హింసకు పాల్పడితే సహించం: డీజీపీ | dgp warns seemandhra protestors | Sakshi
Sakshi News home page

హింసకు పాల్పడితే సహించం: డీజీపీ

Published Sun, Oct 6 2013 12:51 AM | Last Updated on Fri, Sep 1 2017 11:22 PM

హింసకు పాల్పడితే సహించం: డీజీపీ

హింసకు పాల్పడితే సహించం: డీజీపీ

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయని, మిగతా జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి ప్రసాదరావు తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన నేపథ్యంలో విజయనగరం, అనంతపురం జిల్లాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయని, మిగతా జిల్లాల్లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి ప్రసాదరావు తెలిపారు. హింసకు పాల్పడితే సహించబోమని, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద అరెస్టు చేస్తామని హెచ్చరించారు. శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సీమాంధ్ర జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న 45 కంపెనీల పారా మిలటరీ దళాలకు అదనంగా 34 కంపెనీలను మోహరిస్తున్నట్లు వివరించారు. రాజీనామా చేయని ప్రజాప్రతినిధుల ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ప్రజలు దాడులుచేస్తున్నందున ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద భ ద్రతను పెంచామన్నారు.
 
 విజయనగరంలో పరిస్థితి చేయిదాటడంతో ఆంధ్రా రీజియన్ ఐజీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు స్వయంగా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఆందోళనల్లోకి అసాంఘిక శక్తులొచ్చాయనే కోణంలో పరిశీలన జరుపుతున్నామని డీజీపీ తెలిపారు. ఉద్యమం పేరుతో అసాంఘిక శక్తులు దాడులకు పాల్పడుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స చేసిన విమర్శపై విలేకరుల అడిగిన ప్రశ్నకు డీజీపీ పై విధంగా స్పందించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనే ఆందోళనల్లో చొరబడే అసాంఘిక శక్తులు లూటీలు వంటి దుశ్చర్యలకూ పాల్పడే అవకాశం లేకపోలేదన్నారు. అలాంటి ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
 
 జగన్ దీక్షకు భద్రత కల్పిస్తున్నాం
 
 సమైక్యాంధ్ర కోసం వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ నిరశనకు భద్రత కల్పిస్తున్నారని డీజీపీ ప్రసాదరావు తెలిపారు. లోటస్‌పాండ్‌లోని తన ఇంటి వద్దే జగన్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినందున పోలీసుల అనుమతి అవసరం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జగన్ దీక్షను అడ్డుకుంటామని కొందరు ప్రకటించడం, అడ్డుకునేందుకు ప్రయత్నించినందున నగర పోలీసులు తగిన భద్రత కల్పిస్తున్నారన్నారు. హైదరాబాద్‌లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా ఏపీఎస్పీ, పారా మిలటరీ బలగాలను సిద్ధంగా ఉంచామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement