సాక్షి, సంగారెడ్డి: ఉపాధి కల్పన శాఖపై నిరుద్యోగుల్లో నమ్మకం సడలింది. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకుని ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి ప్రయోజనం ఒనగూరకపోవడంతో అభ్యర్థుల్లో నిరుత్సాహం నెలకొంది. కొత్త రిజిస్ట్రేషన్ల సంఖ్య పడిపోగా.. పాత రిజిస్ట్రేషన్లు సైతం పునరుద్ధరణకు నోచుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు అటకెక్కాయి. ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలూ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. అధికారులు ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలకు వెళ్తే ప్రైవేటు కంపెనీలు అందించే ఉద్యోగావకాశాలు, వేతనాలు నిరుద్యోగులను ఏ మాత్రం సంతృప్తిని కలిగించలేకపోతున్నాయి. మార్కెట్లలో అమ్ముడుపోని ఉత్పత్తులను ఇంటింటికి తిరిగి విక్రయించే సేల్స్‌మేన్‌తో పాటు వాచ్‌మెన్, సెక్యూరిటీ గార్డులాంటి ఉద్యోగాలు తప్ప ఇతర అవకాశాలు ఉండడం లేదు.
దిగువ స్థాయి ప్రభుత్వ ఉద్యోగానికి సైతం వేల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్న నిరుద్యోగులు.. అదే ఎంప్లాయిమెంట్ నమోదు విషయానికి వస్తే ఆశలు వదులుకుంటున్నారు. గతంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఫలితాలొచ్చి పట్టాలు చేతికందిన వెంటనే ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ కోసం క్యూ కట్టేవారు. రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరిగేవి. ప్రస్తుతం మారిన పరిస్థితుల వల్ల పదుల సంఖ్యకు రిజిస్ట్రేషన్లు పడిపోయాయి. గతంలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవాళ్లు ప్రతి మూడేళ్లకోసారి పునరుద్ధరించుకోవాల్సి ఉండగా.. మిన్నకుండిపోతున్నారు. గడువులోగా పునరుద్ధరించుకోవడంలో విఫలమైనవారికి మరో ఆరు నెలల సమయాన్ని గ్రేస్ పీరియడ్‌గా అవకాశమిస్తున్నా స్పందన ఉండడం లేదు. నిరుద్యోగ అభ్యర్థులు మొఖం చాటేస్తుండడంతో ఉపాధి కల్పన శాఖ కార్యాలయం వెలవెలబోతోంది. పునరుద్ధరణ కాక పాత రిజిస్ట్రేషన్లు క్రమంగా ల్యాప్స్ అవుతుండగా.. మరోవైపు కొత్త రిజిస్ట్రేషన్లు సైతం తగ్గిపోవడం వల్ల లైవ్ రిజిస్ట్రేషన్ల సంఖ్య లక్షల నుంచి వేలల్లో పడిపోయింది. పలు రకాల విద్యార్హతలో జిల్లాలో రిజిస్టరై ‘మిగిలి ఉన్న’ వారి సంఖ్య ప్రస్తుతం 73,033కు తగ్గిపోయింది.
వివిధ విద్యార్హతలతో రిజిస్టరై ఉన్న వారి వివరాలు...
- 9వ తరగతి విద్యార్హతతో 3,218 మంది
- పదో తరగతి విద్యార్హతతో 39,760 మంది
- ఇంటర్ విద్యార్హతతో 19,988 మంది
- డిగ్రీ విద్యార్హతతో 10,045 మంది
- పీజీ విద్యార్హతతో 5 మంది
- ఎంఫిల్ విద్యార్హతతో 16 మంది
- ఎండీ/డీ.ఎస్‌సీ(మెడిసిన్) విద్యార్హతతో ఒకరు.