టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ను ఒక మహా నేతగా చూపించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా చాలా శ్రమిస్తున్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి రాజకీయంగా ఎదగాలని అనుకోవడం తప్పుకాదు. అందుకోసం కృషి చేయవచ్చు. అలాగే లోకేష్ కూడా వృద్ది చెందవచ్చు. కాని గత పదేళ్ల రాజకీయంలో ఆయన ఇంకా తండ్రిచాటు బిడ్డగా ఉన్నాడన్నది వాస్తవం. తెలిసి, తెలియక అనేక విషయాలలో తడబడుతున్నారన్నది నిజం. దీనినీ ఆక్షేపించనవసరం లేదు. కాని లేని బలాన్ని ఉన్నట్లుగా చూపించడం ద్వారా ఒక మహా నాయకుడు మీడియా ద్వారానే తయారైనట్లుగా చిత్రీంచడం వల్ల లోకేష్ కే నష్టం కలుగుతుంది.
✍️ముందుగా ఆయన చిత్తశుద్దితో విషయ పరిజ్ఞానం పెంచుకోవాలి. లేకుంటే కుండలమ్ముకునే వ్యక్తి కలగన్నట్లుగా ఉంటుంది. ఈ కథ లోకేష్ మాత్రమే అంతా తెలుసుకోవాలి. కుండలు తయారు చేసే ఒక వ్యక్తి తన కుండలను కాళ్ల దగ్గరపెట్టుకుని నిద్రించాడు. ఆ నిద్రలో ఒక కల వచ్చింది.తన కుండలన్నీ అమ్ముడిపోయినట్లు, ఆ తర్వాత ఆ డబ్బుతో ఆయనేదో ఇంకేదో కొన్నట్లు, శ్రీమంతుడు అయిపోయినట్లు కలగన్నాడట.ఆ ఆనందంలో ఒక్కసారిగా కాళ్లు ఝాడిస్తే అక్కడ ఉన్న కుండలన్ని పగిలిపోయి అసలుకు మోసం వచ్చిందట. ఈ కధలో నీతి ఏమిటి? పగటి కలలు కంటే నష్టపోతారని చెప్పడమే. లోకేష్ అలా కలలు కుంటున్నాడో లేదో కాని, ఎల్లో మీడియాగా పేరొందిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటివి ఆయనకు ఊదరగొడుతున్న తీరు ఆయనను కలలోకి తీసుకువెళుతున్నట్లుగా ఉంది.
✍️ఇందులో లోకేష్ కు,టీడీపీకి వచ్చే ప్రయోజనం కన్నా ఆ మీడియాకే ఎక్కువగా వ్యాపార పరంగా ప్రయోజనం దక్కుతుండవచ్చు.అది వేరే సంగతి.లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ ఎల్లో మీడియా భారీ ఎత్తున లోకేష్ ఇంటర్వ్యూలు ఇచ్చాయి. మొదటి పేజీలో, అలాగే లోపల మరో ఫుల్ పేజీ ఇందుకు కేటాయించాయంటే వారు ఎంతగా లోకేష్ కోసం పాటు పడుతున్నది తెలుస్తుంది. ఇంతకీ లోకేష్ కు టిడిపిలో పాత్ర ఏమిటి?ఇదే ప్రశ్న కూడా వేస్తే దానికి ఆయన తన తండ్రి చంద్రబాబు నిర్ణయించాలని చెప్పేశారు.పాత్రేమిటో తెలియకుండా అసలు పాదయాత్ర ఎందుకు చేసినట్లు?ఇన్నివేల హామీలు ఎలా ఇచ్చినట్లు?తాను ముఖ్యమంత్రి అయిపోయినట్లు, అన్ని విధాన నిర్ణయాలే తీసుకోబోతున్నట్లు ఎక్కువ సార్లు హామీలు ఇస్తున్నారే.
✍️ఏదోమొహమాటానికి ఎప్పుడైనా ఒకటి,అరాసారి మాత్రం చంద్రబాబు పేరు చెబుతున్నారు కాని, మొత్తం టిడిపి అంతా తన చేతిలోనే ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నారే.అంటే అదంతా ఉత్తిత్తుదేనని అనుకోవాలా?ఎవరైనా ప్రజలు అడిగే సమస్యలను ఏదైనా ఒక పుస్తకంలో రాసుకుంటారు.వారికి ఇచ్చే హామీలను రాసుకుంటారు.కాని లోకేష్ మాత్రం రెడ్ బుక్ అని ఒకటి పెట్టుకుని తాము అధికారంలోకి ఎవరెవరిని జైలులో పెట్టాలో రాసుకున్నారట.అంటే ఎవరు తమ పార్టీని వ్యతిరేకిస్తే వారందరి పేర్లు రాసి వారిని వేధిస్తారా?ఇందుకోసమేనా వారికి అధికారం ఇవ్వవలసింది?చంద్రబాబు ఊరుకున్నా ఈయన ఒప్పుకోడట.అందుకే కొందరు దీనిని ఎర్ర పుస్తకం కాదు..ఎర్రి పుస్తకం అని ఎద్దేవ చేస్తున్నారు.లోకేష్ కు జాకీలు పెట్టి లేపుతూ చేసిన ఈ ఇంటర్వ్యూ మొత్తం చదివితే ఇంతకీ ఈయన ఏమి చెప్పదలచుకుంది అర్ధం కాలేదు.
✍️ప్రజలకు టీడీపీ ఇచ్చిన గ్యారంటీలు ఎలా అమలు చేయగలుగుతారన్నదానిపై ఎల్లో మీడియా రిపోర్టర్లు అడగలేదు. ఈయన చెప్పలేదు. ఎందుకంటే మాచ్ ఫిక్సింగ్ ఇంటర్వ్యూ కాబట్టి లోకేష్ చెప్పలేరనో, లేక అనవసరంగా ఆ గ్యారంటీలు అమలు చేయడం సాధ్యం కానివని బయటపడిపోతుందనో వీరు వాటికి సంభంధించిన ప్రశ్నల జోలికి వెళ్లినట్లు అనిపించలేదు. జగన్ ప్రభుత్వం ఏవేవో తప్పులు చేసిందని, పాలనను గాడిలో పెడతామని ఆయన చెబుతున్నారు. నిజంగానే చంద్రబాబు,లోకేష్ల పాలన బాగుంటే 2019లో ఎందుకు అంత ఘోరంగా ఓడిస్తారు? ఈ ప్రశ్నను అడగరనుకోండి. పోనీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్న వివిద నిర్ణయాలు,అమలుచేసిన స్కీముల గురించి ఏమైనా చెప్పారా అని చూస్తే అదేమీ కనిపించలేదు.
✍️జగన్ తీసుకు వచ్చిన సంక్షేమ స్కీముల వల్ల రాష్ట్రం నాశనం అయిందని టీడీపీ ప్రచారం చేస్తోంది కదా! అంతకుమించి ఐదు రెట్లు అధికంగా సంక్షేమానికి ఎలా ఖర్చు చేస్తామని టిడిపి నేతలు చెబుతున్నారో ఎల్లో మీడియా అడగలేదు. లోకేష్ జవాబు ఇవ్వలేదు. జగన్ తీసుకు వచ్చిన వలంటర్ల వ్యవస్థను ఉంచుతారా?తీసివేస్తారా?గ్రామ,వార్డు సచివాలయాలను కొనసాగిస్తారా?లేదా?రైతు భరోసా కేంద్రాలను ఎత్తివేస్తారా?గ్రామీణ క్లినిక్స్ ను నిలిపివేస్తారా?జగన్ ప్రభుత్వం మొదలుపెట్టింది కనుక ఓడరేవుల నిర్మాణం ఆపేస్తారా?ఫిషింగ్ హార్బర్స్ ను అనవసరం అని అంటారా? విశాఖలో కడుతున్న ఐటి టవర్ ను అక్కర్లేదంటారా?డేటా సెంటర్ కు అంత భూమి ఇవ్వబోమని చెబుతారా?రామాయ పట్నం పోర్టు వద్ద అరవైవేల కోట్ల రూపాయల పరిశ్రమ అక్కర్లేదని చెబుతారా?అసలు పాలన ఎక్కడ గాడి తప్పింది? ఏమి దారిలో పెడతారు?అసలు గాడి తప్పింది.. దారి తప్పింది టీడీపీ, ఆ పార్టీ అధినేతలు చంద్రబాబు ,లోకేష్ లు అని వైసిపి నేతలు విమర్శిస్తుంటారు.
✍️ ఒక్క వాక్ చేయడం తప్ప, లోకేష్ సాధించింది ఏమి ఉందని వారు అంటుంటారు.ప్రత్యర్ధి పార్టీ కనుక వారు అలా అనవచ్చు. కాని టిడిపి క్యాడర్ కు అయినా ఈ యాత్ర విశ్వాసం కలిగించిందా? తన తండ్రి అవినీతి కేసులో చిక్కుకుని అరెస్టు అయి ఉంటే ఈయన పాదయాత్ర ఆపేసి ఢిల్లీ ఎందుకు వెళ్లిపోయారో ఇంతవరకు ఎందుకు చెప్పలేదు?స్కిల్ స్కామ్ కేసులో ఎంతసేపు కక్ష అని ప్రచారం చేయడమే తప్ప, సిఐడి అడిగే నిర్దిష్ట ప్రశ్నలకు ఎందుకు బదులు ఇవ్వరు?ఈయన అధికారంలోకి రాగానే లక్షల ఉద్యోగాలు ఇస్తామని, పరిశ్రమలను తీసుకు వస్తామని చెబితే జనం కావమ్మ మొగుడు కాబోలు అన్నట్లు జనం నమ్మేస్తారనా వీరి అభిప్రాయం.
✍️ఎపికి ఆ ఐదేళ్లలో ఒక్క కియా తప్ప,మరో పరిశ్రమను వారు అప్పట్లో ఎందుకు తీసుకు రాలేకపోయారు? హైదరాబాద్ అంతా తామే అభివృద్ది చేసేశామని ప్రచారం చేసుకునే వీరు అక్కడ ఉన్న పెద్ద ఐటి పరిశ్రమలలో ఒక్కటైనా ఎపికి తమ టరమ్ లో ఎందుకు తేలకపోయారు?పాత మద్యం విధానాన్నీ తీసుకు వస్తామని లోకేష్ చేసిన ప్రకటనను చంద్రబాబు అంగీకరిస్తారా?అంటే దీని అర్ధం మళ్లీ భారీ ఎత్తున మద్యం షాపులు ఎక్కడబడితే వస్తాయని చెబుతున్నారా?వాటికి అనుబంధంగా బెల్ట్ షాపులుకూడా ఆరంభం అవుతాయని లోకేష్ ప్రకటిస్తున్నారా?ఇసుక విధానం కూడా మార్చుతారాట.అంటే తిరిగి టిడిపి నేతలకే ఇసుక రీచ్ లు ఇచ్చి ప్రజల నుంచి డబ్బు గుంజుకుంటారా?జగన్ ప్రభుత్వం వచ్చాక మొదట కొద్ది నెలలు ఇసుక విషయంలో కొద్దిగా ఇబ్బంది వచ్చినా, ఆ తర్వాత పుష్కలంగా ఇసుక లబిస్తోంది.
✍️ ఎపిలో ఎటు వెళ్లినా ఆయా చోట్ల ఇసుక మేటలు కనిపిస్తుంటాయి. అక్కడ నుంచి ప్రజల ఇళ్లవద్దకే ఇసుకను సరఫరా చేస్తున్న విధానాన్ని రద్దు చేస్తారా?ఐదేళ్లలో ప్రజలపై ఈ ప్రభుత్వం విపరీతమైన భారం మోపిందట. వాటన్నిటిని టిడిపి అధికారంలోకి వస్తే తీసేస్తారట.ఇవన్ని రొడ్డ కొట్టుడు మాటలు తప్ప ఇంకొకటి కాదు. తెలంగాణలో డబ్బుతో ఎన్నికలు గెలవడం సాధ్యం కాదని తేలిందట. అంటే బిఆర్ఎస్ డబ్బు ఖర్చు చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఖర్చు చేయలేదని లోకేష్ సర్టిఫికెట్ ఇస్తున్నారా?నెలరోజుల్లోనే అభ్యర్ధుల ఎంపిక పూర్తి అవుతుందని చెబుతున్నారు? ఇంతకీ జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వబోతున్నారో ఎందుకు చెప్పలేదు.
✍️ అసలు జనసేన పొత్తు గురించిన ప్రస్తావన ఎందుకు చేయలేదు. ఒకవేళ టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబా? పవన్ కళ్యాణా? లేక లోకేషా?ఒక పక్క తాను సీఎం సీటు కోసం పాదయాత్ర చేయలేదని చెబుతూనే అంతకంటే ఎక్కువగా హామీలు ఇవ్వడంలో ,ప్రకటనలు చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటి?పవన్ కళ్యాణ్ ను సీఎం అభ్యర్ది అని ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? ఎల్లో మీడియా ఎందుకు అడగడం లేదు. అంటే దాని అర్ధం పవన్ ను కరివేపాకు మాదిరి వాడుకుని వదలివేయడం కాదా? ఇంత పెద్ద ఇంటర్వ్యూలో పవన్ ప్రస్తావనే తీసుకురాలేదంటే ఆయనపై వీరికి ఎంత చులకన భావం ఉందో అర్ధం కావడం లేదా?
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment