ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ ఎ.రాజేశ్వరరావు బదిలీ అయ్యారు. మెదక్ జిల్లా విద్యాశాఖాధికారిగా ఆదివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాజేశ్వరరావును ఈ ఏడాది ఫిబ్రవరిలోనే బదిలీ చేశారు. అయితే అక్కడి డీఈవో ఎన్నికల విధుల్లో ఉండటంతో సార్వత్రిక ఎన్నికలు పూర్తయిన తరువాత బాధ్యతలు స్వీకరించాలని అక్కడి కలెక్టర్ రాజేశ్వరరావుకు సూచించారు. దీంతో ఆయన మూడు నెలలు జిల్లాలోనే పనిచేశారు. ఎన్నికలు ముగిసి ఫలితాలు కూడా వెలువడటంతో మెదక్ జిల్లా డీఈవోగా బాధ్యతలు స్వీకరించేందుకు అనుమతించాలని రాజేశ్వరరావు మెదక్ కలెక్టర్‌ను కోరారు. ఆయన ఆమోదంతో బాధ్యతలు స్వీకరించారు.
జిల్లా విద్యాశాఖాధికారిగా రాజేశ్వరరావు ఏడాదిపాటు పనిచేశారు. వివాదాలకు అతీతంగా..ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపారు.
ఒంగోలు ఆర్డీవో కార్యాలయ ఆవరణలో లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి నిరుపయోగంగా ఉన్న జవహర్ బాల భవన్‌ను వినియోగంలోకి తెచ్చారు. గతంలో ఎవరూ ఈ భవనం గురించి పట్టించుకోలేదు.
జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు (డీసీఈబీ) కార్యాలయానికి శాశ్వత భవన వసతి కల్పించడంలో చొరవ తీసుకున్నారు. స్థానిక బండ్లమిట్టలో ఖాళీగా ఉన్న మోడల్ స్కూల్ భవనాలను కలెక్టర్ ఆమోదంతో డీసీఈబీ కార్యాలయానికి అప్పగించారు. శనివారం ఈ భవనంలో కార్యాలయాన్ని ప్రారంభించారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు కూడా డీఈవో భవన వసతి కల్పించారు. ఇప్పటిదాకా డీఆర్‌ఆర్‌ఎం హైస్కూల్లో డీసీఈబీ కార్యాలయం నిర్వహించిన గదిని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్‌కు కేటాయించారు. దాన్ని కూడా శనివారమే ప్రారంభించారు.
జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో కూడా ఆయన చొరవ చూపారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుల పదోన్నతులు కూడా చేపట్టి ఆ ఖాళీలు భర్తీ చేశారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతుల విషయంలో కూడా ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ నిర్వహించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించారు.
పదో తరగతి పరీక్షల్లో ఒక శాతం ఉత్తీర్ణత పెంపుదలకు కృషి చేశారు.
జిల్లాలో డీఈవోగా పనిచేయడం తన అదృష్టమని ఈ సందర్భంగా రాజేశ్వరరావు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాను తన సొంత జిల్లాగానే భావించి పనిచేశానని తెలిపారు. డీఈవోగా పదవీ బాధ్యతల నిర్వహణలో తనకు సహకరించిన అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇన్‌చార్జి డీఈవోగా విజయభాస్కర్: డీఈవో రాజేశ్వరరావు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జి డీఈవోగా పర్చూరు ఉప విద్యాధికారి బి.విజయభాస్కర్ బాధ్యతలు స్వీకరించారు. పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కార్యాలయం నుంచి విజయభాస్కర్‌కు ఎఫ్‌ఏసీ (పూర్తి అదనపు ఉత్తర్వులు) రావాల్సి ఉంది.
డీఈవో బదిలీ
Published Mon, May 19 2014 2:06 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement