-
రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకే సెలవులు
-
ఉన్నతాధికారుల సహకారం శూన్యం
రెవెన్యూ శాఖలో ఉద్యోగుల సెలవుల పర్వం కొనసాగుతోంది. అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే తహసీల్దార్లు ఒకరి తరువాత ఒకరు సెలవు పెడుతున్నారు. భూములకు పట్టాల పంపిణీ, పథకాల అమలులో తాము చెప్పిన వారికే మంజూరు చేయాలని ఒత్తిళ్లు చేయడంతో ఏమీ చేయలేని స్థితిలో అధికారులు సెలవులపై వెళుతున్నట్లు సమాచారం.
నెల్లూరు(పొగతోట):
భూముల విషయాల్లో పొరపాట్లు చేస్తే సరెండర్ లేదా సస్పెండ్ చేస్తామని జిల్లా అధికారులు హెచ్చరించారు. దీంతో ఉన్నతాధికారుల సహకారం లేకపోవడంతో పొరపాట్లు చేసి సస్పెండ్ అయ్యే బదులు సెలవులపై వెళ్లడమే సరైన మార్గమని అదేబాటలో తహసీల్దార్లు పయనిస్తున్నారు. ఏఎస్‌పేట, బుచ్చిరెడ్డిపాళెం, నాయుడుపేట, ఓజిలి, జలదంకి టీపీగూడూరు మండలాల తహసీల్దార్లు సెలవులపై వెళ్లారు. నెల్లూరు, చిల్లకూరు తహసీల్దార్లు సెలవులపై వెళ్లి ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నారు.
సెలవు పెట్టే దిశలో మరికొంత మంది..
ముత్తుకూరు తహసీల్దార్‌తోపాటు మరికొంత మంది సెలవుపై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. జిల్లాలో 46 మండలాల్లో 46 మంది తహసీల్దార్లు ఉన్నారు. 16 అదనపు తహసీల్దార్ల పోస్టులున్నాయి. మండల స్థాయిలో భూ సమస్యలు, భూముల కేటాయింపు, వాటి పరిరక్షణ, పాసుపుస్తకాల పంపిణీ తదితర విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన భూములు అధికంగా ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటు చేసేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. దీంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములు, డాట్ భూములకు పట్టాలు సృష్టించాలని అధికారపార్టీ నాయకులు ఒత్తిళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ముందుకు పోతే నుయ్యి వెనుకపోతే గొయ్యి అనే చందంగా మారింది తహసీల్దార్ల పరిస్థితి. అధికారపార్టీ నాయకులు చెప్పినట్లు చేస్తే జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటారు. నాయకులు చెప్పింది చేయకపోతే బదిలీ చేయిస్తామనే బెదిరింపులు వస్తున్నాయి. తహసీల్దార్లు మండలాల్లో బాధ్యతలు స్వీకరించాలన్నా ఆ మండల అధికారపార్టీ నాయకులు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి అధికంగా ఉందని, పెరిగిన జనాభాకు అనుగుణంగా సిబ్బందిని పెంచలేదనే విమర్శలున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, సర్వేలు, పథకాల అమలు తదితర బాధ్యతల్లో జిల్లా యంత్రాంగం నుంచి తహసీల్దార్లకు సహకారం లేకపోవడంతో సెలవుపై వెళుతున్నట్లు తెలిసింది.
త్వరలో తహసీల్దార్ పోస్టుల భర్తీ -ఆర్.ముత్యాలరాజు, కలెక్టర్
జిల్లాలో పలువురు తహసీల్దార్లు వారి కుటుంబ సభ్యులకు అనారోగ్యంగా ఉందని సెలవుపై వెళుతున్నారు. ప్రభుత్వం త్వరలో డీపీసీ నిర్వహిస్తుంది. డీపీసీ నిర్వహిస్తే పదోన్నతలు లభిస్తాయి. ఖాళీగా ఉన్న తహసీల్దార్ పోస్టులు పదోన్నతులపై వచ్చే వారితో త్వరలో భర్తీ చేస్తాం.