ఒక్క వ్యక్తే రూ.21,780కోట్ల పన్ను బాకీ!
ఒక్క వ్యక్తే రూ.21,780కోట్ల పన్ను బాకీ!
Published Tue, Jan 24 2017 6:16 PM | Last Updated on Tue, Sep 5 2017 2:01 AM
న్యూఢిల్లీ : ఓ వైపు ఆదాయ అసమానతల్లో వ్యత్సాసాలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు పన్ను చెల్లింపుదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులో భారీగానే ఎగనామం పెడుతున్నారు. పన్నులు చెల్లింపులు ఏ మేర బాకీ పడుతున్నాయో ఆదాయపు పన్ను విభాగం తాజా గణాంకాలు చూస్తే నివ్వెరపోవాల్సిందే. ఒక్క వ్యక్తే దాదాపు రూ.21,780 కోట్ల ఆదాయపు పన్నును ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉందట. 2014-15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పేరు తెలియని ఓ వ్యక్తి రూ.21,870 కోట్ల పన్ను బాకీ పడినట్టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తాజా డేటా వెల్లడించింది. భారతీయులందరూ చెల్లించే పన్నుల్లో 11 శాతం ఆ వ్యక్తే చెల్లించాల్సి ఉందని తెలిపింది.
అదేవిధంగా 2014-15 ఆర్థిక సంవత్సరంలో ముగ్గురు పన్ను చెల్లింపుదారుల ఆదాయాలు రూ.500 కోట్లకు పైనే ఉన్నాయట. కానీ ఆ వ్యక్తులు ఎవరన్నది బయటకి వెల్లడికాలేదు. ఇటీవల ఆదాయ అసమానతలపై ఆక్స్ఫామ్ ఇండియా సంచలన రిపోర్టు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 1 శాతానికి పైగా భారతీయుల చేతుల్లోనే 58 శాతం సంపద ఉందని ఈ రిపోర్టు పేర్కొంది. 57 బిలినియర్ల సంపద కిందిస్థాయి 70 శాతం మంది వద్దనున్న సంపదకు సమానమని తెలిపింది. అమెరికాలో టాప్ 1 శాతం మంది వద్ద 19 శాతం ఆదాయం ఉండగా.. వారు 38 శాతం పన్నులు చెల్లిస్తున్నారని ఆ దేశప్రభుత్వం పేర్కొంది. కానీ భారత్లో వీటిని కొలవడం కుదరదు. ఏ నిష్ఫత్తిలో ఆదాయ, పన్నులను భారతీయులు చెల్లిస్తున్నారని తెలియదు. ఎందుకంటే ఆ డేటాను ప్రభుత్వం విడుదల చేయదు. పన్ను వసూళ్లు యేటికేటికి పెరుగుతున్నప్పటికీ, తప్పించుకునే వారు దర్జాగానే తప్పించుకుంటున్నట్టు తెలిసింది.
Advertisement