రెక్కీపై సమాచారం లేదు..: డీజీపీ
సాక్షి, అమరావతి: ఢిల్లీలోని ఏపీ భవన్‌లో మావోయిస్టులు రెక్కీ నిర్వహించారన్న సమాచారం తమకు రాలేదని డీజీపీ నండూరి సాంబశివరావు స్పష్టం చేశారు. ఏవోబి ఎన్‌కౌంటర్ నేపథ్యంలో సీఎం, ముఖ్య అధికారులకు గట్టి భద్రత కల్పించాలంటూ కేంద్ర హోంశాఖ తమను అప్రమత్తం చేసిందని ఆయన వెల్లడించారు. వార్షిక క్రైం సమీక్షలో భాగంగా శనివారం విజయవాడలో నిర్వహించిన సమావేశంలో ఏపీ భవన్‌లో మావోయిస్టులు ఆరు సార్లు రెక్కీ నిర్వహించారని వస్తున్న సమాచారాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు.
గతంలో దేశ వ్యాప్తంగా నక్సలైట్ల పేరు చెబితే ఏపీలోనే ఎక్కువ అనే భయం ఉండేదని, ఏపీ పోలీసుల వ్యూహాత్మక పద్ధతుల్లో మావోయిస్టులను కట్టడి చేయడంతో ఏవోబిలోని విశాఖ, తూర్పు, విజయనగరం జిల్లాలకు పరిమితమయ్యారని చెప్పారు. కొత్త ఏడాది నుంచి ఏపీలో సింగపూర్ తరహా పోలీసింగ్ అమలు చేస్తామని డీజీపీ అన్నారు. జిల్లాల వారీగా క్రైమ్ మ్యాపింగ్ చేసి నేరాల స్వభావాన్ని బట్టి వాటిని అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు.