్‌గా సేవలందించి పాత్రికేయులకు మరింత దగ్గరయ్యారని పేర్కొన్నారు. -
‘ఏపీలో ప్రతీ పథకంలోనూ మహిళలకే పెద్దపీట’
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందన్నారు ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. బుధవారం విజయవాడ ఏపీ ప్రెస్ అకాడమీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఏపీ ప్రభుత్వంపై, సీఎం జగన్మోహన్రెడ్డి పైనా కొమ్మినేని ప్రశంసలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం మహిళల కోసం ఎంతో చేస్తోంది. మహిళలకు సీఎం జగన్ అన్ని రంగాల్లో పెద్దపీట వేశారు. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యం కల్పించారు. మార్కెట్ యార్డు పదవులను సైతం మహిళలకు కేటాయించడం చరిత్రలో ఇదే తొలిసారి అని కొమ్మినేని తెలిపారు. ఇక ఐఅండ్‌పీఆర్ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. జర్నలిజం వృత్తి అంటేనే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, మహిళలు ఆ సవాళ్లను ఎదుర్కొని రాణించడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే.. ఏపీలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మహిళలకు అధికప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. ‘‘ప్రతీ పథకంలోనూ మహిళలకే పెద్దపీట వేస్తున్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరిట ఇచ్చారు అని పేర్కొన్నారు. అలాగే.. మహిళా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం అని హామీ ఇచ్చారాయన. ఈ సందర్భంగా.. వీరిరువురు ప్రెస్ అకాడమీ తరపున పలువురు మహిళా జర్నలిస్టులను సత్కరించారు. -
జర్నలిస్టుల వెల్ఫేర్ స్కీమ్ ఏర్పాటుకు కృషి
కూనవరం: జర్నలిస్టులకు వెల్ఫేర్ స్కీమ్ ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలన చేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం శ్రీరామగిరిలోని సుందర సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకునేందుకు వెళ్తూ.. కూనవరం ప్రెస్‌క్లబ్‌లో ఆయన నిన్న (ఆదివారం) విలేకరులతో మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. జర్నలిస్టుల వృత్తి నైపుణ్యం పెంచేందుకు త్వరలోనే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. గత 20 ఏళ్ల నుంచి వివిధ పత్రికల్లో పని చేస్తున్నప్పటికీ గిరిజన చట్టాల మూలంగా తమకు ఇంటి స్థలాలు మంజూరు కావడం లేదని ఏజెన్సీ ప్రాంత విలేకరులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని, ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ల నిర్మాణంపై సంబంధిత అధికారులతో చర్చించి, పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కూనవరం పాత్రికేయులు శ్రీనాథ్‌ను సత్కరించారు. -
దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టులపై సీఎం జగన్‌కు అపార గౌరవం ఉందని.. ఆయనలోనూ ఓ జర్నలిస్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో నకిలీ వార్తలు ప్రమాదకరంగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీనాథ్‌రెడ్డి... జర్నలిస్టులు తమ ప్రతిభను మరింతగా మెరుగుపర్చుకోవలసిన అవసరం ఏర్పడిందన్నారు. గ్రామీణ ప్రాంత విలేకరుల సమస్యలను పరిష్కరించటానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ఆయనను అభినందించారు. అనంతరం మాట్లాడుతూ... పాత్రికేయ రంగంలో శ్రీనాథ్‌రెడ్డి సేవలను గుర్తించి సీఎం జగన్.. ఆయనను ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించారని పేర్కొన్నారు. శ్రీనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ అకాడమీ మరింతగా అభివృద్ధి చెందాలని మంత్రి ఆకాంక్షించారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు, సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ కూడా శ్రీనాథ్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ‘గతంలో ఏ ప్రభుత్వాలు జర్నలిస్టులకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదు. అయితే సీఎం జగన్ మాత్రం ఆరుగురు సీనియర్ జర్నలిస్టులకు తన ప్రభుత్వంలో పలు పదవులు ఇచ్చారు’ అని హర్షం వ్యక్తం చేశారు. ‘1996 లో ప్రెస్ అకాడమీ ప్రారంభమైంది. గ్రామీణ ప్రాంతాల్లోని జర్నలిస్టులకు ప్రెస్ అకాడమీ శిక్షణ ఇచ్చేది. గత కొంత కాలంగా ప్రెస్ అకాడమీలు నామమాత్రంగా మారాయి. ప్రెస్ అకాడమీకి స్థలం, నిధులు ఇచ్చి జర్నలిస్టులను ప్రోత్సహించాలి’ అని విఙ్ఞప్తి చేశారు. కాగా ఈ కార్యక్రమంలో ఆర్టీఐ మాజీ కమిషనర్, సీనియర్ పాత్రికేయులు ఆర్. దిలీప్‌రెడ్డి, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. కాగా శ్రీనాథ్‌రెడ్డి స్వస్థలం వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామం. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. -
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిజం వృత్తిలో అపార అనుభవం ఉన్న శ్రీనాథ్ వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామ వాస్తవ్యులు. ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాధ్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కొనసాగారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. శ్రీనాథ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహిత జర్నలిస్టు కూడా. సీఎం జగన్ ఆశయాల మేరకు పనిచేస్తా ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి శ్రీనాథ్ దేవిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టాలన్న సీఎం జగన్ ఆశయ సాధన దిశగా పనిచేస్తానని ఆయన చెప్పారు. డిజిటల్ యుగంలో మీడియా రంగంలో పెరిగిన ఆధునిక సాంకేతిక వినియోగం, అలాగే సోషల్ మీడియా విస్తృతి నేపథ్యంలో ముఖ్యంగా గ్రామీణ జర్నలిస్టులకు సరైన దిశగా పునశ్చరణ అవసరమని, అందుకు ప్రాధాన్యతనిస్తామని తెలిపారు.