సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులకు అద్దెగదుల కోసం తిప్పలు తప్పడంలేదు. గదులు కేటాయింపునకు సంబంధించిన వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవటం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని భక్తులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక సమస్యలే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఏడుకొండలవాని దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వచ్చే ప్రతి భక్తుడు తిరుమలలో ఓ రాత్రి నిద్రిస్తే అంతా మంచే జరుగుతుందని నమ్ముతాడు. గదుల కోసం భక్తులు ముందుగా తిరుమలలో సీఆర్‌వో కార్యాలయానికి చేరుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఇక్కడ జనరల్ కౌంటర్లు, దేవదాయశాఖ కౌంటర్, వీఐపీ, వీవీఐపీ, బోర్డు మెంబర్ల కోసం విడివిడిగా కౌంటర్లు ఏర్పాటు చేశారు.
గదులు అవసరమైన వారు కౌంటర్ వద్ద పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో గదులు ఖాళీ అవుతుంటే... వరుస క్రమంలో ఉన్న భక్తుల మొబైల్ ఫోన్లకు మెసేజ్‌లు వస్తుంటాయి. ఆ సమాచారం తెలుసుకుని భక్తులు సీఆర్‌వో కార్యాలయానికి వెళ్లి గది తాళాలు తీసుకుంటారు. గతంలో అయితే గదులు ఖాళీ అవుతుంటే క్యూలో ఉండేవారికి కేటాయించేవారు. ఇలా గంటల తరబడి భక్తులు క్యూలో నిల్చొని ఇబ్బంది పడకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చారు.
మెసేజ్ రాకపోతే గది లేనట్టే..
తిరుమలలో గదుల రిజిస్ట్రేషన్ కోసం టీటీడీ 10 కౌంటర్లు ఏర్పాటు చేసింది. అందులో సిబ్బంది వారాంతపు సెలవులు, అత్యవసర సెలవులు, ఇతరత్రా కారణాలతో రోజుకి ఆరేడు కౌంటర్లు మాత్రమే పనిచేస్తుంటాయి. ఈ కౌంటర్ల వద్ద క్యూలో 200 మంది లోపు మాత్రమే నిలబడే అవకాశం ఉంది. ఒకసారి క్యూలోకి చేరుకున్న భక్తులు సుమారు ఒకటిన్నర గంట సమయం బయటే నిలబడి ఉండాలి. క్యూలో ఉన్న వారి కంటే బయట వేచి ఉన్న వారి సంఖ్యే అధికంగా ఉంటోంది. మొదట్లో టీటీడీ నిర్ధేశించిన ప్రకారం భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని బయటకు వచ్చేస్తే... గది ఖాళీ అయినప్పుడు భక్తుడు రిజిష్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. సమాచారం అందిన అరగంటలో వెళ్లి గది తీసుకోవాలి. కానీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో కొందరికి గది కేటాయించినా ఎటువంటి మెసేజ్ రావడంలేదు.
దీంతో సీఆర్‌వో కార్యాలయం వద్ద డిస్‌ప్లే బోర్డు చూస్తూ గంటల తరబడి నిలబడుతున్నారు. మరి కొందరు.. గది కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ‘2 లేదా 3’ గంటల తరువాత కేటాయించవచ్చు అని ఉజ్జాయింపుగా రశీదుపై సమయాన్ని ముద్రించి ఇస్తారు. దీంతో భక్తులు ఇంకా సమయం ఉందని తిరుమలలోని దర్శనీయ స్థలాలు చూసి వచ్చేందుకు వెళ్తుంటారు. ఒక్కో సారి రిజిస్ట్రేషన్ అయిన అరగంటలోనే గది కేటాయిస్తుంటారు. ఆ సమాచారం భక్తులకు వెళ్లడం లేదు. గది అలాట్ అయిన అరగంటలో తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా అది రద్దయిపోతుంది. మొబైల్‌కి సమాచారం రాలేదని భక్తులు తిరుమల అంతా చుట్టి సీఆర్వో కార్యాలయానికి చేరుకునే సరికి.. గది అలాట్ అయ్యిందని, అరగంటలో తీసుకోకపోవటంతో రద్దయిందని చెబుతుండటంతో భక్తులు షాక్‌కు గురవుతున్నారు.
పర్యవేక్షణ లోపమే..
అనిల్‌కుమార్ సింఘాల్ ఈవోగా వచ్చిన తరువాత రిజిస్ట్రేషన్ పద్ధతి అమల్లోకి తీసుకొచ్చారు. అయితే ఈ విధానంలో లోపాలను సరిదిద్దేవారు కరువయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భక్తులకు కేటాయించిన గదుల వివరాలపై వారికి ఎస్‌ఎంఎస్‌లు వెళ్లడం లేదని సంబంధిత అధికారులకు తెలియటం లేదని సమాచారం. కౌంటర్లు చాలక ఇబ్బంది పడుతున్న సమాచారమూ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదు. అదే విధంగా కౌంటర్లలో పనిచేస్తున్న అధికారులకు సుమారు ఏడేళ్లుగా బదిలీలు లేకపోవటంతో వారు గదుల కేటాయింపు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment