తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికే జేఈఓగా, ప్రత్యేకాధికారిగా రెండు పర్యాయాలు పనిచేసిన ధర్మారెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టారు. నిన్న కాలినడకన తిరుమలకు చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం 7.30 గంటలకు శ్రీవారి ఆలయంలో టీటీడీ ప్రత్యేకాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. ధర్మారెడ్డి 2004 జూలై 5 నుంచి 2006 సెప్టెంబర్ 6 వరకు తిరుమల జేఈవో విధులు నిర్వహించారు. రెండోసారి 2008 ఏప్రిల్ 8 నుంచి 2010 ఆగస్టు 10 వరకు ప్రత్యేకాధికారి హోదాలో పనిచేశారు. మరోసారి స్వామి సేవ చేసుకునే అవకాశం ఆయనకు లభించింది. ధర్మారెడ్డి చేపట్టిన సంస్కరణల్లో అతి ప్రధానమైనది మహాలఘు దర్శనం. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది.
వచ్చిన రోజే స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం లేక భక్తులు నానా ఇబ్బందులు పడుతుండేవారు. రోజుల తరబడి క్యూల్లో వేచివుండే వారు. దీంతో భక్తులకు ఇబ్బంది లేకుండా శీఘ్ర దర్శనాన్ని కల్పించేందుకు 2009లో మహాలఘు దర్శనాన్ని ప్రవేశపెట్టారు. అప్పటివరకు రోజుకు 60వేల నుంచి 70వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటే మహాలఘు దర్శనం ద్వారా నిత్యం 90 లక్షల మందికి పైగా దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారు. మొదట్లో ఈ విధానంపై విమర్శలు వచ్చినా అటు తరువాత ప్రతి నిత్యం అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటూ ఉండడడంతో ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇవ్వడమే కాక భక్తుల మన్ననలను పొందింది.
లడ్డూల కొరత తీర్చేందుకు..
శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూల కొరతను తీర్చేందుకు ధర్మారెడ్డి కృషిచేశారు. లడ్డూ తయారీని ఆలయం వెలుపలకు మార్చే అవకాశం లేకపోవడంతో ఆగమ సలహాదారుల సూచనతో బూందీ తయారీని ఆలయం వెలుపలకు మార్చారు. బూందీని తిరిగి పోటులోకి తీసుకెళ్లి లడ్డూల తయారు చేయించారు. దీంతో లడ్డూల కొరత తగ్గింది.
తిరువీధుల్లో గ్యాలరీలు
శ్రీవారి ఆలయ మాడ వీధులు విసర్తణ అనంతరం భక్తులు స్వామివారి ఉత్సవాలను తిలకించేందుకు ప్రత్యేకంగా తిరువీధుల్లో గ్యాలరీలను నిర్మింపజేశారు. ప్రత్యేక పర్వదినాలైన ఏకదశి, ద్వాదశి సమయాల్లో వేల టికెట్లను జారీచేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లుచేశారు. ఇలా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి టీటీడీలో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment