సాక్షి, కడప: ఒంగోలుకు ట్రిపుల్ ఐటీ మంజూరై మూడో విద్యా సంవత్సరం ప్రారంభమైనా.. ఇంకా వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోనే తరగతులు కొనసాగుతుండడం చంద్రబాబు ప్రభుత్వ ఉదాసీనతకు అద్దం పడుతోంది.
ఇన్నాళ్లూ పట్టించుకోని ప్రభుత్వం..: ఎన్నికలకు ముందు హడావుడి చేస్తోంది..మూడేళ్లుగా నాన బెట్టి ఇప్పుడు తూతూ మంత్రంగా శంకుస్థాపనలకు శ్రీకారం చుడుతోంది. శంకుస్థాపన శిలాఫలకానికే మూడేళ్లు పడితే...భవన నిర్మాణాలకు ఇంకెన్నాళ్లు పడుతుందోనన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రకాశం జిల్లా పామురు మండల పరిధిలోని దూబగుంట్లలో 208.45 ఎకరాల స్థలాన్ని కేటాయించి..అదే స్థలంలో మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శంకుస్థాపన చేయడం పలువురి విమర్శలకు గురవుతోంది.
2016లో కొత్త ట్రిపుల్ ఐటీలు మంజూరు: తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చాక 2016లో శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీల ఏర్పాటుకు పూనుకుంది. అనుకున్నదే తడువుగా తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టారు తప్ప శాశ్వత పరిష్కారం దిశగా ఇప్పటివరకు అడుగులు వేయలేదు.
పాత క్యాంపస్‌లోనే..: వేంపల్లె సమీపంలోని ఇడుపులపాయలోనే రెండు ట్రిపుల్ ఐటీల విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సొంత భవనాల్లో విద్యను అభ్యసిస్తుండగా..ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పాత క్యాంపస్‌లో ఉంటున్నారు. అక్కడ విద్యాబోధనతోపాటు హాస్టల్ వసతులు కల్పించారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించిన నేపథ్యంలో 2008లో తాత్కాలిక షెడ్లు వేసి ప్రారంభించారు. ప్రస్తుతం తాత్కాలిక షెడ్లలోనే పలు సమస్యల మధ్య ఒంగోలు విద్యార్థులు చదువును కొనసాగిస్తున్నారు.
ఒంగోలు ట్రిపుల్ ఐటీలో 3,254మంది విద్యార్థులు
జిల్లాలోని ఇడుపులపాయలో ఏర్పాటు చేసిన ఒంగోలు ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు 3,254 మంది విద్యను అభ్యసిస్తున్నారు. 2016, 2017, 2018 విద్యార్థులను కలుపుకుని దాదాపు 3,250 మందికి పైగా ఇడుపులపాయలోని ఒంగోలు ట్రిపుల్‌ఐటీలో చదువుకుంటున్నారు. ప్రతి ఏడాదికేడాదికి విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వారికి సౌకర్యాలు కల్పించడం యాజమాన్యానికి కష్టంగా మారుతోంది.
పేరుకే ఒంగోలు.. ఇడుపులపాయలోనే పాఠాలు!
Published Wed, Aug 8 2018 4:49 AM | Last Updated on Wed, Aug 8 2018 4:49 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment