కారుచీకట్లో కాంతిరేఖ
సంగారెడ్డి మున్సిపాలిటీ: దశాబ్ధకాలంగా సాగిన మలివిడత తెలంగాణ ఉద్యమం..చుక్కానిలా మారి ఉద్యమానికే ఊపిరిపోసిన యువత. ఆత్మబలిదానాలు...ఢిల్లీ వీధుల్లో తెలంగాణ పొలికేకలు. ఆరు దశాబ్ధాల స్వప్నం సాకారమయ్యేందుకు, ఆరున్నర కోట్ల ప్రజల గొంతుక గా మారిన కాలేజీ పోరగాళ్లు.
రాష్ట్రం సాకారమై సొంత రాష్ట్రం..సొంత పాలనలో జనం మోముల్లో సంతోషం కనిపిస్తుంటే..ఇన్నాళ్లూ జనానికి ధైర్యం నూరిపోసి ఒక్కటి చేసిన యువత జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి. సర్కారీ కొలువు పొందే వయసు మీరిపోవడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో నిరుద్యోగులంతా కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న సుమారు లక్షా 23 వేల మంది ఇక తమకు ఉద్యోగాలు రావనే భావనతో ఉన్నారు.
అంతా కాంట్రాక్ట్...ఔట్ సోర్సింగ్
1994లో అధికారంలోకి వచ్చిన టీడీపీ వివిధ శాఖల్లో ఖాళీగా పోస్టులను భర్తీ చేయకుండా ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో నియామకాలు చేసింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పలు శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను భ ర్తీ చేశారు.
అయితే 2009లో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణానంతరం వచ్చిన పాలకులు ఉద్యోగాల భర్తీని పూర్తిగా పక్కనపెట్టేశారు. వైఎస్సార్ తర్వాత సీఎం అయిన రోశయ్య, ఆ తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డిలు టీడీపీ హయంలో జరిపిన మాదిరిగానే కాంట్రాక్టు నియమకాలకే మొగ్గు చూపారు. దీంతో సర్కారీ కొలువు అందని ద్రాక్షగా మారింది.
పెరిగిన నిరుద్యోగుల సంఖ్య
జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలోనిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటి వరకు వివిధ కేటగిరీల్లో 72 వేల 85 మంది నిరుద్యోగులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో డిగ్రీతో పాటు ఇంటర్, సాంకేతిక విద్య సైతం పూర్తి చేసిన వారు ఉన్నారు. కానీ ఇంతవరకు వీరికి ఎంప్లాయిమెంట్ ఆఫీస్ నుంచి ఒక్క కాల్ లెటర్ కూడా అందలేకపోయింది. దీంతో ప్రస్తుతం చదువులు పూర్తి చేసుకున్న యువత ఎంప్లాయిమెంట్‌లో తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అసక్తి చూపడం లేదు.
కొత్త సర్కారూ...కొంత తాత్సారం
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఆరు మాసాలకు దగ్గరపడుతున్నా, ఇంత వరకు ఎలాంటి ప్రభుత్వ నియమకాలు చేయలేకపోతున్నారు. కనీసం డీఎస్సీ ద్వారా అయినా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినా, కొంత వరకు నిరుద్యోగుల సమస్య తీరేది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం, ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేకపోతోంది. ఉన్న వారిని రెగ్యులరైజ్ చేయకపోవడం, కొత్త నియామకాలు లేకపోవడంతో వివిధ శాఖలలో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది అయోమయానికి గురవుతున్నారు.
5 ఏళ్ల సడలింపుతో అనందోత్సవాలు
సర్కారీ కొలువులకు ఇపుడున్న వయోపరిమితిని మరో 5 ఏళ్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జిల్లాలోని నిరుద్యోగ యువకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాలను పక్కన పెట్టేసిన వారు కూడా మళ్లీ వాటిని ముందేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో డీఎస్సీతో పాటు మరిన్ని నోటిఫికేషన్లు విడుదలవుతాయన్న వార్తల నేపథ్యంలో అందరూ ఇపుడు కోచింగ్‌లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తమ బాధలు తెలిసి వయోపరిమితి పెంచిన సీఎంకు, తెలంగాణ సర్కార్‌కు వారు కృతజ్ఞతలు చెబుతున్నారు.