డి.గొటివాడలో డెంగ్యూ
- వ్యాధి లక్షణాలతో కేజీహెచ్‌లో నలుగురు
- ఇంటింటా జ్వరపీడితులు
- గ్రామంలో కొరవడిన పారిశుద్ధ్యం
- వైద్య సేవలందిస్తున్నా తగ్గని జ్వరాలు
- భయాందోళనలో గ్రామస్తులు
మాడుగుల: మండలంలోని డి.గొటివాడ వాసులు మంచం పట్టారు. పది రోజులుగా జ్వరాలతో విలవిల్లాడుతున్నారు. ప్రతి ఇంటా ఒకరిద్దరు బాధితులు కనిపిస్తారు. గ్రామానికి చెందిన చినబ్బాయి, తణుకు నాని, షేక్‌సల్మాన్, దండి స్వరూప్‌లు డెంగ్యూ లక్షణాలతో ప్రస్తుతం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. గ్రామంలో సుమారు 1200 మంది ఉన్నారు. గ్రామమంతటా పారిశుద్ధ్యం కొరవడింది. ఎక్కడికక్కడ మురుగునీరు రోడ్లపై కనిపిస్తుంది. దీనికి వర్షాలు తోడవ్వడంతో పరిస్థితి దయనీయంగా ఉంది.
గ్రామంలో ప్రస్తుతం వంతాలముసమ్మ, దండిరాజు, దండి ఉపేంద్ర, రోబ్బా గోసమ్మ, వంజుల బాపనమ్మ, సీకూరు శ్రీను, రొబ్బా మహేష్‌లతో పాటు పలువురు జ్వరాలతో బాధపడుతున్నారు. కేజేపురం పీెహ చ్‌సీ వైద్యులు గ్రామానికి వచ్చి సేవలు అందిస్తున్నప్పటికీ వ్యాధులు అదుపులోకి రావడం లేదు. ఇదే విషయాన్ని ఎస్‌పీహెచ్‌ఓ శ్రావణ్‌కుమార్ వద్ద ప్రస్తావించగా, గ్రామంలో జ్వరాల తీవ్రత వాస్తవమే అన్నారు. ఒకటి రెండు డెంగ్యూ పాజిటివ్ కేసులు వచ్చాయని, నాలుగు రోజులుగా ఇంటింటికి తిరిగి వైద్యం అందిస్తున్నామన్నారు. సోమవారం నుంచి గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామన్నారు.
గొందిమెలకలో జ్వరాలు
జి.మాడుగుల: మండలంలోని వంజరి పంచాయతీ గొందిమెలకలో రెండు రోజులుగా 10 మంది జ్వరాలతో బాధపడుతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ నాయకురాలు ఊర్మిళ తెలిపారు. గ్రామస్తులు రక్షిత తాగునీటి సదుపాయానికి నోచుకోలేదన్నారు. ఈ కారణంగానే వ్యాధులకు గురవుతున్నారని అభిప్రాయపడ్డారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేయాలని కోరారు.
జ్వరంతో మహిళ మృతి
అనంతగిరి : మండలంలోని పెదకోటలో కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఓ మహిళ ఆదివారం చనిపోయిందని సీపీఎం నాయకులు డి.గంగారాజు.జంగం పెంటన్నదొర, ఎన్.సింహచలం తెలిపారు. గ్రామానికి చెందిన తావు సన్యాసమ్మ (45) వారం రోజులుగా జ్వరం లక్షణాలతో మంచం పట్టింది. సమీపంలోని పినకోట పీహెచ్‌సీకి వెళితే వైద్యాధికారి అందుబాటులో లేకుండాపోయారని వారు ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో దేవరాపల్లి ఆస్పత్రికి తరలిస్తుండగా ఆదివారం చనిపోయిందన్నారు. సన్యాసమ్మ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్,ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకువెళుతున్నట్టు వారు తెలిపారు.