సాక్షి, విశాఖపట్నం, అమరావతి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం క్రమేణా బలపడుతోంది. దీని ప్రభావంతో దక్షిణ అండమాన్ తీర ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 30 నాటికి అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. వచ్చే 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం ప్రకటించింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి, ఉత్తర ఈశాన్య దిశగా అండమాన్ నికోబార్ దీవుల వెంబడి మే 3 వరకూ పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు తెలిపారు.
విస్తారంగా వర్షాలు
ఉపరితల ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. సత్యవేడులో 13 సెం.మీ, అనకాపల్లిలో 11 సెం. మీ,, ప్రత్తిపాడులో 10 సెం.మీ., తడలో 9సెం.మీ., విశాఖలో 8సెం.మీ, ఎస్.కోటలో 8సెం.మీ., గంట్యాడలో 7సెం.మీ, నగరి, కుప్పంలో 3సెం.మీ. వర్షపాతం నమోదైంది.
పిడుగులు పడే ప్రమాదం
రాబోయే నాలుగైదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. వ్యవసాయ పనులు చేసే వారు, గొర్రెలు, మేకల కాపరులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఉరుములతో వర్షం కురిసే సమ యంలో చెట్ల కిందకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ స్పెషల్ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. పిడుగులు పడే ప్రాంతాల సమాచారాన్ని రెండుమూడు గంటల ముందే గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తామని, ప్రజలు అధికారుల సూచ నలను పాటించాలని పేర్కొన్నారు.
నేడు, రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు
మరోవైపు, విదర్భ నుంచి తమిళనాడు వరకూ కర్ణాటక మీదుగా 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొన సాగుతుండడంతో నేడు, రేపు కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు, ఒక ట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాయలసీమలో నేడు, రేపు ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రాయలసీమలో నేడు, రేపు గరిష్టంగా పలు చోట్ల 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment