సాక్షి, రాజానగరం: ఓపెన్ బిల్ బర్డ్స్‌గా పిలిచే ఈ పక్షులు రాజమహేంద్రవరానికి అత్యంత చేరువలో ఉన్న పుణ్యక్షేత్రానికి ఏటా జూన్, జూలై మాసంలో (తొలకరి చినుకులు పడే సమయం) క్రమం తప్పకుండా సైబిరీయా నుంచి ఇక్కడకు వలస వస్తుంటాయి. వీటి ముక్కు మధ్యలో రంధ్రంగా ఉండటంతో స్థానికులు ‘చిల్లు ముక్కు కొంగ’లని కూడా పిలుస్తుంటారు. వందల కొలదిగా ఇక్కడకు వచ్చిన ఈ పక్షులు గ్రామంలోని ఊర చెరువు చుట్టూ ఉన్న కంచి చెట్లపై గూళ్లు ఏర్పాటుచేసుకుని గుడ్లు పొదుగుతాయి. వాటి నుంచి పిల్లలు బయలు దేరిన తరువాత డిసెంబర్, జనవరి మాసంలో (మాఘమాసంలో) ఆ పిల్ల పక్షులతో కలసి వేల కొలదిగా ఇక్కడ నుంచి తిరిగి పయనమవుతాయి. మళ్లీ జూన్, జూలై మాసం వచ్చే వరకు వీటి జాడ ఎవరికీ తెలియదు.
పక్షుల జాడ లేక బోసిపోయిన ఊర చెరువు
ఏమైందో ఏమో..
కాని ఈసారి ఏమైందో ఏమోగాని ఒక్కసారిగా మాయమైపోయి. గ్రామంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలకు సమీపంలోని ఊర చెరువు చుట్టూ ఉన్న కంచివిత్తనం చెట్లపై ఉండే ఈ పక్షులు తిరుగు ప్రయాణానికి ఇంకా సమయం ఉండగా రెండు నెలలు ముందే ఒక్కసారిగా గ్రామాన్ని వదిలిపోవడం గ్రామస్తులను కూడా విస్మయానికి గురిచేస్తోంది. వీటి రాకతో తొలకరి పనులు ప్రారంభించే ఈ ప్రాంత రైతులు పక్షులు హఠాత్తుగా మాయం కావడంతో ఇది శుభకరం కాదంటూ సెంటిమెంటుగా ఫీలవులున్నారు. కొందరైతే ఇవి మాయమైన నెల రోజుల నుంచి మాకు ఆరోగ్యాలు కూడా బాగుండడం లేదంటున్నారు. ఎందుకంటే వీటిని పురుడు పోసుకునేందుకు తమ ఇంటికి వచ్చిన ఆడపడుచుల్లా భావిస్తారు. తమ తాతముత్తాల కాలం నాటి నుంచి ఈ విధంగా క్రమం తప్పకుండా వలస వచ్చే ఈ విదేశీ విహంగాలపై ఆ గ్రామస్తులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు హద్దులు ఉండవు.
ఆకాశంలో విహరిస్తున్న పక్షి (ఫైల్)
వీటిని విదేశీ పక్షులంటే పుణ్యక్షేత్రం వాసులు అసలు అంగీకరించరు. ఎందుకంటే అవి పుట్టింది ఇక్కడేనంటారు. ఈ సమయంలో ఇక్కడకు వచ్చి సంతానోత్పత్తిని చేసుకుని తిరిగి వెళ్తున్నాయి కాబట్టి విదేశీ పక్షులనడం సరికాదంటారు. అందుకనే వాటిని పురిటికి పుట్టింటికి వచ్చే ఆడపడచుల్లా భావించి, ఆదరిస్తారు. నెత్తిమీద రెట్ట వేసినా, చంకన ఉన్న పసివాడు దుస్తుల్ని ఖరాబు చేసిన మాదిరిగా వాటిని కూడా చూస్తారేగాని చీదరించుకోరు. గూళ్లకు చేరుకునే సమయంలో ఆ పక్షులు పెట్టే కీచుకీచు ధ్వనులను కూడా పిల్లల సందడిగానే భావిస్తారుగాని ‘ఇదేం గోలరా బాబూ’ అని ఈసడించుకోరు. గూళ్ల నుంచి పక్షి పిల్లలు జారి పడితే వాటిని జాగ్రత్తగా తిరిగి ఆ గూళ్లలోనే చేరవేస్తారు. అసలు తమ గ్రామానికి ‘పుణ్యక్షేత్రం’ అనే పేరు కూడా వీటిరాక కారణంగానే వచ్చిందేమోననే అనుభూతిని వ్యక్తం చేస్తూ, వాటి ఉనికిని శుభకరంగా భావిస్తుంటారు.
మృత్యు పాశాలవుతున్న విద్యుత్ తీగలు
పుణ్యక్షేత్రం వాసులు తమ ఆడపడుచుల్లా చూసుకునే ఈ సైబీరియన్ పక్షులు మాయమవడానికి ఊరచెరువు పై నుంచి వెళ్లిన హైటెన్షన్ విద్యుత్ తీగలు కారణమని కొంతమంది అంటుంటే, కాదు ఈ మధ్య భారీగా బాణసంచా కాల్చడంతోనే భయపడి వెళ్లిపోయాయని మరికొందరంటున్నారు. ఏది ఏమైనా అవి స్వేచ్ఛగా విహరించేందుకు అనువైన వాతావరణం ఇక్కడ క్రమేణా కనుమరుగైపోతోందనేది వాస్తవం. ఎందుకంటే అవి విహరించే ఊర చెరువు చుట్టూ కంచి చెట్లు ఉన్నాగాని వాటి పై నుంచి వెళ్లిన హైటెన్షన్ విద్యుత్ తీగలు వాటి పాలిట మృత్యు గీతాలను ఆలపిస్తున్నాయి.
వాటి పాలిట మృత్యపాశాలైన హైటెన్షన్ విద్యుత్ తీగలు
పక్షులు గాలిలోకి ఎగిరే సమయంలో ఆ తీగలకు తగులుకొని చాలావరకు చనిపోతున్నాయి. చెరువు పై నుండి హైటెన్షన్ వైర్లను వేయవద్దని స్థానికులు అడ్డుపెట్టిన విద్యుత్ అధికారులు వినలేదు. ఏటా వచ్చే ఈ విదేశీ విహంగాలకు ఈ విద్యుత్ తీగలు మృత్యు ద్వారాలవుతున్నాయి. భవిష్యత్తులోనైనా ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపి ఈ పక్షుల మనుగడకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
జిల్లాలో సైబీరియన్ పక్షుల రాకతో విశిష్టతను సంతరించుకున్న పుణ్యక్షేత్రంలో నేడు వాటి జాడ కానరావడం లేదు. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా తొలకరి జల్లులు కురిసే సమయంలో ఇక్కడకు వచ్చిన విదేశీ విహంగాలు మూడు నెలలు కూడా తిరక్కుండానే ఒక్కసారిగా ఎటో ఎగిరిపోయాయి. సాధారణంగా ఏటా కార్తికమాసం వెళ్లిన తరువాత సంతానోత్పత్తితో రెట్టింపు సంఖ్యలో స్వస్థలాలకు వెళ్లే ఈ పక్షులు, ఏమైందో ఏమోగాని అకస్మాత్తుగా మాయమయ్యాయి. ఈ విధంగా పక్షులు దూరం కావడంతో ఆరోజ నుంచి తమకు ఆరోగ్యపరంగా కూడా సమస్యలు వస్తున్నాయని కొంతమంది గ్రామస్తులు సెంటిమెంటుగా అంటున్నారు.
అటవీ శాఖ పట్టించుకోవడం లేదు
అటవీ శాఖ మాత్రం తమకేమీ సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది. విదేశీ విహాంగాల కోసం ఒక బోర్డును ఏర్పాటుచేసి, అంతటితో తమ పని అయిపోయినట్టుగా ఆ శాఖ అధికారులు ఉన్నారు. రక్షణ లేని స్థితిలో పక్షులు కూడా ఇక్కడ ఇమడలేకపోతున్నాయి. అందుకనే అకస్మాత్తుగా వెళ్లిపోయాయి.
– పేపకాయల ఈశ్వరరావు
బాణసంచా కాల్పులే కారణం
గ్రామంలో ఒక సందర్భంలో భాగంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఆ కాల్పులకు బెదిరిపోయిన పక్షులు ఇక తిరిగి రాలేదు. గతంలో కూడా ఈ విధంగా ఒకసారి జరిగింది. మళ్లీ వచ్చే ఏడాది వరకు వాటి జాడ కనపడదు. – కర్రి వీరబాబు
కరెంటు తీగలకు చనిపోతున్నాయి
కరెంటు తీగల వల్ల వెళ్లిపోయాయి అనుకుంటున్నాం. పైకి ఎగిరేటప్పుడు కొన్ని చనిపోతున్నాయి. ఈ తీగలను మార్చమని ఎన్నిమార్లు చెప్పినా ఎవరు వినవడం లేదు. – ఈలి శ్రీను
అపురూపంగా చూసుకున్నాం
ఈ పక్షుల్ని మా ఊర్లో ఎవరినీ కొట్టనివ్వరు, ఎంతో అపురూపంగా చూసుకుంటాం, అయితే ఇప్పుడు ఉన్నఫలంగా ఎందుకు వెళ్లిపోయాయో తెలీడం లేదు.
– నరాల రాము
Comments
Please login to add a commentAdd a comment