విందుకు ఆహ్వానం అందిందా?
- ఒబామా పర్యటనపై సీఎం వాకబు
- దావోస్ నుంచి బాబు నేడు రాక
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇస్తున్న విందులో పాల్గొనాలని సీఎం చంద్రబాబు భావించారు. ఆహ్వానం అందితే హాజరుకావాలనుకున్నారు. ఈ విషయమై తన కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపారు. ఆహ్వానం వస్తే విందుకు హాజరవ్వడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. శనివారం రాత్రి వరకూ ఆయనకు ఆహ్వానం అందలేదు. దీంతో దావోస్ నుంచి వచ్చిన రోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. గవర్నర్ నరసింహన్‌కు కూడా రిపబ్లిక్ డే ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆదివారం రాత్రికే విజయవాడ చేరుకుంటున్నారు.
తిరుగు పయనమైన చంద్రబాబు..
దావోస్‌లో పర్యటన ముగించుకున్న చంద్రబాబు అక్కడి నుంచి రాత్రి ఏడు గంటలకు రోడ్డు మార్గంలో జ్యూరిచ్ బయలుదేరారు. అక్కడి నుంచి ఆయన ఒమన్ ఎయిర్ విమానంలో అక్కడి కాలమానం ప్రకాకం రాత్రి 9.55 గంటలకు హైదరాబాద్ బయలుదేరారు. మస్కట్ మీదుగా వచ్చే ఆ విమానం భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం చేరుకుంటుంది. నగరానికి చేరుకున్న తరువాత బాబు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని రాత్రి ఏడు గంటలకు విజయవాడ బయలుదే రతారు.