డిజిటల్‌ టీటీడీ | digital system in TTD | Sakshi
Sakshi News home page

డిజిటల్‌ టీటీడీ

Published Wed, Nov 8 2017 5:53 AM | Last Updated on Wed, Nov 8 2017 5:53 AM

digital system in TTD - Sakshi

సాక్షి, తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ ) ధార్మిక సంస్థ డిజిటల్‌ వ్యవస్థలోకి మారుతోంది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సౌకర్యంతోపాటు పరిపాలన పరంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తూ సేవల్ని మరింత విసృతం చేస్తోంది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్‌ నుంచి సాంకేతిక సహకారం తీసుకుంటోంది.  

సాంకేతిక పరిజ్ఞానంతో భక్తులకు చేరువైన టీటీడీ సౌకర్యాలు..
  ఆన్‌లైన్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో సౌకర్యాలు సులభతరం అయ్యాయి. ఇంటెర్నెట్‌ ద్వారా ఇంటి వద్ద నుండే భక్తులు టీటీడీలోని అన్ని సౌకర్యాలు సులభంగా పొందుతున్నారు.

♦  తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో 20 నుండి 40శాతం ఇంటెర్నెట్‌ అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ ద్వారా కేటాయిస్తున్నారు.  

♦  2010లో కరెంట్‌ బుకింగ్‌తో ప్రారంభించిన రూ.300 శీఘ్రదర్శన టికెట్లను 2013 నుండి పూర్తి స్థాయి ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా కేటాయిస్తున్నారు. రద్దీని బట్టి 15వేల నుండి 25వేలవరకు టికెట్లు కేటాయిస్తున్నారు.

♦  టీటీడీ పరిధిలో మొత్తం 9 ట్రస్టులు, ఒక స్కీము ఉంది. రూ.లక్ష నుండి రూ.కోట్లలో విరాళాలు సమర్పించిన సుమారు 47 వేల మంది దాతల వివరాలు పూర్తిస్థాయిలో డిజిటల్‌ చేశారు. ఈ పాస్‌బుక్‌ కింద దాతలకు శ్రీవారి దర్శనం, తిరుమలలో బస సౌకర్యాలన్నీ ఆన్‌లైన్లో ముందస్తుగా రిజర్వు చేసుకునే అవకాశం కలిగింది.

 తిరుమల శ్రీవారు కూడా స్టాక్‌ మార్కెట్‌లో వాటాదారుగా చేరారు. స్టాక్‌ హోల్డింగ్‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌హెచ్‌సీఐఎల్‌)లో శ్రీవేంకటేశ్వర స్వామివారి పేరుతో డీమ్యాట్‌ ఖాతా తెరిచారు. దీనిద్వారా భక్తులు షేర్లను సర్టిఫికెట్ల రూపంలో హుండీలో సమర్పిస్తుంటారు.  

 రూ.1000, రూ.500 నోట్ల రద్దు తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల ద్వారా డిజిటల్‌ చెల్లింపుల్ని టీటీడీ పెంచింది. గదులు, దర్శన టికెట్ల కేంద్రాల్లో ఇప్పటికే పీవోఎస్‌ యంత్రాలు అమర్చి నగదు రహిత వ్యవహారాలు చేయిస్తున్నారు.

 టీటీడీ ముద్రించిన ఆథ్యాత్మి, ధార్మిక, సాహిత్య పరమైన ప్రచురణలు సుమారు 2500కిపైగా డిజిటల్‌ చేశారు. భక్తులు సులభంగా, ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

మొబైల్‌యాప్‌తోనూ అందుబాటులో అన్ని సౌకర్యాలు
చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు శ్రీవారి రూ.300 దర్శనం, అన్ని రకాల ఆర్జిత సేవలు, గదుల బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇక హుండీకి కూడా సెల్‌ఫోన్‌ద్వారానే కానుకలు బదలాయించ వచ్చు.

ఒకే అప్లికేషన్‌ ద్వారానే టీటీడీ పద్దులు రూ.2858 కోట్ల (2017–2018) బడ్జెట్‌తో కూడిన ధార్మిక సంస్థలో పద్దుల వ్యవహారాలు కీలకం. వీటిని కూడా టీటీడీ టీసీఎస్‌ సంస్థ సాయంతో డిజిటల్‌ చేసింది. ఫలితంగా పద్దుల నిర్వహణలో బాధ్యత, భద్రత పెరిగింది.

ఈ–ఫైలింగ్‌కు శ్రీకారం చుట్టిన టీటీడీ
సుమారు 90 విభాగాధిపతుల అధీనంలోని అన్ని వ్యవహారాలను ఈ–ఫైలింగ్‌ చేయాలని సంకల్పించారు. ప్రభుత్వ పరిధిలోని ఎన్‌ఐసీ కంప్యూటర్‌ విభాగం పరిధిలో దేవస్థానంలోని ఐదు విభాగాలు ఈ–ఫైలింగ్‌లో నడుస్తున్నాయి. కొత్తగా మరో 12 విభాగాల్లోనూ శ్రీకారం చుట్టారు. 2018 మార్చినాటికి ఈ–ఫైలింగ్‌ వ్యవస్థ పూర్తి చేయాలనే లక్ష్యంతో టీటీడీ ఉంది.

తెలుగు, కన్నడలో టీటీడీ వెబ్‌సైట్లు, త్వరలో తమిళం, హిందీలోనూ..
శ్రీవారి దర్శనం దేశ విదేశాల నుండి భక్తులు వస్తుంటారు. టీటీడీ సమాచారం, కల్పిస్తున్న సౌకర్యాలన్నీ భక్తులందరికీ  చేరువయ్యేలా తాజా సమాచారాన్ని దేవస్థానం వెబ్‌సైట్లలో పొందుపరుస్తున్నారు. వీటిని రీజినల్‌ భాషల్లోనూ ప్రవేశ పెట్టారు. ఇటీవల తెలుగు, కన్నడ వెర్షన్‌లో ప్రారంభించారు. త్వరలో తమిళం, హిందీలోనూ ప్రారంభించనున్నారు.

 ఈ– వ్యవస్థతో మరింత పారదర్శకత
శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు తిరుమలలో బస, దర్శనం, ఈ హుండీ, ఈ–డొనేషన్‌ వంటివి ఇంటి నుండి సులభంగా పొందే చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. దీనివల్ల నగదు వ్యవహారాల్లో  పారదర్శకత మరింత పెరిగిందన్నారు. డెబిట్, క్రెడిట్‌ కార్డులు, ఆన్‌లైన్‌ ద్వారా భక్తులు సులభంగా టీటీడీ సదుపాయాలు పొందే ఏర్పాట్లు చేశామన్నారు. పరిపాలన పరంగా ఈఫైలింగ్, ఈఆర్‌పీ వ్యవస్థను మరింత పక్కాగా అమలు చేస్తామన్నారు.    
– టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement