అనంతపురం కోర్టుకు ధోనీ తరపు లాయర్లు
అనంతపురం : ప్రముఖ ఆంగ్ల మాసపత్రిక ‘బిజినెస్ టుడే’లో హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ధోని ఫోటో ముద్రించారనే కేసులో విచారణ నిమిత్తం ధోనీ తరపు న్యాయవాదులు బుధవారం అనంతపురం కోర్టుకు హాజరయ్యారు. బిజినెస్ టుడే మేగజైన్ ముఖచిత్రంపై విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ధోనీ చిత్రాన్ని ముద్రించి, చేతిలో బూటు ఉంచడంపై విశ్వహిందూపరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు యర్రగుంట్ల శ్యాంసుందర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరిలో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
హిందువుల మనోభావాలను కించపరిచేలా ఫొటో ముద్రించినందున ధోనీ, చైతన్య కల్బగ్‌లపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు హాజరు కావాలని మూడుసార్లు ధోనీకి సమన్లు పంపినా హాజరు కాకపోవటంతో జిల్లా షెడ్యూలు కులాలు, తెగల ప్రత్యేక న్యాయస్థానం బెయిలబుల్ వారెంట్లు(బీడబ్ల్యూ) జారీ చేసింది. జులై 16లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతం ధోనీ ఇంగ్లండ్ టూర్లో ఉండటంతో దీనిపై వివరణ ఇచ్చేందుకు అతని తరపు న్యాయవాదులు ఫంకజ్, యజ్ఞదత్తా కోర్టుకు హాజరయ్యారు.