సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ప్రభుత్వ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపు బాధ్యత గతంలో ఐకేపీ ఆధ్వర్యంలోని జిల్లా సమాఖ్య నిర్వహించేది. 2008 మార్చి నుంచి 2013 మార్చి వరకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జిల్లా సమాఖ్య వేతనాలు చెల్లిస్తూ వచ్చింది. ప్రతిఫలంగా ఒక్కో ఉద్యోగి వేతనం నుంచి నాలుగు శాతం మొత్తం కమీషన్ రూపంలో జిల్లా సమాఖ్య ఖాతాకు ఆయా ప్రభుత్వ శాఖలు చెల్లించేవి. జిల్లా సమాఖ్య నివేదిక ప్రకారం ఒక్క 2012- 13 ఆర్థిక సంవత్సరంలోనే 44 ప్రభుత్వ శాఖల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.4.95 కోట్లు వేతనంగా చెల్లించారు. కేవలం 2013 మార్చి నెలను పరిగణలోకి తీసుకుంటే
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపు ద్వారా జిల్లా సమాఖ్యకు రూ.2.27 లక్షలు కమీషన్ లభించింది.
అయితే జిల్లా సమాఖ్య ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ బాధ్యతలు నిర్వహించరాదనే ఉత్తర్వులను కొందరు అక్రమార్కులు ఆసరాగా తీసుకున్నారు. జిల్లా సమాఖ్యను ఔట్ సోర్సింగ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ అధికారుల అండతో కొత్త ఎత్తు వేశారు. జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా నాలుగు ఏజెన్సీలతో కూడిన ఎంప్యానెల్ జాబితా తయారు చేసి ఆమోద ముద్ర వేయించుకున్నారు. నిబంధనల మేరకు సదరు ఏజెన్సీలకు లేబర్ కాంట్రాక్టు లెసైన్సు, ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ లెసైన్సు సక్రమంగా ఉందని విచారణ నివేదిక సిద్ధం చేశారు. ఈ నాలుగు ఏజెన్సీలకు 46 ప్రభుత్వ విభాగాల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వాటాలుగా పంపిణీ చేశారు. అయితే ఏ ప్రభుత్వ విభాగంతో ఏయే ఏజెన్సీలు ఒప్పందం కుదుర్చుకున్నాయనే వివరాలు మాత్రం జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం వెల్లడించడం లేదు. ఒక్కో ఏజెన్సీ పరిధిలో ఎన్ని ప్రభుత్వ శాఖలు, ఎందరు ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారో సదరు ఏజెన్సీలనే అడగండంటూ ఉచిత సలహా ఇస్తోంది.
గుట్టు చప్పుడు కాకుండా!
ఎంప్యానెల్ జాబితా తయారీలో అధికారులు అత్యంత గోప్యత పాటించినట్లు స్పష్టమవుతోంది. అర్హులైన ఏజెన్సీలను గుర్తించేందుకు జిల్లా ఉపాధి కార్యాలయం కనీసం పత్రిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. ఏజెన్సీల ఎంపికకు అనుసరించిన ప్రాతిపదిక ఏమిటనే అంశంపైనా ఉపాధి కార్యాలయ అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదు. 46 ప్రభుత్వ శాఖల పరిధిలో సుమారు 1200కు పైగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆయా ప్రభుత్వ శాఖలతో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు కుదుర్చుకున్న ఒప్పందం వివరాలపై కూడా అధికారులు గోప్యత పాటిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపులోనూ పారదర్శకత లోపించినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. అడ్డదారిలో కాంట్రాక్టు దక్కించుకున్న ఏజెన్సీలు కేవలం వేతనం చెల్లింపు ద్వారా వచ్చే కమీషన్‌తో సరిపెట్టుకోవడం లేదు. ఉద్యోగుల వేతనాల్లోనూ అడ్డగోలుగా కోతలు విధిస్తూ లక్షలాది రూపాయలు జేబులో వేసుకుంటున్నాయి. ఎంప్యానెల్ జాబితాలోని ఏజెన్సీల ఎంపిక వ్యవహారంపై దృష్టి సారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశముంది.
అక్రమాల ‘సోర్సింగ్’
Published Tue, Nov 19 2013 1:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement
Advertisement