
సినిమాలపై ఆసక్తితోనే దర్శకుడినయ్యా..
సినిమాలపై ఉన్న ఆసక్తితోనే డిగ్రీ పూర్తికాగానే హైదరాబాద్‌కు చేరుకున్నా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రెండు భాషల్లో మూడు సినిమాలకు దర్శకత్వం వహించాను.
♦ కమర్షియల్ దర్శకుడిగా రాణించాలనుంది
♦ వర్ధమాన దర్శకుడు వైకుంఠలవ్య
రాయవరం (మండపేట) : సినిమాలపై ఉన్న ఆసక్తితోనే డిగ్రీ పూర్తికాగానే హైదరాబాద్‌కు చేరుకున్నా. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి దర్శకత్వ బాధ్యతలు చేపట్టి రెండు భాషల్లో మూడు సినిమాలకు దర్శకత్వం వహించాను. కమర్షియల్ దర్శకుడిగా రాణించడమే తన ధ్యేయమంటున్నారు శ్రీకాకుళంకు చెందిన వైకుంఠలవ్య. ప్రస్తుతం నూతనంగా నిర్మిస్తున్న సినిమాకు లొకేషన్స్ చూసేందుకు రాయవరం మండలం పసలపూడి వచ్చిన సందర్భంగా తను దర్శకుడిగా మారిన వైనాన్ని వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
పాతపట్నం నుంచి వచ్చా..
శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన నేను డిగ్రీ వరకు అక్కడే చదివాను. సినిమాలపై ఉన్న ఆసక్తితో 2000 సంవత్సరంలో హైదరాబాద్‌కు వెళ్లాను. కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టరుగా పని చేశాను. నిన్నేపెళ్లాడుతా, ప్రియరాగాలు, నిధి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించి దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్నాను. ధృవతారలు, కలిసిన మనసులు తదితర ఎనిమిది టీవీ సీరియల్స్‌కు దర్శకునిగా పని చేశాను.
మూడు చిత్రాలకు...
బాలాదిత్య హీరోగా తొలిసారి ‘జాజిమల్లి’ సినిమాకు దర్శకత్వం వహించాను. అలాగే కన్నడంలో ‘మొండ’ సినిమాతో పాటు తెలుగులో మూడో చిత్రంగా నందు, సిద్ద, శ్రీరాజ్ హీరోలుగా ‘3ఇడియట్స్’ సినిమాకు దర్శకత్వం వహించాను. ఈ సినిమాలో సుమన్, చంద్రమోహన్, కాశీవిశ్వనా«థ్ తదితరులు నటించారు. ఈ సినిమా తొలికాపీ వచ్చింది. త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము.
పరువు హత్యల నేపథ్యంలో..
పరువు హత్యల నేపథ్యంలో కోనసీమ బ్యాక్‌గ్రౌండ్‌లో కొత్త సినిమా రూపొందిస్తున్నాం. మాధవ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా పూర్తిగా నూతన నటీనటులతో జిల్లాలోనే పూర్తిగా చిత్రీకరిస్తున్నాం. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల 2,3 తేదీల్లో ప్రారంభిస్తాం. ఈ సినిమాకు నవనీత్‌చంద్ర మ్యూజిక్ డైరెక్టరుగా, సురేష్ గంగుల కెమెరామెన్‌గా, నిర్మాతగా సామర్లకోటకు చెందిన శ్రీనివాస్ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.