* అన్నదమ్ముల్లా కలిసున్న తెలుగువారు తన్నుకునే దుస్థితి వస్తుంది: విజయమ్మ
* కృష్ణా ఆయకట్టును ఒకవైపు ఉంచండి.. లేదా రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలి: విజయమ్మ
* కృష్ణా ఆయకట్టును మొత్తం ఒకవైపు ఉంచండి.. లేదా రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించండి
* సమైక్యంగా ఉన్నప్పుడే ఎగువ రాష్ట్రాల నుంచి నీటిని విడుదల చేయించలేకపోతున్నారు
* మధ్యలో మరో రాష్ట్రం వస్తే.. దిగువ రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఏమిటి?
* శ్రీశైలానికి, సాగర్‌కు నీళ్లెక్కడి నుంచి తెస్తారు?
* పోలవరం అంతర్రాష్ట్ర జలవివాదంగా మారితే.. దాని పరిస్థితేంటి?
* ఐదో రోజుకు చేరిన ఆమరణ దీక్ష
సాక్షి, గుంటూరు: ‘‘రాష్ట్రాన్ని విభజిస్తే నీటి కోసం భవిష్యత్తులో యుద్ధాలు జరుగుతాయి. అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తెలుగు జాతి వారు తన్నుకునే పరిస్థితి వస్తుంది. సీమాంధ్ర మొత్తం ఎడారిగా మారుతుంది. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఉప్పు నీరే దిక్కవుతుంది. ఆ దుస్థితి రానీయకండి. కృష్ణా ఆయకట్టును మొత్తం ఓ వైపు ఉంచండి.. లేదా రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించండి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గుంటూరులో విజయమ్మ కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్ష గురువారం నాలుగో రోజుకు చేరింది. ఉదయం దీక్షా వేదిక వద్ద విజయమ్మ కొద్ది సేపు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయమ్మ కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించారు.
ఇప్పుడే నీటిని విడుదల చేయించలేకపోతున్నారు..
‘‘రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఎగువ రాష్ట్రాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్‌ల నుంచి రాష్ట్రానికి నీటిని విడుదల చేయించలేకపోతున్నారు. దీంతో ఇప్పటికే కృష్ణా ఆయకట్టుపై ఆధారపడ్డ రైతాంగం అష్టకష్టాలూ పడుతోంది. ఇప్పుడు మధ్యలో మరో రాష్ట్రం ఏర్పాటు చేస్తే.. దిగువ రాష్ట్రంలోని రైతాంగం పరిస్థితి ఏమిటి? శ్రీశైలానికి, నాగార్జున సాగర్‌కు నీళ్ళెక్కడి నుంచి వస్తాయి?’’ అని విజయమ్మ ప్రశ్నించారు.
‘‘నికర జలాలపై నీటి విడుదల ఉన్న జూరాల, నాగార్జున సాగర్, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ కూడా రాష్ట్రం విడిపోతే అంతర్రాష్ట్ర ప్రాజెక్టులుగా మారి కేంద్రం చేతుల్లోకి పోతాయి. ఒక్కసారి అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటయ్యాక.. మిగులు నీరు మీద ఆధారపడ్డ ప్రాజెక్టులకు అటు రాయలసీమలోగానీ, ఇటు మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకుగాని, అటు ప్రకాశం జిల్లాకుగానీ చుక్క నీరు ఉపయోగించుకునే అవకాశం ఉండదు’’ అని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇరు ప్రాంతాలకూ న్యాయం చేయలేనప్పుడు విభజించడమే తప్పు అని అన్నారు. విభజిస్తే ఒక్క కృష్ణా ఆయకట్టు రైతులకే కాకుండా.. గోదావరి ఆయకట్టు రైతులూ కష్టాల్లో కూరుకుపోతారని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కూడా అంతర్రాష్ట్ర జలవివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని, ఈ పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టుకు గోదావరి నుంచి ఏ విధంగా నీరిస్తారని ఆమె ప్రశ్నించారు. జలయజ్ఞం ద్వారా కోటి ఎకరాలకు సాగునీరందించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేసి రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేలా చేయాలని పరితపించిన వైఎస్సార్ ఆలోచనలకు కాంగ్రెస్ గండి కొట్టిందని విమర్శించారు.
మరి సంక్షేమ పథకాలు నడిపేదెలా?
‘‘విడగొట్టాలనుకునేవారికి రాజధాని ఇచ్చి.. కలిసి ఉండాలకునేవారిని కట్టుబట్టలతో బయటకు వెళ్ళగొడతారా? సీమాంధ్రలో ఎలాంటి ఆదాయమూ వచ్చే పరిస్థితి లేదు. అక్కడి వారు ఎలా బతకాలి?’’ అని విజయమ్మ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘అందరి హైదరాబాద్‌ను కొందరికే ఇస్తారా? 60 ఏళ్లుగా హైదరాబాద్‌ను మనదనే భావనతోనే అభివృద్ధి చేసుకున్నాం.
‘‘రాష్ట్ర ఆదాయంలో 45 శాతం హైదరాబాద్ నుంచే వస్తోంది. రాయలసీమ, ఆంధ్రాల నుంచి ఎనభై, తొంభై శాతం మంది ఇక్కడే సంస్థలు ఏర్పాటు చేశారు. ఐటీ రంగంలో రాష్ట్ర ఆదాయం రూ. 55 వేల కోట్లయితే, అందులో రూ. 54,800 కోట్లు ఒక్క హైదరాబాద్‌లోనే వస్తోంది. విభజిస్తే.. ఇవన్నీ ఇటువైపు వెళ్లిపోగా.. సీమాంధ్రలో మళ్లీ కొత్త రాజధానిలో కట్టాలంటేలక్షల కోట్లు కావాలి.. రాజధాని కట్టుకునేందుకే ఉన్న డబ్బంతా పోతే మరి సంక్షేమ పథకాలను నడిపేదెలా?’’ అంటూ విజయమ్మ కేంద్రాన్ని ప్రశ్నించారు.
విభజిస్తే జల యుద్ధాలే: వై.ఎస్.విజయమ్మ
Published Fri, Aug 23 2013 1:54 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement