విద్యుత్ సేవలకు విఘాతం
సమ్మెలో 1,200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు
పలు సేవలకు బ్రేక్ కదలని అధికారుల వాహనాలు
ఆపరేటర్ల సమ్మెతో సబ్‌స్టేషన్‌లో సేవలకు అంతరాయం
అయినా స్పందించని ప్రభుత్వం
విజయవాడ : విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెతో ఆ శాఖ సతమతమవుతోంది. సబ్‌స్టేషన్లలో పనిచేసే ఆపరేటర్లు సమ్మెకు దిగడంతో పలు కీలక సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. అధికారుల వాహనాలకు డ్రైవర్లుగా, సబ్‌స్టేషన్‌లో షిఫ్ట్ ఆపరేటర్లుగా, బిల్లు రీడర్లుగా, బిల్లుల చెల్లింపు కేంద్రాల్లో ఆపరేటర్లుగా.. ఇలా పలు విభాగాల్లో పనిచేస్తున్న వారంతా సమ్మెకు దిగడంతో ఇబ్బందులు మొదలయ్యూరుు. జిల్లాలో మొత్తం 1,200 మంది వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండగా, విద్యుత్ శాఖలో ఆపరేటర్లుగానే 850 మంది పనిచేస్తున్నారు. వీరందరినీ రెగ్యులర్ చేస్తామని తెలుగుదేశంపార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొంది. అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా సీఎం చంద్రబాబునాయుడు దీని గురించి పట్టించుకోకపోగా, కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై సమీక్షలు నిర్వహించిన దాఖాలాలు కూడా లేవు.
ఈ క్రమంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘ నేతలు గతనెల 25వ తేదీన సదరన్ స్కామ్‌కు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈనెల 15వ తేదీ అర్ధరాత్రి నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు వెళ్తామని వారు ప్రకటించగా.. 23వ తేదీన ప్రభుత్వంతో చర్చలు జరుగుతాయని, సమ్మె ఉపసంహరించుకోవాలని డిస్కమ్ అధికారులు కోరారు. అరుుతే, వారి నుంచి స్పష్టమైన హామీ లేకపోవడంతో కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలోకి వచ్చారు. 15వ తేదీ నుంచే అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 16వ తేదీ నుంచి నిరవధిక దీక్షలు కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులను కలిసి వారి సమ్మెకు మద్దతు ప్రకటించడమే కాకుండా దీనిపై అసెంబ్లీలో పోరాడతానని ప్రకటించడంతో సమ్మె మరింత ఉధృతమైంది.
ఎక్కడి పనులు అక్కడే..
ప్రస్తుతం 180 సబ్‌స్టేషన్లలో మాత్రమే కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి సబ్‌స్టేషన్‌లో నలుగురు ఆపరేటర్లు, ఒక వాచ్‌మెన్ ఉన్నారు. అరుుతే, కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న స్థానాల్లో ఇప్పటికే సీనియర్ ఉద్యోగులు, ఆపరేటర్లను నియమించారు. ఉదాహరణకు విజయవాడ సబ్‌డివిజన్ పరిధిలోని 52 సబ్‌స్టేషన్లలో 316 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 93 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 53 మంది సమ్మెలో ఉన్నారు. వారి స్థానాల్లో రెగ్యులర్ ఉద్యోగులను నియమించారు. అయితే, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మె వల్ల విద్యుత్ శాఖ అధికారుల వాహనాలు కార్యాలయాలకే పరిమితమయ్యాయి. బిల్లు రీడర్లు కూడా సమ్మెలో ఉండటంతో బిల్లులు ఇంటింటికీ రాని పరిస్థితి ఏర్పడింది. సబ్‌స్టేషన్‌లో బేర్, లైన్ కటింగ్ సమస్యలతో పాటు మానిటరింగ్.. వంటి అనేక సేవలకు ఇబ్బంది కలుగుతోంది. కంప్యూటర్ ఆపరేటర్లు కూడా లేకపోవటంతో శాఖాపరమైన పనులకు కూడా బ్రేక్ పడింది.