సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఏమాత్రం సానుకూలత కనిపించకపోవడంతో తీవ్రంగా ఆందోళన చెందుతున్న అధికారపక్షం పోలీసుల సాయంతో ఒడ్డున పడాలని తాపత్రయ పడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయాన్ని తన కనుసన్నల్లో పెట్టుకుని వ్యవహారాలు చక్కపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) ఆర్పీ ఠాకూర్ పూర్తిగా సీఎం చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తున్నారు. సీఎం సూచనలకు అనుగుణంగా పోలీసు యంత్రాంగం అధికార పార్టీ సేవలో కొనసాగేలా ఆదేశాలు ఇస్తున్నారు. ఉదయం 10.30 గంటలకే పోలీసు ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్‌కు చేరుకుంటున్న డీజీపీ రాత్రి 9.30 గంటల వరకు బయటకు రాకుండానే పోలీసు వర్గాలను టీడీపీకి సేవలు అందించేలా నడిపిస్తున్నారు. పైకి తనకు ఎలాంటి సంబంధం లేదనే కలరింగ్ ఇస్తూ లోలోన టీడీపీకి సానుకూలంగా వ్యవహారాలను చక్కబెడుతున్నట్టు సమాచారం. చంద్రబాబు నియమించిన సొంత సామాజికవర్గం అధికారి.. డీజీపీ వెన్నంటి ఉండి ఈ పనులను చక్కపెడుతున్నారు.
‘కోఆర్డినేషన్’తో ముందుకు..
చంద్రబాబు అధికారం చేపట్టాక ఏసీబీ డీజీగా నియమితులైన ఠాకూర్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ మెప్పు పొందారు. అదే సమయంలో మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించడంతో పట్టుబట్టి ఆయన్ను డీజీపీ పోస్టులో వేయించారు. అయితే ఎన్నికల వేళ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాలతో ఓటమి భయం వెంటాడుతున్న చంద్రబాబు పోలీస్ బాస్‌ను తమ డైరెక్షన్‌లో నడిచేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. ఎన్నికలకు తొమ్మిది నెలలముందే పక్కా స్కెచ్‌తో డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా శాంతిభద్రతల కో ఆర్డినేషన్ పోస్టును కొత్తగా సృష్టించి అందులో తమ సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్(డీఐజీ) ఘట్టమనేని శ్రీనివాస్‌ను నియమించారు. ఆ ప్రకారం డీఐజీ ఘట్టమనేని ద్వారా పాలకపక్షానికి అనుకూల నిర్ణయాలను డీజీపీ ద్వారా అమలు చేయిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఉదయం పదిన్నర నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు పోలీసు ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ నుంచి బయటకు రాకుండానే డీజీపీ రాష్ట్రంలోని పోలీసులు టీడీపీకి సేవలందించేలా నడిపిస్తున్నట్టు తెలుస్తోంది. నేరుగా సీఎం చంద్రబాబుకు టచ్‌లో ఉంటున్న ఘట్టమనేని శ్రీనివాస్ అక్కడినుంచి వచ్చే సంకేతాలకు అనుగుణంగా డీజీపీతో జిల్లాలవారీగా ఆదేశాలిచ్చేలా సంధానకర్తగా వ్యవహరిస్తున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఠాకూర్ కోసం చంద్రబాబు ఢిల్లీ స్థాయి లాబీయింగ్..
శాంతిభద్రతల నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన డీజీపీ ఠాకూర్ ఏకపక్ష ధోరణిపై ఫిర్యాదులు వెల్లువెత్తడం తెలిసిందే. డీజీపీగా ఉన్న అతి తక్కువ కాలంలోనే ఠాకూర్ వివాదాల్లో కూరుకుపోయారు. ప్రభుత్వ ఏజెంటు మాదిరిగా వ్యవహరిస్తున్నారనే అపప్రథను మూటగట్టుకున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నంపై డీజీపీ వాస్తవాలు తెలుసుకోకుండా చేసిన వ్యాఖ్యలు దర్యాప్తును ప్రభావితం చేసేలా ఉన్నాయన్న విమర్శలు రావడం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్‌లో పార్కు స్థలం ఆక్రమణ, నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నిర్మాణం విషయాల్ని హైకోర్టు తప్పు పట్టడమూ విదితమే. ఇక రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికి వదిలేసిన ఠాకూర్ పూర్తిగా పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదే విషయమై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్, గవర్నర్, రాష్ట్ర ఎన్నికల అధికారికి ఠాకూర్‌పైన, ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు, శాంతిభద్రతల కో ఆర్డినేషన్ ఐజీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఇంటెలిజెన్స్ ఓఎస్‌డీ యోగానంద్‌లపైన ఫిర్యాదులు చేసిన సంగతి తెల్సిందే. ఇంత జరిగినా ఠాకూర్‌ను కాపాడుకునేందుకు అధికారపక్షం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఆయనపై ఇప్పటికే వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఇందుకు సంబంధించి కొద్ది రోజులక్రితం ఎన్నికల సంఘం ఏపీలో డీజీ కేడర్ జాబితాను పంపించాలని రాష్ట్రాన్ని కోరినట్టు తెలిసింది. ఇప్పటికే ఏజీ డీజీపీగా ఆర్పీ ఠాకూర్ ఉన్నప్పటికీ ఎన్నికలసంఘం మళ్లీ డీజీ జాబితాను అడగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎన్నికల సమయంలో తన మనిషిగా ఠాకూర్ ఉంటేనే బాగుంటుందని భావిస్తున్న చంద్రబాబు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది.
డీజీపీ నియామకం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టు జరిగేలా సీఎం చంద్రబాబు గతేడాది పోలీస్ యాక్ట్‌ను సవరించారు. అదే ధీమాతో ఎం.మాలకొండయ్యను, ఆ తరువాత ఠాకూర్‌ను రాష్ట్ర సర్కారు డీజీపీలుగా నియమించుకుంది. కానీ డీజీపీల నియామకం విషయంలో కొద్ది రోజులక్రితం దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగానే స్పందించింది. డీజీపీలను రాష్ట్రాలు నేరుగా నియమించుకోవడానికి వీలులేదని, సీనియారిటీ ప్యానల్ పంపి యూపీఎస్‌సీ ద్వారానే నియమించాలన్న సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఏపీ నుంచి సీనియర్ ఐపీఎస్ జాబితాను గుట్టుచప్పుడు కాకుండా యూపీఎస్‌సీకి పంపించారు. అందులో ఠాకూర్ పేరును ముందుపెట్టి, మరో నలుగురితో జాబితాను పంపించారు. చంద్రబాబు ఢిల్లీలో తనకున్న పరిచయాలను పణంగా పెట్టి తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment