సాక్షి, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్ట్, ఏపీ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి స్వర్గస్తులయ్యారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టపల్లి గ్రామానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి.. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు సంస్థలు, బీబీసీ, సాక్షి దినపత్రికల్లో ఉన్నత హోదాలో పని చేశారు. శ్రీనాథ్‌రెడ్డి చెన్నై ట్రిప్లికేన్ లోని హిందూ హైస్కూలులో పదవ తరగతి వరకు చదివారు. అనంతరం తిరుపతిలోని ప్రతిష్ఠాత్మక శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో బీకామ్ అభ్యసించారు. అనంతరం పాత్రికేయ రంగంలో అడుగు పెట్టారు.
ఆంధ్రప్రభ ద్వారా 1978లో జర్నలిజం వృత్తిలో చేరిన శ్రీనాథ్ రెడ్డి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పాత్రికేయ రంగంలో కొనసాగారు. ప్రారంభంలో తెలుగు దినపత్రికల్లో జర్నలిస్ట్ గా పనిచేశారు. అనంతరం కొన్ని ఆంగ్ల పత్రికల్లో చాలాకాలం పాటు కొనసాగారు.
కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేసిన శ్రీనాథ్ రెడ్డి.. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు.
జాప్ నివాళి..
అమరావతి, మార్చి 22: శ్రీనాథ్ రెడ్డి ఆకస్మిక మరణం పట్ల జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నివాళులు అర్పించింది. జాప్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం డీ వీ ఎస్ ఆర్ పున్నం రాజు, ప్రధాన కార్యదర్శి ఎం. యుగంధర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలంగా కడప, హైదరాబాద్‌లలోని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్, సాక్షి మీడియాలో జర్నలిస్ట్ గా వుండి సేవలందించారని వారు కొనియాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక శ్రీనాథ్ రెడ్డి.. సి.వి. రాఘవాచారి ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీకి చైర్మన్‌గా సేవలందించి పాత్రికేయులకు మరింత దగ్గరయ్యారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment