తలకు మించిన భారం.. | Disproportionate burden on the head .. | Sakshi
Sakshi News home page

తలకు మించిన భారం..

Published Sat, Dec 28 2013 4:05 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

Disproportionate burden on the head ..

నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్:  జిల్లాలో రోజురోజుకూ రెవెన్యూ సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని పరిష్కరించడం రెవెన్యూ సిబ్బందికి తలకు మించిన భారమవుతోంది. మరోవైపు పేదల సమస్యలు పరిష్కరించడంలో క్షేత్రస్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్తువెత్తుతున్నాయి.  రెవెన్యూ చట్టంపై సిబ్బందికి అవగాహన కొరవడటంతో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని పలువురు అంటున్నారు. బ్రిటిష్‌కాలం నాటి క్యాడర్ నేటికీ అమలవుతోంది. జనాభా ఐదింతలు పెరిగింది.
 
 భూమి విలువ పదింతలు పెరిగింది. అయినా క్యాడర్ (అధికార స్థాయీ సంఖ్య) నియామకంలో ఎలాంటి మార్పులేదు. కేవలం కారుణ్య నియామకాలే తప్ప ఖాళీల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించలేదు. దీనికితోడు రెవెన్యూశాఖకు అదనపు విధులు తప్పడం లేదు. ఎన్నికలు, ప్రొటోకాల్, ప్రకృతి వైపరీత్యాలు, ఇసుక, మైనింగ్‌తో పాటు వివిధ శాఖలతో అనుసంధానమై విధులు నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సమస్యలను పక్కన పెట్టి ఇతర వాటికి అధిక సమయం కేటాయిస్తున్నారు.
 
 ఇలాగైతే పరిష్కారం ఎలా?
 సోమవారం గ్రీవెన్స్, మంగళవారం డివిజనల్ స్థాయి రెవెన్యూ అధికారుల సమావేశాలు, గురువారం కౌలురైతులకు రుణాలు, శనివారం కోర్టు కేసులు, మిగిలిన రోజుల్లో వీడియో కాన్ఫరెన్స్‌లు ఉంటున్నాయి. వీటికే సమయం సరిపోతోందని రెవెన్యూ సిబ్బంది అంటున్నారు. దీంతో రెవెన్యూ సమస్యలు పేరుకుపోతున్నాయి. ఫలితంగా పేదల సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. వీటికి పరిష్కారం ప్రశ్నార్థకమైంది.
 
 తహశీల్దార్లకు డిజిటల్ సంతకాలపై అవగాహన లేమి
 పలువురు తహశీల్దార్లకు డిజిటల్ సంతకాలపై అవగాహన లేదు.  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కుల, నివాస, కుటుంబ, ఆదాయ, అడంగళ్, పట్టాదారు పాసుపుస్తకాలను డిజిటల్ సంతకాలతో నిత్యం జారీ చేయాల్సి ఉంది. డిజిటల్ ఆపరేటింగ్‌పై పలువురు తహశీల్దార్లకు అవగాహన లేకపోవడంతో కంప్యూటర్ ఆపరేటర్లపై ఆధారపడుతున్నారు. ఆపరేటర్లతో డిజిటల్ సంతకాలు చేయిస్తే ఐటీ చట్టం కింద ఆయా తహశీల్దార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్పష్టమైన ఆదేశాలున్నాయి. ఇటీవల కొందరు అవగాహన లోపంతో కంప్యూటర్ ఆపరేటర్లతో డిజిటల్ సంతకాలు చేయించడంతో వారిపై డిసిప్లనరీ యాక్షన్ తీసుకున్నట్టు తెలిసింది.
 
 సస్పెండ్ అయిన వారి పరిస్థితి
 అగమ్యగోచరం
 వివిధ కారణాల వల్ల ఐదుగురు వీఆర్‌ఓలు సస్పెండ్ అయ్యారు. వీరిలో జి.వేణుగోపాల్‌రెడ్డి(దేవరపాళెం), ఎస్.సుధీర్‌బాబు (వెంకటగిరి), కె.రఘునందన్‌రెడ్డి (తలమంచి), దాసరి రామమోహన్ (గిద్దలూరు), కె.గురుమూర్తి (సోమసానిగుంట) ఉన్నారు.
 
 40 ఏళ్లకే గుండెపోటు
 తమకు పనిభారం పెరగడం వల్ల 40 సంవత్సరాలకే గుండెపోటుకు గురవుతున్నట్టు పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. ఇటీవల పలువురు ఉద్యోగులు గుండెపోటుకు గురై సెలవులో ఉన్నారు. ఇతర శాఖలకు సంబంధించిన పనులు తమకు బదలాయించడంపై రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 ఆన్‌లైన్ ద్వారా పరిష్కారం
 రెవెన్యూ సమస్యలను ఆన్‌లైన్‌లో పెట్టనున్నారు. సమస్యలను త్వరతిగతిన పరిష్కరించేందకు నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయాలకు వచ్చిన అర్జీలను కంప్యూటరీకరిస్తారు. అర్జీల వివరాలను కలెక్టర్, జేసీ లాగిన్‌లో పొందుపరుస్తారు. వీటిపై వారు ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్దేశిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా రెవెన్యూ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement