దిగ్విజయ్ సింగ్కు మతిభ్రమించింది: మైసూరా
తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేఖ ఇచ్చిందన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను ఆ పార్టీ బుధవారం ఖండించింది. బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి మాట్లాడుతూ... దిగ్విజయ్ సింగ్ మాటలు పూర్తిగా అసత్యమని ఆయన పేర్కొన్నారు. ఓ వేళ రాష్ట్ర విభజన జరిగితే ఇరు ప్రాంతాల్లోని అన్ని అంశాలను పరిగణలో తీసుకోవాలని, అలాగే అందరికి సమన్యాయం చేయాలని గతంలో దిగ్విజయ్ సింగ్ను కలసినప్పుడు సూచించామని ఆయన గుర్తు చేశారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజనపై ఓ తండ్రిలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని దిగ్విజయ్ సింగ్కు చెప్పామన్నారు. ఆల్పార్టీ మీటింగ్లో తాము చెప్పిన విషయాలను షిండే పక్కనపెట్టారని మైసూరారెడ్డి ఆరోపించారు. దిగ్విజయ్ సింగ్ మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఓ సీనియర్ రాజకీయ నాయకుడు ఈ విధంగా మాట్లాడటం దౌర్బాగ్యమని మైసూరారెడ్డి పేర్కొన్నారు.