విజయనగరం ఆయోధ్యా మైదానం సభలో ప్రసంగిస్తున్న పవన్‌కళ్యాణ్
విజయనగరం మున్సిపాలిటీ/డెంకాడ: జనసేన, మిత్రపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఎన్ని కల ప్రచారం జావగారిపోయింది. విజయనగరం పట్టణంలోని అయోధ్యమైదానంలోనూ, డెంకాడ మండలంలోని నాతవలస–సింగవరం మధ్యలో శుక్రవారం సభల్లో పవన్ పాల్గొన్నారు. పక్కపక్కనే ఉన్న ప్రాంతాల్లో పవన్ రెండు సభలు నిర్వహించడానికి ఆ పార్టీలో ఉన్న గ్రూపు తగాదాలే కారణమయ్యాయి. ఉదయం పదిగంటలకు విజయనగరం పట్టణంలో సభకు వస్తారని జనసేన పార్టీ ప్రకటించింది.
మధ్యాహ్నం వంటిగంటకు గానీ పవన్ రాలేదు. అప్పటి వరకూ ఆయన కోసం వచ్చిన కొద్దిపాటి అభిమానులు కూడా ఎండను తట్టుకోలేక విలవిల్లాడిపోయారు. వేదికపైకి వస్తుండగా ఓ అభిమాని పవన్ రెండు కాళ్లూ గట్టిగా పట్టుకోవడంతో ఆయన కిందపడిపోయారు. అతనిని పవన్ భద్రతా సిబ్బంది పక్కకు తీసుకువెళ్లి దేహశుద్ధి చేశారు. అనంతరం ప్రసంగించిన పవన్ తన ప్రసంగాన్ని ఎక్కడ మొదలుపెట్టారో, ఎక్కడ ముగించారో ఎవరికీ అర్ధం కాలేదు. టీడీపీని విమర్శించడానికి అన్యమనస్కంగా ఉన్నట్టు ప్రసంగంలో కనిపించింది.
పవన్ వల్ల తమకు కొన్ని ఓట్లు అయినా పడతాయని ఆశపడిన ఆ పార్టీ అభ్యర్థులు పవన్ ప్రసంగంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. విజయనగరం, నెల్లిమర్ల అభ్యర్థుల మధ్య సయోధ్య లేకపోవడం కారణంగానే రెండు చోట్లా పవన్ సభలు పెట్టాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పవన్ రాకకు ముందు జనసేన, మిత్ర పక్షాల నేతలు ప్రసంగించారు. పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నవారు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment