తిరుపతిలో డిజిటల్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్
- దేశంలోనే మొదటి సంస్థను ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
- మౌలిక సదుపాయాలు, స్థలం కేటాయింపునకు ముందుకొచ్చిన ఎస్వీయూ
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్నేషనల్ డిజిటల్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ (ఐఐడీటీ)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం తిరుపతిని అనువైన కేంద్రంగా గుర్తించి సంస్థకు ప్రాథమిక అవసరాల కోసం రూ. 39.97 కోట్లు మంజూరు చేసింది. తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 40 వేల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించేందుకు ముందుకొచ్చింది. అలాగే అవసరమైన మౌలిక సదుపాయాలను యూనివర్సిటీ కల్పిస్తుంది. సంస్థ ప్రణాళికలు, పాఠ్యాంశాల రూపకల్పన యూనివర్సిటీ అధికారుల పర్యవేక్షణలో జరుగుతాయి. ఈ మేరకు రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇన్‌స్టిట్యూట్ ప్రత్యేకతలు..
► ఆన్‌లైన్ వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో సైబర్ సెక్యూరిటీ అత్యంత కీలకం. సైబర్ నేరస్తులపై, నేర విధానాలపై లోతైన అధ్యయనం అవసరం. ఈ తరహా శిక్షణ విధానాలకు ప్రత్యేక కోర్సులు ఇప్పటి వరకు దేశంలో లేవు. ఐఐడీటీలో దీనిపై ప్రధానంగా దృష్టి పెడతారు.
► జాతీయ, అంతర్జాతీయ పరిశ్రమలు కోర్సు నిర్వహణలో భాగస్వామ్యం అవుతాయి. ఆన్‌లైన్‌లో జరుగుతున్న మోసాలు, వాటి తీరుతెన్నులు, నివారించేందుకు అవసరమైన వ్యూహాలను పాఠ్యాంశాల్లో చేరుస్తారు.
► సాంకేతిక విద్యలో గ్రాడ్యుయేషన్ చేసిన వారు ప్రవేశానికి అర్హులు. ఆరు నెలల నుంచి ఏడాది పాటు కోర్సు కాలపరిమితి ఉండే వీలుంది.నిపుణుల సలహా మేరకు కాలపరిమితిని నిర్ణయిస్తారు.
► స్వయం ప్రతిపత్తి (అటానమస్) హోదా కలిగి ఉండే ఐఐడీటీ సంస్థ కోర్సు పూర్తై తర్వాత సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ప్రముఖ సంస్థల్లో ఉపాధి కోసం దీన్ని అదనపు అర్హతగా గుర్తిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అవసరాన్ని బట్టి వీరి సర్వీసులను వినియోగించుకుంటుంది.