సాక్షి, అమరావతి: బ్రిటిషర్లు తమ స్వార్థ ప్రయోజనాల కోసమే పెద్దల సభను ఏర్పాటు చేశారని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఈ విషయాన్ని గమనించి స్వాతంత్ర్యానికి ముందే జాతిపిత మహాత్మా గాంధీ ఈ సభను వ్యతిరేకించారని పేర్కొన్నారు. పార్లమెంటు ప్రజాస్వామ్యం ఉన్న అనేక దేశాల్లో పెద్దల సభ లేదని తెలిపారు. సోమవారం శాసనమండలి రద్దు తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయపరమైన కారణాలతో చట్టాలు ఆలస్యమవుతున్నాయి కాబట్టి మండలి రద్దు సరైన నిర్ణయమని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవలేని వారి రాజకీయ పునరావాస కేంద్రంగా మండలి మారిందని.. అటువంటి సభ అవసరం లేదని గతంలో.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలోని కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉందని పేర్కొన్నారు.(ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం)
అరుదైన తీర్పు ఇచ్చారు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 51 శాతానికి పైగా ప్రజలు మద్దతిచ్చారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు, అభిప్రాయాలను వైఎస్ జగన్ తెలుసుకున్నారు. రాష్ట్రమంతా పూర్తిగా అధ్యయనం చేసిన ఆయనకు ప్రజలు అరుదైన తీర్పు ఇచ్చారు. ఇంతకు ముందెన్నడూ లేని భారీ మెజారిటీతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అటువంటి ప్రభుత్వం చేస్తున్న చట్టాలను ప్రజల చేత తిరస్కరించబడిన టీడీపీ అడ్డుకుంటోంది. మండలి వల్ల కోట్ల రూపాయలు దుర్వినియోగమని చంద్రబాబు గతంలో చెప్పారు. ఐదు కోట్ల మంది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం చేస్తున్న చట్టాలను.. ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబు గ్యాలరీలో కూర్చుని మరీ అడ్డుకుంటున్నారు. టీడీపీ రాజకీయాల వల్ల కీలక బిల్లులు ఆలస్యమవుతున్నాయి’అని ధర్మాన.. చంద్రబాబు తీరును ఎండగట్టారు.(మీరు కోరుకున్నదే కదా చంద్రబాబు: చెవిరెడ్డి )
తాత్కాలికమని అంబేద్కర్ చెప్పారు..
‘పెద్దల సభలు తాత్కాలికమే అని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చెప్పారు. ఆర్టికల్ 169 కింద పెద్దల సభను ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చని సూచించారు. అంతేకాదు గోపాలస్వామి అయ్యర్, ఆచార్య రంగా వంటి వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చట్ట సవరణలు చేసే అధికారం ప్రజల చేత ఎన్నుకోబడిన శాసన సభకు లేకుంటే ప్రజల ఆకాంక్షలు ఎలా నెరవేరతాయి. మంత్రిగా ఉన్న నారా లోకేశ్‌ను మంగళగిరి ప్రజలు తిరస్కరిస్తే.. ఆయన మండలిలో ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్నారు. ఇది ప్రజాతీర్పును అపహాస్యం చేయడమే. 1971, 72, 75లో రాజ్యసభను రద్దు చేసే ప్రయత్నాలు జరిగాయి. చంద్రబాబు ముఖం చూపించలేకనే శాసన సభకు రాలేదు. మండలి అవసరం లేదన్న బాబు వ్యాఖ్యలను ప్రశ్నిస్తారనే భయంతోనే చర్చకు రాలేదు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని గతంలో చంద్రబాబు తీర్మానం కూడా పెట్టారు. ఆ తీర్మానంలో ఉన్నవన్నీ కూడా తప్పులే. సీఆర్డీఏ చట్టం 171 పేజీలు ఉంది. దానిని శాసన మండలిలో ఎన్నిరోజులు చర్చించారు. దాన్ని సెలెక్ట్ కమిటీకి ఎందుకు పంపలేదు. 12 పేజీలు ఉన్న వికేంద్రీకరణ బిల్లును మాత్రం సెలెక్ట్ కమిటీకి పంపడంలో ఉద్దేశం ఏమిటి’అని ధర్మాన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment