అప్పుడు అవినీతి జీఓ.. ఇప్పుడు మంచిదైపోయిందా? | dharmana prasadarao blames tdp | Sakshi
Sakshi News home page

అప్పుడు అవినీతి జీఓ.. ఇప్పుడు మంచిదైపోయిందా?

Published Sat, Mar 7 2015 2:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

అప్పుడు అవినీతి జీఓ.. ఇప్పుడు మంచిదైపోయిందా? - Sakshi

అప్పుడు అవినీతి జీఓ.. ఇప్పుడు మంచిదైపోయిందా?

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంటే ఒకలా, అధికారపక్షంలో ఉంటే మరోలా వ్యవహరిస్తోందని  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ విపక్ష స్థానంలో ఉన్నప్పుడు రూ. 22 వేల కోట్ల రూపాయల అవినీతి దాగి ఉందని ఆరోపించగా ఆగిపోయిన జీఓను... అధికారంలోకి రాగానే అమలుకు చేయాలనుకుంటోందన్నారు. దీని వెనుక ఎంత అవినీతి దాగి ఉందని ఆయన ప్రశ్నించారు. ఈపీసీ విధానంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు అధిక రేట్లు (ప్రైస్ ఎస్కలేషన్) చెల్లించేలా గత కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2014 ఫిబ్రవరిలో జీవో నెం 13 జారీ చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తీవ్రంగా తప్పుపట్టింద ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాష్ట్రపతి పాలన సమయంలో గవర్నర్ నరసింహన్ ఈ జీవో అమలును నిలిపి వేశారన్నారు. గవర్నర్ నిలిపివేసిన జీవోను తిరిగి అమలు చేసేందుకు బాబు ప్రభుత్వం గత నెల 23వ తేదీన కొత్తగా 22 నంబర్ జీఓను జారీ చేసిందన్నారు.
 
 మంత్రి మాటల సీడీ ఇదిగో
 
 గతంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు ఈ జీఓను జారీ చేసినపుడు రూ. 22 వేల కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారంటూ మంత్రి ఉమామహేశ్వరరావు ఆరోపించారన్నారు. ఇందుకు సంబంధించిన సీడీని మీడియా ముందు ప్రదర్శించారు. ఈ జీవో జారీ వెనుక అవినీతి దాగి ఉందంటూ అప్పటి టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత ముద్దుకృష్ణమనాయుడు కూడా విమర్శించారన్నారు. ఏ ఆర్థిక ప్రయోజనాల్ని ఆశించి టీడీపీ ప్రభుత్వం అప్పడు ఆరోపణలు చేసిన జీవోను తిరిగి అమలు చేసేందుకు పూనుకుందని ప్రశ్నించారు. మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే బాబు సర్కారు దీనిపై కొత్తగా జీవో జారీ చేసిందా? అని ప్రశ్నించారు. రూ. 100 కోట్ల కన్నా ఎక్కువగా చెల్లింపులు జరపాల్సిన  సందర్భంలో తప్పనిసరిగా కేబినెట్‌లో చర్చించాలనే నిర్ణయం ఉందని, అటువంటపుడు ఇంత పెద్ద విషయాన్ని మంత్రివర్గంలో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన జవాబివ్వాలని ధర్మాన డిమాండ్ చేశారు.
 
 
 మా ఆరోపణలే నిజమవుతున్నాయి!
 
 రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన భూ ముల్లో 1,000 ఎకరాల్ని రెండు సింగపూర్ కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కొన్ని ఆంగ్ల పత్రికల్లో కథనాలు వచ్చిన విషయాన్ని  ఈ సందర్భంగా ధర్మాన ప్రస్తావించారు. పైకి తియ్యటి మాటలు చెబుతున్నా... రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనేదే చంద్రబాబు సర్కారు ఉద్దేశమని తమ పార్టీ ఆదినుంచీ చెబుతూనే ఉందన్నారు. అదే నిజమనే విషయం క్రమంగా తేలుతోందన్నారు. రాజధాని నిర్మాణంవల్ల ప్రభుత్వం ఉన్న వారికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అందువల్లనే రాజధాని కోసం అటవీ భూములను డీనోటిఫై చేస్తామని  కేంద్రం ప్రకటించినా రాష్ర్ట ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు. రాజధాని నిర్మాణంలో సింగపూర్ ప్రభుత్వం తమతో ఒప్పందం చేసుకుందని ముఖ్యమంత్రి ఇప్పటిదాకా చెబుతూ వచ్చారని, అయితే సింగపూర్ మంత్రి మాత్రం అందుకు భిన్నంగా చెప్పారన్నారు. సింగపూర్ ప్రభుత్వం మాత్రం కాదని, తమ దేశానికి చెందిన రెండు ప్రైవేట్ కంపెనీలతో ఒప్పందమని చె ప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

పాలకుల్లో కొందరికి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని, అందువల్లనే సీఆర్‌డీఏ బిల్లులో రైతుల నుంచి ప్రభుత్వం సేకరించే భూమి ఇతరులకు బదిలీ చేయవచ్చనే నిబంధన పెట్టారన్నారు. రెండు సింగపూర్ కంపెనీలకు కేవలం నామినేషన్ పద్ధతిన ప్రభుత్వం 1,000 ఎకరాల భూమి ఎలా ఇవ్వగలదని ప్రశ్నించారు. ప్రభుత్వం రాజధాని విషయంలో  అంతర్జాతీయ బిడ్డింగ్ పిలవగలదా ప్రశ్నించారు. రాజదాని భూముల విషయంలో పవన్‌కల్యాణ్ ప్రభుత్వానికి ఒక సలహా ఇవ్వగానే ఆయనకు అవగాహన లేదని కొందరు మంత్రులు మాట్లాడారని, అలాంటి వారిని ఎన్నికల సమయంలో పక్కన పెట్టుకొని ఎలా ప్రచారం చేశారో వాళ్లే జవాబు ఇవ్వాలని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement