విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కొండపల్లి కొండలరావు. గజపతినగరం ఎమ్మెల్యే కేఏ నాయుడు
ఇంట గెలవరు గానీ... రచ్చ గెలుస్తామంటూ ప్రగల్భాలు. సొంత అన్నతోనే సయోధ్య ఉండదు గానీ... జిల్లాలోనే చక్రం తిప్పాలని యత్నిస్తున్నారు. ఇదీ గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తీరు. ఇప్పుడు ఆయనకు సొంత అన్నే రెబల్‌గా మారుతున్నారు. అక్కడి టిక్కెట్‌కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తమ్ముడు చేసేవన్నీ అక్రమాలేనని బాహాటంగా చెబుతున్నారు. ఇదే విషయం పార్టీ అధినేత నుంచి జిల్లా నాయకుల వరకూ అందరికీ పనిగట్టుకుని మరీ వివరిస్తున్నారు. నిష్పాక్షికంగా అక్కడ అభివృద్ధి జరగాలంటే తనకే టిక్కెటివ్వాలంటూ కోరుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుకి సొంత ఇంట్లోనే కుంపటి తయారైంది. తాను ఎమ్మెల్యే టిక్కెట్టు రేసులో ఉన్నట్టు ఎమ్మెల్యేకు స్వయానా అన్న, మాజీ ఎంపీపీ కొండపల్లి కొండలరావు ప్రకటించారు.. కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది.. భీమసింగి షుగర్ ఫ్యాక్టరీ పాలకవర్గం నియామకాన్న తమ్ముడు నియమిస్తే అతనికి వ్యతిరేకంగా అన్న కోర్టులో కేసు వేయించి ఇటీవల విజయం సాధించారు. ఆ ఉత్సాహంతోనే బహిరంగంగా తమ్ముడిని ఢీకొట్టడానికి సిద్ధమయ్యారు. టీడీపీలో చోటుచేసుకున్న ఈ పరిణామం జిల్లాలో హాట్ టాపిగ్‌గా మారింది.
ఆది నుంచీ కుమ్ములాటలు
1982 నుంచి రాజకీయాల్లో ఉన్న కొండలరావు రెండుసార్లు ఎంపీపీగా, జిల్లా పార్టీ వైస్ ప్రెసిడెంట్‌గా, జిల్లా పార్టీ జాయింట్ సెక్రెటరీగా పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గజపతినగరం ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించారు. కానీ పార్టీ అతని సోదరుడైన కె.ఎ.నాయుడికి టిక్కెట్టు ఇచ్చింది. దీంతో కొండలరావు నామినేటెడ్ పోస్ట్‌కోసం తీవ్రంగా ప్రయత్నించారు. తమ్ముడు అడ్డుతగలడంతో వారి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. కనీసం భీమసింగి సుగర్‌ఫ్యాక్టరీ చైర్మన్ పదవి అయినా ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెచ్చారు. దానిక్కూడా నాయుడు అడ్డుకట్ట వేశారు. వేరే పాలకవర్గాన్ని నియమించారు. తనను కాదని వేరొకరికి పదవి ఇవ్వడాన్ని తట్టుకోలేని కొండలరావు తాను తెరవెనుక ఉండి పాలకవర్గం నియామకంపై స్థానికుల చేత కోర్టులో కేసు వేయించారు. ఫలితంగా పాలకవర్గాన్ని నియమిస్తూ విడుదలైన జీఓను న్యాయస్థానం ఇటీవలే రద్దు చేసింది.
తెరవెనుక ప్రయత్నాలు
కొండపల్లి కొండలరావు తన తండ్రి దివంగత ఎంపీ కొండపల్లి పైడితల్లినాయుడు రెండు పర్యాయాలు ఎంపీగా చేసినప్పుడు, జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్నప్పుడు అన్నీ తానై చూసేవారు. తండ్రి మరణానంతరం కొండబాబు రెండు సార్లు ఎంపీపీగా చేశారు. 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనంతరం జరిగిన పరిణామాల్లో మరలా సొంత గూటికి చేరారు. ఆర్థిక పరంగానూ బలాన్ని సమకూర్చుకుంటున్నారు. కొండలరావుకు విజయనగరం ట్యాంక్ బండ్ రోడ్డులో హోటల్ కొండపల్లి గ్రాండ్‌తో పాటు ఇరవైకి పైగా లారీలు ఉన్నాయి. గంట్యాడ మండలంలో రైస్ మిల్లులను నిర్వహిస్తున్నారు. ఇక్కడ మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సులను నడవనివ్వకుండా వారి ప్రైవేటు బస్సులనే నడిపిస్తున్నారు. పలు ప్రైవేటు విద్యా సంస్థల్లో వాటాలు ఉన్నాయి.
వీటన్నిటినీ చూపించి తాను అభ్యర్థిగా సరిపోతానంటూ అధిష్టానానికి చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి ఎ.ఎ.నాయుడు తన అన్నను పక్కన పెట్టారు. అప్పటి నుంచి కొండలరావు మండలాల్లో తనకుంటూ వర్గాలను తయారు చేసుకొని ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి పనులను సమయం వచ్చినపుడల్లా అధిష్టానానికి చేరవేస్తున్నారు. తన తమ్ముడు అవినీతిపరుడు కాబట్టి నియోజకవర్గంలో అతనికి జనం ఓట్లేసే అవకాశం లేదని చెబుతూ తాను టిక్కెట్టు పొందాలని చూస్తున్నారు. ఇంట గెలవలేని కె.ఎ.నాయుడు ఒక దశలో మంత్రి పదవికోసం ఎలా పాకులాడారన్న చర్చ ఇప్పుడు నియోజకవర్గంలో సాగుతోంది.
ఎమ్మెల్యేగా పోటీచేస్తా
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేస్తానని టీడీపీ సీనియర్‌నేత గజపతినరగం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు సోదరుడు కొండపల్లి కొండలరావు (కొండబాబు) శనివారం అతని కుమారుడు కొండపల్లి శ్రీనువాస్, వసాది మాజీ ఎంపీటీసీ కె.జగన్నాథం, టీడీపీ సీనియర్ నేత గుల్లిపల్లి ఆదినారాయణలతో కలిసి జామిలో విలేకరుల సమావేశం పెట్టి ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులను టీడీపీ అధిష్టానం మార్చే అవకాశం ఉందని అదే జరిగితే గజపతినగరం నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీచేస్తానన్నారు. తన అభిమతాన్ని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment